ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యూరియా కష్టాలు తగ్గడం లేదు. రైతులకు అదునుకు ఎరువు అందకపోవడంతో ధర్నాలు, ఆందోళనలు, రాస్తారో కోలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ధారూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం నిల్చున్న రైతన్నలను పరామర్శించారు. అనంతరం రైతులు, బీఆర్ఎస్ మండల నాయకులతో కలిసి మండల కేం ద్రంలోని అంబేద్కర్ చౌరస్తా ప్రధాన రోడ్డులో బైఠాయించి ధర్నా నిర్వహించారు.
అదేవిధంగా యూరియా కొరత తీర్చాలని పరిగిలోని ఆగ్రోస్ ఎదు ట జాతీయ రహదారిపై అన్నదాతలు రాస్తారోకో చేపట్టగా మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మద్దతు ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నారు. రైతుల కు సరిపడా యూరియా అందించడంలో సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. షాబాద్ సహకార సంఘం కార్యాలయానికి వచ్చిన రైతులకు అధికారులు స్టాక్ లేదని చెప్పడంతో ఆగ్రహం చెందిన అన్నదాతలు ముంబై-బెంగళూరు లింకు జాతీయ రహదారిపై ధర్నాకు దిగి, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ధారూరు, ఆగస్టు 29 : రైతన్నకు సరిపడా యూరియా అందించాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మె ల్యే మెతుకు ఆనంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం క్యూలో నిల్చున్న పలువురు అన్నదాతలను పరామర్శించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన కార్యాలయం ఎదుట రైతులు, బీఆర్ఎస్ మండల నాయకులతో కలిసి నిరసన తెలిపి.. అక్కడి నుంచి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా ప్రధాన రోడ్డులో నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ అన్నదాతలు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తున్నదని మండిపడ్డారు. ఉదయం నుంచే మహిళలు, వృద్ధులు, యువకులు పీఏసీఎస్‌ల ఎదుట పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి, స్పీకర్ ప్రజలను గాలికి వదిలేశారన్నారు. యూరియా కోసం రైతులు ఎన్ని విన్నపాలు చేసినా.. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా వారు పట్టించుకోవడం లేదన్నారు.
ఒలింపిక్స్ నిర్వహించాలన్న ఆలోచనను తర్వాత చేయొచ్చునని..ముందు అన్న దాతల కష్టాలను తీర్చాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ‘స్పీకర్ గారు.. మీకు ఓట్లేసి గెలిపించిన వికారాబాద్ ప్రజల గురిం చి ముఖ్యంగా రైతుల కష్టాల గురించి ఆలోచించండి. వికారాబాద్‌లో యూరియా కో సం తిప్పలు పడుతున్న రైతులను కలవండి.. అన్నదాతలు కష్టాల్లో ఉంటే మీరు హైదరాబాద్‌లో ఉండడం సమంజసం కాదన్నారు’. కాగా రోడ్డుపై బైఠాయించిన వారిని పోలీసులు సముదాయించి పక్కకు పంపించా రు.
ఈ సందర్భంగా అన్నదాతలు అవస్థలు పడుతున్నా.. సర్కార్ పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు దున్నపోతు ఎదుట నిరసన తెలిపారు. నిరసనలో బీఆర్ఎస్ పార్టీ ధారూరు మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, వెంకట్రామ్రెడ్డి, జైపాల్‌రెడ్డి, యాత్రగౌడ్, లక్ష్మయ్య, బాల్‌రాజ్, దేవేందర్‌నాయక్, శశిధర్‌రెడ్డి, వెంకటయ్య, రాములు, అనంత య్య, భీమ్సేన్చారి, మహేశ్, చిన్నయ్యగౌ డ్, సుదర్శన్‌యాదవ్, నర్సింహులు, బుగయ్య, రైతులు పాల్గొన్నారు.
షాబాద్ : రైతులు యూరియా కోసం శుక్రవారం షాబాద్ సహకార సంఘం కార్యాలయానికి వచ్చారు. స్టాకు లేదని అక్కడి అధికారులు చెప్పడంతో ఆగ్రహానికి గురైన వారు ముంబై-బెంగళూరు లింకు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ధర్నా చేస్తున్న రైతులకు బీఆర్ఎస్ శ్రేణులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఎరువులు, విత్తనాల సరఫరా ఎప్పుడూ ఇబ్బంది కలుగలేదన్నారు.
ఓట్ల కోసం ప్రజలకు అనేక హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ కో-ఆప్షన్ సభ్యుడు చాంద్‌పాషా, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యాదయ్య, మాజీ సర్పంచులు దర్శన్, శేఖర్, బీఆర్ఎస్ గ్రామ మాజీ అధ్యక్షుడు రాజుగౌడ్, గోపాల్, ఆయా గ్రామాల రైతులు, మహిళలు పాల్గొన్నారు.
షాద్‌నగర్ టౌన్ : షాద్‌నగర్ పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం నుంచే రైతు లు బారులుతీరారు. యూరియా కోసం యువకులు, వృద్ధులు క్యూలో నిలబడగా, మరికొందరు తమ భార్యలతో వచ్చి నిరీక్షించారు. సరిపడా యూరియా అందకపోవడంతో ఇబ్బందికి గురయ్యారు. రోజుల తరబడిగా యూరియాకోసం నిరీక్షిస్తున్నా సరిపడా అందడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీఏసీఎస్ కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తు మధ్య యూరియాకు సంబంధించిన స్లిప్పులను పంపిణీ చేశారు. ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా ను సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రైతులకు సరిపడా అందించాలి రైతులకు సరిపడా అందించాలి. యూరియా కోసం వారం రోజులుగా తిరుగుతున్నా లేదని చెబుతున్నారు. సాగు చేసిన పంటలకు యూరియా లేక ఇబ్బంది పడుతున్నా. రైతులకు నష్టం కలిగించకుండా చూడాలి. రైతులకు సహకరించాలి.
-కుమార్, రాసుమల్లగూడ, ఫరూఖ్‌నగర్