మిరుదొడ్డి/దుబ్బాక, ఫిబ్రవరి 23: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంతోపాటు మిరుదొడ్డి మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో సోమవారం అకాల వర్షం బీభత్సం సృష్టించింది. టామాట, మిర్చి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మిరుదొడ్డి పెద్ది రాజుకు చెందిన రెండు ఎకరాలు, మొగుళ్ల రాములుకు చెందిన రెండు ఎకరాలు, మొగుళ్ల లక్ష్మణ్‌కు చెందిన రెండు ఎకరాలు, కందూరి కుంటయ్యకు చెందిన రెండు ఎకరాల చొప్పున ఎనిమిది ఎకరాల మొక్కజొన్న పంటనెలకొరిగింది.
ధర్మారంలో వడగండ్లకు స్వామి అనే రైతు పశువుల కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. షెడ్డు రేకులు లేచిపోయి పశువులపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. దుబ్బాక టీటీడీ కల్యాణ మంటపం సమీపంలో చెట్లు రోడ్డుపై పడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అకాల వర్షం వల్ల నష్టపోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.