సంగారెడ్డి, ఫిబ్రవరి 26: అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు రూ. కోటి విలువ గల 190 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని రెండు కార్లు సీజ్ చేసి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సోమవారం విలేకరులకు వెల్లడించారు. మధ్యాహ్నం 12.30గంటల సమయంలో పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, రెండు కార్లలో తరలిస్తున్న 190 కిలోల ఎండు గంజాయిని గుర్తించారని తెలిపారు.
రెండు కార్లలో ఐదుగురు ప్రయాణిస్తుండగా వీరిలో సతీశ్, గణేశ్ 150కిలోల గంజాయిని బీదర్‌లో ఉన్న జియా, షబ్బీర్లకు అమ్మడానికి వెళ్తున్నారని, మరో కారులో అహ్మద్ మొహ్మద్ ఆలం 40కిలోల గంజాయిని ముంబయిలో విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. వీరితోపాటు ముంబయికి చెందిన సచిన్‌యాదవ్, షహీద్ మునీర్ షేక్ గంజాయిని అమ్ముతున్నారు. గంజాయి పట్టుకున్న ఇన్స్పెక్టర్ శివలింగం, మహేశ్‌గౌడ్, ఎస్ఐ సాయిలు, హెచ్‌సీలు ఇస్మాయిల్, శంకర్, రేఖ్యానాయక్, గౌరీలతో పాటు అన్వర్, శశిధర్, నెల్లూర్, శ్రీహరి, నర్సింహులు, హరి, అరవింద్‌లను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.