వరంగల్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి అండగా నిలువాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ తరఫున పెద్ది కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు. ఇందులో సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లలకు రూ. కోటి చొప్పున అందజేయనున్నారు. ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ.25 లక్షలను ఆమె పేరిట బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఆయన పిల్లల భవిష్యత్తు, వారి చదువు, తదితర కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు పార్టీ సీనియర్లతోపాటు వరంగల్ జిల్లా పార్టీ సీనియర్ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ కార్యక్రమం ముగిసిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్యులు కూర్చొని ఆయన కుటుంబానికి అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారనీ, వారికి ఎల్లకాలం పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ అభయం ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం నర్సంపేటకు వెళ్లనున్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ తన ముఖ్య అనుచరుడిగా కొనసాగిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణంతో విషాదంలో ఉన్న అధినేత కేసీఆర్.. తన ఆప్తమిత్రుడు, ఉద్యమ సహచరుడి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్ది స్వగృహానికి చేరుకొని, కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వన్నారు. అలాగే నర్సంపేట నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ది అభిమానులకు కేసీఆర్ గుండె ధైర్యం ఇవ్వనున్నారు.

గత నెల 26వ తేదీన పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురై దవాఖానలో చేరిప్పటి నుంచి ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ రెండు వారాలపాటు ఆయన నామస్మరణ చేస్తున్నది. రాజకీయ పార్టీల చరిత్రలో ఇది అరుదైన విషయమని అన్ని పార్టీల్లోనూ చర్చసాగుతున్నది. పార్టీని నమ్ముకొని ఉంటూ, నిజాయితీగా, చిత్తశుద్ధితో పనిచేసిన కార్యకర్త తీవ్ర అస్వస్థతకు గురై, అకాలమరణం పాలైతే పార్టీ యావత్తు ఆ కుటుంబానికి అండగా నిలువడం అసాధారణ విషయమని స్పష్టం చేస్తున్నారు. పార్టీ 26 ఏండ్ల ప్రయాణంలో బీఆర్ఎస్కు, ప్రత్యేకించి పార్టీ అధినేత కేసీఆర్‌కు దగ్గరైన అత్యంత సన్నిహితుల్లో పెద్ది ముందు వరుసలో ఉంటారు.
అలాగే, అధినేత కేసీఆర్ నమ్మకాన్ని ఏనాడూ వమ్ముచేయని కార్యకర్తగా పెద్ది సుదర్శన్‌రెడ్డి మెలిగారు. ఉద్యమ సమయంలో సుదర్శన్‌రెడ్డి పోషించిన పాత్రకు, ఎమ్మెల్యేగా ఒక్కసారే పనిచేసినా నర్సంపేట నియోజకవర్గం శాశ్వత పురోభివృద్ధికి ఆయన వేసిన రోడ్‌మ్యాప్ ప్రజల గుండెల్లో ఏ స్థాయిలో నిలిచిందో ఆయన అంతిమయాత్రే లోకానికి తెలియజేసింది. పెద్ది వ్యక్తిగా మరణించారు గానీ ఇటు పార్టీలో, అటు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేశారనేది చాటి చెప్పింది. రాజకీయ పార్టీలు తమ అవసరాల కోసం క్యాడర్‌ను ఇష్టారీతిగా వాడుకుంటూ, తమ ప్రయోజనాలే ధ్యేయంగా సాగుతున్న తరుణంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి వ్యవహారంలో బీఆర్ఎస్ చూపిన చొరవ, ఆయన కుటుంబానికి అండగా నిలిచిన వైనం అసామాన్యం అని అన్ని పార్టీల నాయకులు ప్రశంసిస్తున్నారు.