మెదక్, ఏప్రిల్19 (నమస్తే తెలంగాణ) : ప్రణాళికాబద్ధంగా యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ డాక్టర్ బీఆర్ అంబేదర్ సచివాలయం నుంచి ఆయన సన్నబియ్యం సరఫరా, యాసంగి ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్. చౌహాన్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు నర్సాపూర్ ఆర్టీవో కార్యాలయం నుంచి మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్, పౌర సరఫరాల అధికారి సురేశ్‌రెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని ఆదేశించారు. దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. వానకాలంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, యాసంగిలో 127.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా యాసంగి పంట సజావుగా కొనుగోలు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు అంశంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి పర్యవేక్షణ చేయాలన్నారు.
రైస్ మిల్లర్లు తాలు, తరుగు పేరుతో కోతలు లేకుండా కొనుగోలు చేసేవిధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అందుకు అనుగుణంగా జిల్లాల్లో ఐకేపీ, సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లో ఎకడైనా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పరికరాల కొరత ఉంటే తక్షణమే కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు.
మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాం టి ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కొనుగోలు సన్నద్ధతపై ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సహకార సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి రూ.2320, బీ గ్రేడ్ రకానికి రూ.2300 సూచించే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 శాతం కొనుగోలు కేంద్రాలు మహిళా సమాఖ్యలకు కేటాయిస్తున్నామని, గ్రామ సమాఖ్యలకు ధాన్యం కొనుగోలుపై డీఆర్డీఏ ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో షామియానాలు, తాగునీరు, ప్యాడీ క్లీనర్, మాయిశ్చర్స్, తూకం యంత్రా లు, టార్పాలిన్లు, వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటు లో ఉంచుతున్నామని తెలిపారు. సన్నరకం, దొడ్డు రకం ధాన్యం విడి విడిగా కొనుగోలు చేసేందుకు వీలుగా మారింగ్ చేయనున్నట్లు తెలిపారు.