కొల్చారం, డిసెంబర్ 26 : ఫ్లెక్సీ తొలిగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్‌లో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామస్తులు, మృతుల కుటుంబీకుల కథనం ప్రకారం.. బుధవారం సీఎం రేవంత్ ఏడుపాయల దర్శనానికి వస్తున్నారని కొల్చారం మండలంలోని పోతంశెట్టిపల్లి నుంచి మెదక్ వరకు జాతీయ రహదారిపై భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కిష్టాపూర్ బస్టాండ్ సమీపంలో 11కేవీ విద్యుత్ వైర్లకు అతి సమీపంలో సైతం ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన అనంతరం కాంట్రాక్టర్ ఫ్లెక్సీలను తొలిగిస్తూ కిష్టాపూర్ వద్ద ప్రమాదకరంగా ఉన్న ఫ్ల్లెక్సీని వదిలి వేశారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన అక్కెం యాదగిరి, భాగ్య దంపతుల కుమారుడు నవీన్(21), అదే గ్రామానికి చెందిన పసుల వెంకటేశం, సుజాత దంపతుల కుమారుడు ప్రసాద్(20) ఇద్దరు బుధవారం రాత్రి 10:40 ప్రాంతంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న తమ వ్యవసాయ పొలంలో నారుమడిలోకి అడవి పందులు రాకుండా నిప్పు వెలిగించి వస్తామని వెళ్లారు. నారుమడి వద్ద నిప్పు వెలిగించి తిరిగి వస్తూ రోడ్డుపై ఉన్న భారీ ఫ్లెక్సీని చూసి తొలిగించే ప్రయత్నం చేశారు. ఫ్లెక్సీకి సపోర్ట్‌గా ఉన్న తాళ్లు తొలిగించడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న 11కేవీ విద్యుత్ వైర్లపై పడింది. ఫ్లెక్సీ ఇనుప పైపులతో నిర్మించి ఉండటంతో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అటుగా వెళ్తున్న బాటసారి విద్యుత్ లైన్మెన్కు సమాచారం ఇవ్వడంతో కరెంట్ ఆఫ్ చేసి మృతదేహాలను పక్కకు తీశారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కొల్చారం ఎస్సై గౌస్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా దవాఖానకు తరలించారు.
కిష్టాపూర్‌లో విద్యుత్ షాక్‌తో అక్కెం నవీన్, పసుల ప్రసాద్ మృతిచెందిన విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి నాయకులతో కలిసి గురువారం కిష్టాపూర్ గ్రామాన్ని సందర్శించారు.బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదంపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.