మెదక్ రూరల్, డిసెంబర్ 4: భూమి పరిమిత వనరు. నానాటికీ పెరుగుతున్న జనాభా అపరిమితం. ఐక్యరాజ్య సమితి ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను అందించడం కష్టసాధ్యం. 2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరనున్నది. అందుకు అనువుగా ఇప్పటి ఆహార ధాన్యాల ఉత్పత్తిని 60 శాతానికి పైగా పెంచాల్సి ఉంటుంది. 1960లో మొదలైన హరిత విప్లవంతో విత్తన నాణ్యత పెరిగి, దిగుబడి గణనీయంగా వచ్చింది.
సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో రసాయన ఎరువుల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. దీంతో భూసారం తగ్గిపోయి లక్షలాది హెక్టార్ల విస్తీర్ణంలో పంట భూములు బీళ్లుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మనిషి మనుగడకు అవసరమైన భూ ఆరోగ్యాన్ని కర్తవ్యంగా స్వీకరించాలనేది నిపుణుల మాట. నేలల పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి 2013లో డిసెంబర్ 5ను ప్రపంచ మృత్తికా దినంగా ప్రకటించింది. మొదటి ప్రపంచ మట్టి దినోత్సవాన్ని 2014 డిసెంబర్ 5న ఘనంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుపుకుంటునే ఉన్నాం. ప్రపంచ వ్యాప్తంగా మట్టిపై అవగాహన పెంపొందించడానికి ఆరోగ్యవంతమైన పర్యావరణ వ్యవస్థ, మానవ సంక్షేమాన్ని నిర్వహించడం, ప్రాముఖ్యతను పెంపొందించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది.
జిల్లాలోని ఏఈవోలు క్లస్టర్ పరిధిలో గల రైతు వైదికల్లో నేల సంరక్షణ, సారాన్ని పెంపొందించడానికి రైతులు పాటించాల్సిన పద్ధతులు, మట్టి నమూనా సేకరణ ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తారు. దీంతో పాటుగా మట్టి నమూనా పరీక్షా ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకంతో పాటుగా నేలలో సేంద్రియ కర్మన పదార్థం పెంపొందిచడానికి అనుసరించాల్సిన పద్ధతుల గురించి అవగాహన కార్యక్రమాలు ఉంటాయని వ్యవపాయ అధికారులు తెలిపారు.
అనంతమైన జీవ వైవిధ్యానికి ఆరోగ్యకరమైన నేలలే పట్టుగొమ్మలు. ఒక ప్రాంతంలో ఉండే జీవ సమూహంలోని వ్యత్యాసాలను జీవ వైవిధ్యంగా పరిగణిస్తారు. నేలలో కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు ఉంటాయి. ఒక అంచనా ప్రకారం చదరపు మీటర్ వైశాల్యంలోని మంచి నేలలో వెయ్యి రకాల సూక్ష్మజీవుల జాతులు ఉండి జీవ వైవిధ్యానికి కారణమవుతున్నాయి. కర్బన సమ్మేళనాలను వినియోగించుకుని పర్యావరణాన్ని కాపాడుతున్నాయి.
సేంద్రియ ఎరువులు జీవ సంబంధ పురుగు మందులు పచ్చిరొట్ట, జీవన ఎరువులు ఉపయోగించాలి. నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ కొండ ప్రాంతాల్లోని పోడు వ్యవసాయ పద్ధతిని నియంత్రించాలి. సమగ్ర పద్ధతులను పాటించి నేల కోతను అరికట్టాలి. నీటి వినియోగాన్ని సమర్థవంతంగా చేపట్టాలి. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా ఎరువులు వాడాలి. చీడపీడల యాజమాన్యం చేపట్టాలి. విత్తనానికి అవసరమైన చోట మాత్రమే దుక్కి చేయాలి. నేలను కప్పి ఉంచే పద్ధతిని అనుసరించాలి. పంట మార్పిడి, అంతర్ పంటలు, మిత్ర పంటలు, సాగు విధానాల కొనసాగింపుతో నేత కోతను అరికట్టవచ్చు. వ్యవసాయ పంటలు, అటవీ మొక్కలను సంయుక్తంగా ఒకే పొలంలో సాగు చేయడాన్ని వ్యవసాయ అటవీ సంయుక్త పద్ధతిగా చెప్పుకోవచ్చు. దీంతో నివాసాలకు అవసరమైన కలప, పశుగ్రాసం సుస్థిరమైన రీతిలో సమకూరుతాయి.
అధిక దిగుబడులు సాధించాలనే ఏకైక లక్ష్యంతో రైతులు మోతాదుకు మించి రసాయన బంధులు పిచికారీ చేస్తున్నారు. మరోవైపు పారిశ్రామిక వ్యర్థాల కారణంగా నేల సారం తగ్గిపోతుంది. చీడపీడల ఉధృతి పెరుగుతున్నది. ప్రతిఒక్కరూ నేల పరిరక్షణ బాధ్యతను తీసుకోవాలి.
– శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి, మెదక్
మన నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువగా ఉంది. సరి చేయడానికి పచ్చిరొట్ట ఎరువులు వాడాలి. దీంతో ఖర్చు తగ్గించడమే కాకుండా నేలను పరిరక్షించవచ్చు. రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలి. భవిష్యత్ తరాల మనుగడ కోసం భూ మాతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రకృతి ప్రసాదించిన నేలను సంరక్షించుకునేందుకు రైతులు కార్యోన్ముఖులు కావాలి
– డాకూరి వెంకటేశం, రైతు సహాయ వేదిక బోర్డ్ డైరెక్టర్