కొండపాక, ఏప్రిల్ 3: కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దెడలో ఎండిపోయిన వరి పొలాలను శుక్రవారం గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి రైతు సంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి అసమర్థత పాలనతో విద్యుత్ సక్రమంగా సరఫరా కాక, సాగునీళ్లు అందక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నట్లు తెలిపారు. గ్రామానికి చెందిన పుట్ట మల్లేశం మూడెకరాల్లో వరి పంట సాగుచేయగా, విద్యుత్ సమస్యలతో రెండెకరాల పొలం పూర్తిగా ఎండిపోయిందన్నారు. ప్రభుత్వం సిద్దిపేట జిల్లాపై సవితితల్లి ప్రేమ చూపకుండా 24గంటల విద్యుత్ సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ హున్నాబాద్ ఏరియాలో రైతులకు 18 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నారని, సిద్దిపేట డివిజన్లో రైతులపై ఎందుకు వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డా రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కష్టాలు, ఆత్మహత్య చూసి కేసీఆర్ ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తుచేశారు.
కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రంగనాయకసాగర్లాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేసి ఎడారిగా ఉన్న రాష్ట్రాన్ని పచ్చని పొలాలతో కళకళలాడే విధంగా చేశారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నూనె కుమార్, నాయకులు అనంతుల ప్రశాంత్, రాగళ్ల దుర్గయ్య, దోమల ఎల్లం, సంజీవరెడ్డి, సర్పంచ్‌లు గాలి బాలయ్య, మల్లేశం, కరుణాకర్, నాయకులు పెద్దెంకుల శ్రీనివాస్‌గౌడ్, అమ్ముల రమేశ్, ఐలయ్య, సురేందర్‌రెడ్డి, మైపాల్‌రెడ్డి, పిల్లి నాగులు, ముత్యాల కనకయ్య, శ్రీనివాస్, నీల నరసింహులు, నీల వెంకటేశ్, చిలుముల రామ్మోహన్, ప్రసాద్, సెల్ బాలనరసయ్య, ముత్యాల విష్ణు, రైతులు పాల్గొన్నారు.