హుస్నాబాద్‌టౌన్, సెప్టెంబర్ 18: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఆర్టీసీ అద్దె బస్సు టైరు పేలిన ఘటనలో నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకా రం బుధవారం హుస్నాబాద్ బస్‌స్టేషన్ నుంచి రెండుగంటల 35 నిమిషాలకు టీఎస్02యూఏ 2602 నంబర్ గల ఆర్టీసీ అద్దె బస్సు కరీంనగర్‌కు బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
స్థానిక నాగారం రహదారి వద్దకు బస్సు చేరగానే వెనుక టైరు ఒక్కసారిగా పేలింది. దీంతో టైరుగాలి ఒత్తిడికి రేకు చీల్చుకుని బస్సు లోపలికి చొచ్చుకురావడంతో ఆప్రాంతంలో కూర్చున్న మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో పెద్దపల్లికి చెందిన ప్రవళిక, అక్కన్నపేట మండలం కుం దనవానలిపల్లికి చెందిన అర్చన కాళ్లకు తీవ్రగాయాలు కాగా, గోదావరిఖనికి చెందిన కల్యాణి, అక్కన్నపేట మండలం కుందనవాపల్లికి చెందిన శశిప్రియాంకలకు సైతం గాయాలయ్యాయి.
టైరు పేలడంతో బస్సును నిలిపివేసి గాయపడిన వారిని స్థానికంగా ఒక ప్రైవేట్ దవాఖానకు తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం వారిని అంబులెన్స్‌లో కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించా రు. ప్రమాదం గురించి తెలుసుకున్న డీఎం వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం గు రించి ఆరాతీసి గాయపడిన వారికి చికిత్స చేయించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
హుస్నాబాద్ బస్సు ప్రమాదం ఘటనపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరాతీశారు. ప్రమాదానికి కారణం ఏమిటని, గాయపడిన వారికి చికిత్స అందించాలని స్థానిక డీఎం వెం కటేశ్వర్లను ఆదేశించారు.