స్వరాష్ట్రంలో సిద్దిపేట నియోజకవర్గం అవార్డుల ఖిల్లాగా.. అభివృద్ధికి అడ్డాగా మారింది. అభివృద్ధి, సంక్షేమం, వినూత్న కార్యక్రమాల అమలులో ఈ నియోజకవర్గం ముందు వరుసలో ఉన్నది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులు సాధించి సత్తాచాటింది. మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆధ్వర్యంలో విద్య, వైద్యం, రోడ్లు, సాగు, తాగునీరు, మౌలిక వసతుల కల్పనలో జిల్లా అద్భుతమైన ప్రగతిని సాధించింది. దశాబ్దాల ఆకాంక్షలను సాకారం చేస్తూ సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాతో పాటు ప్రభుత్వ మెడికల్ కళాశాల, నూతన సమీకృత కలెక్టరేట్, ఐటీ టవర్ ఏర్పాటు చేశారు.
సిద్దిపేట నర్సాపురం వద్ద ఒకేచోట 45 ఎకరాల విస్తీర్ణంలో 2460 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేదలకు అందించారు. సిద్దిపేట ప్రజలకు రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వ్యవసాయ రంగంలో అద్భుత ఫలితాలు సాధించింది. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్-పెద్దకోడూరు గ్రామాల శివారులో శ్రీరంగనాయక సాగర్ రిజర్వాయర్‌ను నిర్మించింది. ప్రభుత్వం టూరిజం హబ్‌గా దానిని అభివృద్ధి చేస్తున్నది. సమైక్య రాష్ట్రంలో ఒక పంటకు నీళ్లందలేని పరిస్థితి నుంచి ప్రస్తుతం రైతులు ఏటా మూడు పంటలు పండిస్తున్నారు.
– సిద్దిపేట, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, అక్టోబర్ 16 (మస్తే తెలంగాణ ప్రతినిధి): స్వరాష్ట్రంలో సిద్దిపేట నియోజకవర్గం రాష్ర్టానికే ఆదర్శంగా మారింది. అభివృద్ధి, సంక్షేమం, వినూత్న కార్యక్రమాల అమలులో ఈ నియోజకవర్గం ముందున్నది. జాతీయ,రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులు సాధించి సత్తాచాటింది. విద్య, వైద్యం, రోడ్లు, సాగునీరు, తాగునీరు, మౌలిక వసతులు, అనేక రంగాల్లో అద్భుతమైన మౌలిక వసతులు మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో సమకూరాయి.
చిన్నకోడూరు మండలం చంద్లాపూర్-పెద్దకోడూరు గ్రామాల శివారులో శ్రీరంగనాయక సాగర్ రిజర్వాయర్‌ను 3 టీఎంసీల సామర్థ్యంతో సీఎం కేసీఆర్ నిర్మించడంతో సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నంగనూరు, నారాయణరావుపేట, చిన్నకొడూరు, బెజ్జంకి మండలాల్లోని 51 గ్రామాల్లో 76,931 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. రంగనాయక్ ప్రాంతాన్ని ప్రభుత్వం టూరిజం పరంగా అభివృద్ధి చేస్తున్నది. మంత్రి హరీశ్‌రావు విన్నపం మేరకు సీఎం కేసీఆర్ రంగనాయకసాగర్ టూరిజం కోసం రూ.125 కోట్లు కేటాయించడంతో పనులు జరుగతున్నాయి.
దశాబ్దాల ఆకాంక్షలను సాకారం చేస్తూ సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాను 2016 అక్టోబర్ 16న ఏర్పాటు చేశారు. జిల్లా ఏర్పాటుతోనే సిద్దిపేటకు పోలీస్ కమిషనరేట్ హోదా రావడంతో ఆధునిక హంగులతో నూతన భవనం ఏర్పాటు చేశారు. నూతన సమీకృత కలెక్టరేట్ నిర్మించారు. కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. పాలన చేరువైంది.
సిద్దిపేటలో సీఎం కేసీఆర్ సహకారం, మంత్రి హరీశ్‌రావు కృషితో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటైంది. 2018లో కేవలం150 మంది వైద్యవిద్యార్థులతో ప్రారంభమైన వైద్య కళాశాల నేడు 875 మందికి చేరింది. 13 పీజీ కోర్సుల్లో 61 మంది మెడిసిన్ పీజీ చేస్తున్నారు. బీఎస్సీ పారామెడికల్ సైన్స్ కోర్సు సైతం అందుబాటులో ఉన్నది. ప్రస్తుతం ఈ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్న 150 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు సిద్దిపేట ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఇంటర్న్‌షిప్ చేస్తూ రోగులకు 24గంటల పాటు సేవలందిస్తున్నారు. ఇకపై ప్రతి సంవత్సరం 175మంది డాక్టర్లు ఇదే విధంగా సేవలందిస్తారు. సిద్దిపేట మెడికల్ హబ్‌గా మంత్రి హరీశ్‌రావు తీర్చిదిద్దారు. హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేకుండా అన్ని వైద్యసేవలు సిద్దిపేటలోనే అందుబాటులో ఉన్నాయి.
సిద్దిపేట నర్సపురం వద్ద ఒకేచోట 45 ఎకరాల విస్తీర్ణంలో 2460 ఇండ్లను జీ+2 పద్ధతిలో నిర్మించి పేదలకు అందించారు. ఒక్కోబ్లాక్లో 12, మొత్తం 250 బ్లాక్‌లు ఒకేచోట కట్టించి ఇచ్చారు. కష్ట జీవులు వాటికి ఇవ్వాళ యజమానులయ్యారు. సీఎం కేసీఆర్ సార్ మా దేవుడంటూ వారి ఇంటిలో ఫొటో పెట్టుకొని పూజిస్తున్నారు.
ఒక ప్రాంతం పురోగతి సాధించాలంటే మెరుగైన రవాణా సౌకర్యాలు ఉండాలి. సిద్దిపేట నియోజకవర్గంలోని రహదారులను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇరుకు రోడ్లను నాలుగు లేన్లుగా, మట్టిరోడ్లను డబుల్ రోడ్లుగా, రవాణా సౌకర్యమే లేని ప్రాంతాలకు చకని రహదారులను నిర్మించేలా కృషి చేశారు. నేషనల్ హైవేలు.. రింగు రోడ్లు జాతీయ రహదారుల జాబితాలో సిద్దిపేటకు చోటు దకింది. మెదక్ ఎలతుర్తి హైవే, సిరిసిల్ల-జనగామ హైవేలు సిద్దిపేట మీదుగా సాగుతున్నాయి. పెరిగిన వాహనాల రద్దీతో సిద్దిపేట చుట్టూ ఇప్పటికే బైపాస్ రోడ్డును ఏర్పాటు చేయగా.. సిద్దిపేట నియోజకవర్గంలోని గ్రామాలకు అనుసంధానంగా రూ.160 కోట్లతో 70 కి.మీల రింగురోడ్డు నిర్మాణం చకచకా సాగుతోంది. రాజీవ్ రహదారి నుంచి సిద్దిపేటలో ప్రవేశించే జంక్షన్ వద్ద ప్రమాదాలు నివారించడానికి రూ.30కోట్లతో భారీ ఫె్లైఓవర్ నిర్మించారు.
సిద్దిపేట నియోజకవర్గ రైతులు వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఒక పంటకు కూడా నీళ్లందలేని పరిస్థితి నుంచి ప్రస్తుతం ఏటా మూడు పంటలు పండిస్తున్న రైతులు ఎంతోమంది ఉన్నారు. తొండలు గుడ్లు పెట్టని భూములు,నెర్రలువారిన బీడు భూములు సైతం నేడు పచ్చని పంటలతో సిరిసంపదలు సృష్టిస్తున్నాయి. రంగనాయకసాగర్‌తో గోదావరి నీళ్లు, చెరువులు,కుంటలు,చెక్‌డ్యాముల అభివృద్ధితో భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్నాయి. కరువుతో అల్లాడిన సిద్దిపేట నేడు కల్పతరువుగా మారి వరి, పత్తి, మొకజొన్న, కూరగాయలు, తోటల సాగులో ఆదర్శంగా నిలిచింది. 2014 సంవత్సరానికి ముందు సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా 19వేల ఎకరాల సాగు చేచగా.. ప్రస్తుతం 90వేల ఎకరాల్లో వరి సాగుకావడం వెనుక మంత్రి హరీశ్‌రావు కృషి ఉంది.
ఒకనాడు గుకెడు తాగునీటికి ఇబ్బందులు పడిన సిద్దిపేట ప్రాంత ప్రజల కోసం ఆనాడు కేసీఆర్ మానేరు నుంచి పైపులైన్ ద్వారా మంచినీళ్లు తీసుకొచ్చి భగీరథ ప్రయత్నం చేసి సఫలమయ్యారు. ప్రజల తాగునీటి కష్టాలను నెరవేర్చారు.నేడు నెత్తిమీద నీళ్లకుండలా ఉన్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి సిద్దిపేటకు మంచినీళ్లు తేవడానికి మంత్రి హరీశ్‌రావు శ్రీకారం చుట్టారు. మానేరు ద్వారా సిద్దిపేటకు మంచినీటి సరఫరా కోసం అయ్యే ఖర్చు నెలకు రూ.55 లక్షలు కాగా.. మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలిస్తే కేవలం నెలకు రూ.18లక్షలే అవుతున్నది. ప్రతినెలా రూ.30లక్షల మిగులుబాటుతో పాటు స్వచ్ఛమైన గోదావరి జలాలను సిద్దిపేట పట్టణంతో పాటు నియోజకవర్గంలోని గ్రామాలకు సరిపడా అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇందుకోసం మల్లన్నసాగర్ రిజర్వాయర్ మంగోల్‌లో వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంటు నిర్మించి అకడ నుంచి లకుడారం పంపుహౌస్ ద్వారా సిద్దిపేటకు ప్రత్యేక కెనాల్ గుండా తాగునీటిని తేనున్నారు.సిద్దిపేట చుట్టూ వాటర్ రింగ్ మెయిన్ రూపంలో భారీ పైపులైన్‌ను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఇది పూర్తవుతున్నది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు ప్రకటిస్తే అందులో సిద్దిపేట నియోజకవర్గం పేరు తప్పకుండా ఉంటుంది. సిద్దిపేట నియోజకవర్గాన్ని మంత్రి హరీశ్‌రావు అన్ని రంగాల్లో తీర్చిదిద్దడం మూలంగానే ఇవి సాధ్యమవుతున్నాయి. మంత్రి హరీశ్‌రావు సంకల్పం, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ప్రజల భాగస్వామ్యమే ఇందుకు కారణం.సిద్దిపేట నియోజకవర్గానికి వచ్చిన అవార్డులను పరిశీలిస్తే 2012- క్లీన్ సిటీ చాంపియన్ షిప్ అవార్డు-రాష్ట్ర స్థాయి,2015 ఎక్సలెన్స్ అవార్డు (పారిశుధ్య నిర్వహణ)- జాతీయ స్థాయి, 2016ఎక్సలెన్స్ అవార్డు (పారిశుధ్య నిర్వహణ)- జాతీయ స్థాయి, 2016 హరిత మిత్ర అవార్డు- రాష్ట్ర స్థాయి,2016 సోచ్ అవార్డు (చెత్త సేకరణ)- జాతీయ స్థాయి,2016 మరుగుదొడ్ల నిర్మాణంలో ఓడీఎఫ్ సర్టిఫికెట్ జాతీయస్థాయి, 2016 ఎక్సలెన్స్ అవార్డు- రాష్ట్ర స్థాయి, 2017 రాష్ట్రీయ స్వచ్ఛ భారత్ పురసార్ జాతీయ స్థాయి,2017 ఉత్తమ మున్సిపాలిటీ అవార్డు ఇలా ఎన్నో సిద్దిపేట మున్సిపాలిటీకి వచ్చాయి.
నాడు ఎన్నికల నినాదాలు, గోడల మీద రాతలుగా ఉన్న అనేక హామీలు సీఎం కేసీఆర్ సహకారం, మంత్రి హరీశ్‌రావు కృషితో సాకారమయ్యాయి. సిద్దిపేట ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూసిన రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం రోజుకు నాలుగు ట్రిప్‌లు సిద్దిపేట- సికింద్రాబాద్ మధ్యన రైలు నడుస్తున్నది. మంత్రి హరీశ్‌రావు వెంటపడి రైలు లైన్ పూర్తి చేయించారు.
సిద్దిపేటలో ఐటీ టవర్ ఏర్పాటైంది. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో రూ.60 కోట్లతో సకల హంగులతో అద్భుతంగా నిర్మించిన ఐటీ టవర్‌లో ప్రస్తుతం సిద్దిపేట ప్రాంతానికి చెందిన స్థానిక యువతీయువకులు 450 మంది వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు. దీనిలో 20 అంతర్జాతీయ ఐటీ కంపెనీలు సిద్దిపేట ఐటీ టవర్‌తో ఒప్పందం చేసుకొని ఉద్యోగాలు కల్పించాయి.