గజ్వేల్, మార్చి 17: కాంగ్రెస్ పాలనలో ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులు ఉన్నాయని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్చార్జి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. హామీలపై ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకులను, జర్నలిస్టులను కేసులతో బెదిరించి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను ఇస్తారనే ఆశతో ప్రజలు రేవంత్‌రెడ్డి మాటలు విని ఓట్లేసి మోసపోయారని, 420 హామీలు అమలుకాకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ నోటినుంచి దూషణలు తప్ప మంచి మాటలు రావడం లేదని విమర్శించారు. సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని పేర్కొన్నారు.
డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, హామీల గురించి ప్రశ్నిస్తే కేసులు పెట్టిస్తూ ప్రభుత్వం రాక్షసానందం పొందుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే అవినీతి, అక్రమాలు, స్కామ్‌లు అని ఆరోపించారు. రైతులు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కూడవెల్లి, హల్దీ వాగుల్లోకి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని వంటేరు ప్రతాప్‌రెడ్డి కోరారు.