సంగారెడ్డి, ఆగస్టు 24 : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాలో తప్పులు లేకుండా రూపొందించాలని, 18 ఏండ్లు నిండిన యువతీయువకులను ఓటరుగా నమోదు చేయాలని ఎన్నికల సిబ్బందిని కలెక్టర్ శరత్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సంగారెడ్డి నియోజకవర్గం ఏఈఆర్వోలు, అడిషనల్ ఏఈఆర్వోలు, బీఎల్వో సూపర్వైజ ర్లు, బీఎల్వోలకు గురువారం ఓటరు జాబితా రూపకల్పన, ఇతర అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలు సజావుగా జరిగేలా పొరపాట్లకు తావివ్వకుండా స్పష్టమైన ఓటరు జాబితా తయా రు చేయాలన్నారు. ముఖ్యంగా 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును నమోదు చేయాలన్నారు. జెండర్ రేషియో ప్రత్యేక శ్రద్ధతో తనిఖీ చేయాలన్నారు. 18 నుంచి 19 ఏండ్లు వయస్సున్న ఓటర్లు ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో నాలుగుశాతం ఉండాలని సూచించారు. ఏఈఆర్వోలు, బీఎల్వో సూ పర్‌వైజర్లు ప్రతి కళాశాలకు వెళ్లి ఎంతమంది ఓటరుగా నమోదయ్యారని? ఎవరు నమోదు కాలేదని? గుర్తించి అక్కడికక్కడే ఓటరుగా నమోదు చేయించాలన్నారు. ఫొటో నమోదు పొరపాటుగా తొలిగిస్తే ఫారమ్ 6 తీసుకుని ఓటరు జాబితాలో చేర్చాలన్నారు. ఆరుమంది కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న ఇండ్ల ను మరోసారి పరిశీలించాలని సూచించారు. సెప్టెంబరు 19 వరకు ప్రతి బీఎల్వో ఫారం 6, 8, ఎన్ని స్వీకరించారు? సమాచారాన్ని ప్రతిరోజూ నివేదిక ఇవ్వాలన్నారు.
ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాల్లో నిర్ణీత సంఖ్య కన్నా ఓట ర్లు ఉన్నట్లయితే కొత్త పోలింగ్ స్టేషన్‌కు ప్రతిపాదనలు పెట్టాలని అధికారులకు సూచించారు. ఒక కుటుంబంలోని ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండాలన్నారు. రెసిడెంట్ వెల్పేర్ అసోసియేషన్స్, కళాశాలలు, కాలనీలకు వెళ్లి అర్హులందరూ ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అర్హులందరీ పేర్లు ఓటరు జాబితాలో ఉండాలని ఆదేశించారు. ఈ నెల 26, 27, వచ్చే నెల 2,3 తేదీల్లో ఓటరు నమోదులో మార్పులు, చేర్పులకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామన్నారు. బీఎల్వోలు తమ పోలింగ్ కేంద్రాల్లో ఓటరు జాబితాతో ఉదయం 10 గంటల వరకు ఫారం 6, 7, 8తో అందుబాటులో ఉండి స్వీకరించాలన్నారు. ప్రత్యేక శిబిరాలపై గ్రామంలో ముందు రోజు దండోరా వేయించాలని సూచించారు. ఓటరు జాబితాలో చనిపోయినవారి పేర్లను తొలిగించాలనుకుంటే ఫారం 7తో ఫిర్యాదు స్వీకరించి, విచారణ చేసి తొలిగించాలన్నారు. 80 ఏండ్లు దాటిన వయోవృద్ధ్దులు, వికలాంగులు తమ ఇంటి వద్ద నుంచి ఓటు హక్కు వినియోగించుకోడానికి ఎన్నికల కమిషన్ సదుపాయం కల్పించిందని, వారి వివరాలను సేకరించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్వో నగేశ్‌గౌడ్, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, నియోజకవర్గ ఏఈఆర్వోలు, అడిషనల్ ఏఈఆర్వోలు, బీఎల్వో సూపర్వైజర్లు, బీఎల్వోలు, మున్సిపల్ కమిషనర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
పటాన్చెరు, ఆగస్టు 24 : ఇంటింటికీ తిరిగి ఓటర్లను నమో దు చేయాలని కలెక్టర్ శరత్‌కుమార్ అన్నారు. పటాన్చెరు మున్సిపల్ ఫంక్షన్హాల్లో బూత్ లెవల్ ఆఫీసర్స్, బూత్ లె వల్ సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. పలు మండలాల్లో జనాభాకు అనుగుణంగా ఓటర్లు నమోదు కాలేదని గు ర్తించి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వందశాతం జనాభాకు 67శాతం ఓటర్లు ఉండాలని, ఆ స్థాయిలో ఓటర్లు నమోదు కాలేదని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో జనాభా 6లక్షల 12వేల 346 ఉండగా ఓటర్లు 3లక్షల 39వేల 942 మాత్రమే ఉన్నారని, ఇంకా 87వేల 212మంది ఓటర్లు న మోదు కావాలన్నారు. గుమ్మడిదల, జిన్నారం, రామచంద్రాపురం, అమీన్పూర్ మండలాల్లో జనాభా నిష్పత్తికి తగినట్టు గా ఓటర్లు నమోదు కాలేదన్నారు. బీఎల్వోలు, సూపర్వైజర్లు గ్రామాల్లో, పట్టణాల్లో ఓటర్లు పెరిగేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, ఎన్నికల అధికారి దేవ్జానాయక్, తహసీల్దార్లు, కమిషనర్లు, ఎంపీడీవో బన్సీలాల్, ఏపీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.