గజ్వేల్, అక్టోబర్ 3 : మూసీ ప్రక్షాళన పేరుతో దోచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌ను భారీగా పెంచిందని,ఆనాడు రూ.16వేల కోట్లతో ప్రక్షాళన చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైందని, కానీ నష్టపోతున్న బాధితుల విజ్ఞప్తి మేరకు వెనక్కి తగ్గిందని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంతో పోల్చితే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షా 50వేల కోట్లతో ప్రణాళిక రూపొందించిందన్నారు.
గతంలో కిలోమీటరుకు రూ.170కోట్లు ఖర్చు అవుతాయని ప్రణాళిక రూపొందించగా, నేడు కిలోమీటరుకు రూ.2700 కోట్లు ఖర్చు అవుతాయని పేర్కొంటున్నారు. మూసీపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ అందులోనే దుంకుతామని మాట్లాడుతుండగా, మరో మంత్రి కొండా సురేఖ సభ్యసమాజం తలదించుకునేలా మహిళ అన్న విషయాన్ని మరిచి సినీనటి సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేసిందన్నారు. మహిళా మంత్రి సురేఖకు మహిళలపై ఏమాత్రం గౌరవంలేదని, సమంతపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
పది నెలల కాలంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.90వేల కోట్ల అప్పు చేసిందని, రాష్ట్రంలో ఎలాంటి కొత్త పథకాలను ప్రారంభించలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సురేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, మైనంపల్లి మాట్లాడుతున్న భాష తీరును చూస్తే రాష్ట్ర ప్రజలు తలదించుకునేలా ఉన్నాయన్నారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం చేపడుతున్న కూల్చివేతలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని, వెంటనే హైడ్రాను ఉపసంహరించుకోవాలని వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి, ఉచిత బస్సు తప్ప మరోటి అమలుచేయలేదన్నారు. త్వరలోనే రుణమాఫీపై రాజీవ్ రహదారిని దిగ్భందనం చేస్తామన్నారు. అనంతరం మైనంపల్లి హన్మంతరావుపై గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కా ర్య క్రమంలో మాజీ జడ్పీటీసీ మల్లేశం, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, కౌన్సిలర్లు రజిత, మెట్టయ్య, చందు, నాయకులు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్ రెడ్డి, గుంటుక రాజు, రమేశ్‌గౌడ్, బొల్లారం ఎల్లయ్య, ఆర్కే శ్రీను, కల్యాణ్కర్ శ్రీను, అమర్, నిజాం, హన్మంతరెడ్డి, శివకుమార్, నాగులు, ఎల్లం తదితరులున్నారు.