దుబ్బాక, జూలై 28: యూరియా కోసం అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. యూరియా కొరత కారణంగా రైతులకు సమస్యగా మారింది. నిత్యం యూరియా దుకాణాల వద్ద రైతులు ఆరా తీస్తున్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని ఆగ్రోస్ కేంద్రాలకు యూరియా వస్తుందన్న విషయం తెలుసుకున్న రైతులు ఉదయం నుంచి బారులు తీరారు. ఒక బస్తా యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొన్నది.
దుబ్బాకలో పీఏసీఎస్ కార్యాలయంతో పాటు మరో రెండు ఆగ్రోస్ కేంద్రాలకు మొత్తం 65 టన్నుల యూరియా వచ్చింది. యూరియా కోసం వేకువజాము నుంచి రైతులు పడిగాపులు కాశారు. సాగు విస్తీర్ణాన్ని బట్టి రైతులకు ఒకటి లేదా రెండు బస్తాలు యూరియా బస్తాలు ఇచ్చారు. దీంతో చాలామంది రైతులకు యూరియా లభించక నిరాశతో వెనుదిరిగారు.
జహీరాబాద్, జూలై 28: యూరియా కోసం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు వ్యవసాయ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. వానకాలం సీజన్లో సాగు చేసిన సోయాబీన్, పత్తి, మినుము, పెసర, మొక్కజొన్న తదితర పంటలు ఎదిగేందుకు యూరియా అవసరం ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని హద్నూర్ సొసైటీకి యూరియా కోసం రైతులు తరలివచ్చారు. ఎకరానికి ఒక యూరి యా బస్తా, ఆపైన ఎన్ని ఎకరాలు ఉన్నా ఐదు బస్తాల వరకు రైతులకు ఇచ్చారు.
ఇది వరకు పదికి పైగా యూరియూ బస్తాలు ఇచ్చినట్లు సహకార సంఘం అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం యూరియాకు డిమాండ్ ఉండడంతో ప్రతి రైతుకు యూరియా ఇవ్వాలనే లక్ష్యంతో ఎకరానికి ఒకటి చొప్పున ఇస్తున్నామన్నారు. యూరియా స్టాక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవని, రైతులకు అవసరం మేరకు యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో సరిపడా యూరియా సరఫరా చేసిందని, కాంగ్రెస్ పాలనలో యూరి యా కోసం గోస తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.