హుస్నాబాద్, సెప్టెంబర్ 15: యూరియా కోసం రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఎరువుల దుకాణం ఎదుట ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా యూరియా కోసం రైతులు బారులు తీరారు. పట్టణంలోని మెయిన్‌రోడ్డు దుకాణంలోకి యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకొని గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. ఒక్కొక్కరికి ఒక బస్తా యూరియా ఇవ్వడంతో అదే బంగారం అనుకొని తీసుకెళ్లారు. మరికొందరు రైతులకు యూరియా దొరకక నిరాశతో ఇంటిముఖం పట్టారు.
చేర్యాల, సెప్టెంబర్ 15 : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ముస్త్యాలలో రైతులు యూరియా కోసం తిప్పలు పడ్డారు.యూరియా వస్తుందని తెలియగానే గ్రామంలోని రైతువేదిక వద్దకు వెళ్లి క్యూ కట్టి టోకెన్ తీసుకున్నారు.అనంతరం ఎరువుల దుకాణాల వద్దకు వెళ్లి క్యూకట్టి టోకెన్లు అందజేసి ఒక్కో బస్తా తీసుకుపోయేందుకు గంటల పాటు వేచి ఉండి ఇబ్బందులు పడ్డారు.
మద్దూరు(ధూళిమిట్ట), సెప్టెంబర్15: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. నెల రోజుల నుంచి యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా మద్దూరులో సొసైటీ క్యాష్ కౌంటర్ వద్ద యూరియా కోసం రైతులు ఉదయం నుంచే బారులుదీరారు. గంటకొద్ది క్యూలో నిలబడినా యూరియా దొరకకపోవడంతో కొంతమంది రైతులు నిరాశతో వెనుదిరిగారు. సరిపడా యూరియా, ఎరువులు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగదేవపూర్, సెప్టెంబర్15: యూరియా కోసం సోమవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌లోని గాంధీ చౌరస్తాలో రోడ్డెక్కి రైతన్నలు నిరసన వ్యక్తం చేశారు. అదును దాటిపోతున్నా అవసరమైన యూరియా అందించడంలో కాంగ్రెస సర్కారు పూర్తిగా విఫలమైందని ఆన్నదాతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.అనంతరం గాంధీ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. నిరసన తెలుపుతున్న అన్నదాతలకు బీఆర్ఎస నాయకులు బుద్ద నాగరాజు, ఎక్బాల్, దాచారం కనకయ్య మద్దతు తెలిపారు.
సిర్గాపూర్, సెప్టెంబర్ 15: యూరియా కోసం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని కడ్పల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి సోమవారం యూరియా వచ్చింది. స్థానిక పీఏసీఎస్‌కు కేటాయించిన 300 బస్తాలు దించారు. మిగతా యూరియా బొక్కస్‌గాం పీఏసీఎస్ సొసైటీకి తరలిస్తుండగా గ్రామ రైతులు అడ్డుకొని మొత్తం బస్తాలు ఇక్కడే దించాలని పట్టుబట్టారు. సొసైటీ అధికారులు, వ్యవసాయాధికారులతో మాట్లాడారు. ఏవో హరికృష్ణ గ్రామాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి సముదాయించారు. మరోలోడు యూరియా తెప్పించి సమస్య పరిష్కరిస్తామని ఏవో హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అనంతరం గ్రామంలోని 330 మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా అందజేశారు. ఈకార్యక్రమంలో సెక్రటరీ శ్రీకాంత్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
బెజ్జంకి, సెప్టెంబర్ 15: యూరియా కోసం సిద్దిపేట జిల్లా బెజ్జంకిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట రైతులు ఇటుకలు, రాళ్లు క్యూలో పెట్టారు. యూరియా రావడం లేదని అధికారులు తెలుపడంతో నిరాశతో వెనుదిరిగారు.