వర్గల్, సెప్టెంబర్ 11: భారీ వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతినడంతో రైతులకు నష్టాలే మిగిలాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొక్కజొన్న, వేరుశనగ, పెసర, లోబాన్, బీర, కాకర, టమాట పంటలు బాగా దెబ్బతిన్నాయి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని గౌరారం, మజీద్పల్లి, తున్కిఖల్సా, వేలూర్, వర్గల్ క్లస్టర్లల్లో పెద్దమొత్తంలో రైతులు టమాట సాగుచేశారు.
మండలంలో టమాట 369 ఎకరాల్లో పండించారు. భారీ వర్షాలకు టమాట రైతులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. బహిరంగ మార్కెట్లో 25 కిలలో టమాట ట్రే రూ.700 వరకు పలుకుతున్నది. వర్షాలకు భారీగా పంట దెబ్బతినడంతో తాము మంచి ధరను కోల్పోయి నష్టపోయామని టమాట రైతులు బాధపడుతున్నారు.
రెండున్నర ఎకరాల్లో ఎకరం టమాట సాగుచేసిన. మిగతా భూమిలో మొక్కజొన్న, వరి పంటలు వేసిన. ఈ వానకాలం సాగుకు కూ.1.50 లక్షల అప్పు తెచ్చి పంటలు వేసిన. టమాట చేను మంచి కాపుమీద ఉన్నది.
మార్కెట్లో ధర సైతం ఒక్కో ట్రెబాక్స్కు (25 కిలోలు) రూ.700 ధర పలుకుతున్నది. టమాటతో అప్పులు తీరుతాయి అనుకున్నా. భారీ వానలు నా టమాట చేనును ముంచాయి. ఎవుసం కోసం చేసిన అప్పులు తీరే మార్గంలేదు ప్రభుత్వమే నన్ను ఆదుకోవాలి.
– కుమ్మరి భాస్కర్, రైతు, అంబార్పేట