సుల్తాన్‌బజార్, మార్చి 3: అత్యంత విషపూరితమైన, విరుగుడు లేని పారాక్వాట్ గడ్డి మందును రాష్ట్రంలో వెంటనే నిషేధించాలని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో మంగళవారం కోఠిలోని సంస్థ కార్యాలయంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీ కిషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 70 దేశాలు పారాక్వాట్‌ను నిషేధించాయని చెప్పారు.
సౌత్ కొరియా వంటి దేశంలో పారాక్వాట్‌ను నిషేధించిన అనంతరం విషప్రయోగాల వల్ల జరిగే మరణాల సంఖ్య 50 శాతం తగ్గిందని వెల్లడించారు. ఈ మందుతో సంభవిస్తున్న మరణాల గురించి ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టంగా తెలియజేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు బీ సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ అత్యంత విషపూరితమైన పారాక్వాట్ గడ్డి మందును నిషేధించాలని కోరుతూ సామాజిక బాధ్యతగా ఐఎంఏ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ మందు ప్రభావం చాలా భయంకరంగా ఉన్నదని తెలిపారు.
ఇటువంటి గడ్డి మందుకి ఆమోదం తెలిపినందుకు రాజకీయ నాయకులుగా తాము క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో ఈ అంశంపైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రైతులు పారాక్వాట్ మందు వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరారు. వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ రైతులు అవగాహన లేకుండా పారాక్వాట్ గడ్డి మందు వాడుతున్నారని అన్నారు. మల్టీ నేషనల్ కంపెనీలు ఈ మందులను తీసుకొస్తున్నాయని ఆరోపించారు. ఈ గడ్డి మందును నిషేధించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. ప్రజల్లో అవగాహన లేక క్షణికావేశంలో పారాక్వాట్ గడ్డి మందు తాగి మృత్యువును చేరుతున్నారని తెలిపారు. రెండు చుక్కలు తాగినా.. మరణిస్తున్నారని అన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన పారాక్వాట్ గడ్డి మందును వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని తెలిపారు. ఇంతటి ప్రమాదకరమైన మందును ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో విక్రయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. పారాక్వాట్ గడ్డి మందుతో జరుగుతున్న అనర్థాలపై సీఎం రేవంత్‌రెడ్డికి అవగాహన ఉన్నదని అన్నారు.
ఈ మందును నిషేధించే పరిధి రాష్ర్టానికి లేదని కేంద్రం వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని నిషేధించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ ఈటల మాట్లాడుతూ.. కేంద్ర కెమికల్, ఫర్టిలైజర్ కమిటీలో తాను సభ్యుడినని, ఈ గడ్డి మందును బ్యాన్ చేయాలని కోరానని వెల్లడించారు. వ్యవసాయ క్షేత్రాల్లో పారాక్వాట్ గడ్డి మందును వాడటంతో ఆహార పదార్థాల్లో ఆ రసాయనాలు కలుస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మందు తాగి రైతులు, కౌలు రైతులు, ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకుంటు న్న వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తె లిపారు. పారాక్వాట్ గడ్డి మందును నిషేధంపై రౌండ్ టేబుల్ సమావేశంలో పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీ కిషన్ మాట్లాడుతూ.. పారాక్వాట్ గడ్డి మందు 100 శాతం విషపూరితమైనదని అన్నారు. ఈ మందుకు ఎలాంటి విరుగుడు లేదని స్పష్టం చేశారు. గడ్డి మందును ప్రపంచంలో అనేక దేశాలు నిషేధించాయని గుర్తుచేశారు. అయితే కొన్ని దేశాలు మన దేశానికి గడ్డి మందును ఎగుమతి చేస్తూ మన దేశ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కేరళ, ఒడిస్సా రాష్ర్టాల్లో ఇప్పటికే పారాక్వాట్‌ను నిషేధించారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్ నుంచి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు తమ ఆవేదనను ప్రజాప్రతినిధులకు చెప్పుకున్నారు.
పారాక్వాట్ గడ్డి మందును నిషేధించేందుకు కృషి చేయాలని వారు నేతలను కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ గౌరవ కార్యదర్శి డాక్టర్ అశోక్, ఆర్థిక కార్యదర్శి డాక్టర్ టీ దయాల్‌సింగ్, డీఏపీపీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ మర్రి మహేశ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ రాకేశ్ చెన్నా(నెఫ్రాలజిస్ట్), కరీంనగర్ (సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, టీజీఎంసీ వైస్‌చైర్మన్ డాక్టర్ గుండగాని శ్రీనివాస్, డాక్టర్ సన్నీ డేవిస్, పురుగు మందుల పాలసీ నిపుణుడు నర్సింహారెడ్డి, నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ గంగాధర్, ఫొరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ కృపాల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.