మద్దూరు(ధూళిమిట్ట), డిసెంబర్ 1: ఏటా వరి, పత్తి, మొక్కజొన్న, కంది తదితర సంప్రదాయ పంటలు సాగు చేసి విసిగిపోయిన రైతులు ప్రస్తుతం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఏటా సాగు చేసిన పంటలకు భిన్నంగా వాణిజ్య పంటలపై మక్కువ పెంచుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లి గ్రామానికి చెందిన ఇమ్మడి బాల్‌రెడ్డి అనే రైతు ఎకరంన్నర భూమిలో పసుపు పంట సాగు చేస్తున్నాడు. పసుపు పంటలో అంతర పంటగా (వానకాలంలో) మొక్కజొన్న సాగుచేశాడు. అంతర పంటతో పసుపు సాగు కోసం పెట్టిన పెట్టుబడి ఖర్చులు తీరిపోయాయి.
ప్రస్తుతం పసుపు పంట ఏపుగా పెరిగి, దంటు వచ్చి ఆశాజనకంగా ఉన్నది. ఎకరంన్నర భూమిలో సుమారు 150 క్వింటాళ్ల పసుపు పంట పండుతుందని రైతు బాల్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. క్వింటాల్‌కు మార్కెట్లో సుమారు రూ. 10వేల పైనే ఉంటుందని భావిస్తున్నాడు. దీనికితోడు సీడ్‌ను కూడా అమ్ముకుంటే అదనంగా లాభాలు వస్తాయి. రైతు బాల్‌రెడ్డి సాగు చేసిన పసుపు పంటను చూసేందుకు వివిధ గ్రామాల రైతులు వస్తున్నారు. సిద్దిపేట జిల్లా ఉమ్మడి మద్దూరు మండలంలో పసుపు పంట సాగు చేసిన ఏకైక వ్యక్తి ప్రస్తుతం బాల్‌రెడ్డి మాత్రమేనని వ్యవసాయాధికారులు తెలిపారు.
ఏటా అందరి మాదిరిగానే సంప్రదాయ పంటలు సాగు చేస్తూ వ్యవసాయ రంగంలో ఎన్నో కష్టనష్టాలు చవిచూశా. జహీరాబాద్‌కు చెందిన మిత్రుడి సూచన మేరకు ఈ ఏడాది పసుపు పంట సాగు చేశా. పసుపు పంటలో అంతర పంటగా మక్క సాగుచేశా. మక్క పంటతో పసుపు సాగుకు పెట్టిన పెట్టుబడి ఖర్చులు తీరిపోయాయి. పసుపు పంటతో ఎకరానికి రూ. 10లక్షల వరకు రాబడి ఉంటుంది.
ప్రస్తుతం పసుపు పంట చాలా బాగుంది. ఈ పంటను ఏప్రిల్, జూన్ మాసాల్లో సాగు చేసకోవచ్చు. పంట కాల వ్యవధి తొమ్మిది నెలలు. పసుపు పంటకు ఈ ప్రాంతం అనుకూలమైనది. సాగు చేసిన పసుపు పంట సక్సెస్ అయితే రానున్న రోజుల్లోఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుకు ప్లాన్ చేస్తున్నా. పసుపు పంటను వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించి బాగుందని ప్రశంసించారు. -ఇమ్మడి బాల్‌రెడ్డి, రైతు, బైరాన్‌పల్లి, సిద్దిపేట జిల్లా