సంగారెడ్డి కలెక్టరేట్, మే 29: ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా వైరస్ మన దేశంలోనూ అనేక మంది చిన్నారులకు భవిష్యత్తు లేకుండా చేసింది. ఇంటి పెద్ద దిక్కును మింగేసి చిన్నారులను అనాథలను చేసింది. ఎంతమంది బంధువులు ఉన్నా తల్లిదండ్రుల ప్రేమానురాగాలు, బతుకు భరోసా దొరకడం కష్టమే. అందులోనూ అభాగ్యుల పరిస్థితి అగమ్యగోచరమే. ఇలాంటి పరిస్థితులను చూసి చలించిపోయిన ప్రధాని మోదీ గతేడాది మే 29న పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ ప్రారంభించారు. కొవిడ్-19 కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులు, దత్తత తీసుకున్న వారిని కోల్పోయిన పిల్లలను ఆదుకోవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 2020 మార్చి 11 నుంచి 22 ఫిబ్రవరి 28 మధ్య కాలంలోని బాధిత పిల్లలను ఆదుకోవడమే లక్ష్యంగా వారి సమగ్ర సంరక్షణ, సుస్థిర పద్ధతిలో రక్షణను నిర్ధారించడం, ఆరోగ్య బీమాతో వారి శ్రేయస్సును పరిరక్షించడం పథకం లక్ష్యం. విద్యతో వారిని శక్తివంతంగా చేయడం, వారిని స్వయం సమృద్ధి కోసం సన్నద్ధ్దం చేయడం, 23 ఏండ్ల వయస్సు వరకు ఆర్థిక తోడ్పాటు అందించడం వంటి అంశాలు పథకం భాగంగా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లాలో 9 మంది బాధిత పిల్లలు
సంగారెడ్డి జిల్లాలోని పోలీసులు డీసీపీయూ, స్వచ్ఛంద సంస్థల సహాయంతో కలెక్టర్ 9 మంది బాధిత పిల్లలను గుర్తించారు. తల్లిదండ్రుల మరణానికి కారణాన్ని పరిశీలించిన తర్వాత పిల్లల కోసం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌లో అప్ లోడ్ చేశారు. జిల్లాలో కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన 7 కుటుంబాలకు చెందిన 9 మంది పిల్లలను గుర్తించారు. వారిలో నలుగురు బాలికలు, ఐదుగురు బాలురు ఉన్నారు. ఏ రోజుకారోజు అందించిన సమాచారానికి స్పందించిన జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) ఆయా పిల్లలను పరామర్శించి, వారిలో మనోధైర్యం నింపడంతో పాటు తక్షణ సహాయంగా రూ.2 వేల నగదుతో పాటు నిత్యావసర సరుకులు అందించారు. కొవిడ్‌లో అనాథలైన 9 మంది పిల్లల్లో ఒక అమ్మాయిని సంగారెడ్డిలోని బాల సదనంలో చేర్చారు. మిగతా 8 మంది పిల్లలను వారి సంరక్షకులకు అప్పగించారు. డీసీపీయూ బృందం ఎప్పటికప్పుడు వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ సంరక్షణకు కృషి చేస్తున్నది. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతినెలా వారి ఖాతాలో రూ.2 వేలు జమ చేస్తున్నారు. 9 మంది అనాథ చిన్నారులకు పోస్టాఫీసులో జాయింట్ అకౌంట్ తీసి పీఎం కేర్స్ నుంచి వారి ఖాతాలో వయస్సు ఆధారంగా నిధులు మంజూరు చేస్తారని చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు తెలిపారు. ఆయా గురుకుల పాఠశాలల్లో పిల్లలను చేర్చి వారికి మెరుగైన విద్యను కూడా అందిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పిల్లలకు రూ.1,38,000ల ఫీజును ఇచ్చినట్టు వెల్లడించారు. కొవిడ్ అనాథ పిల్లల వివరాలను పీఎం కేర్స్ పోర్టల్‌లో నమోదు చేశామని సంగారెడ్డి జిల్లా బాలల పరిరక్షణ అధికారి రత్నం తెలిపారు. ఈ పిల్లలకు ఆర్థిక సహాయంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ.50 వేలను వారికి అందించడంలో డీసీపీయూ కీలక పాత్ర పోషిస్తున్నది.
పిల్లల కోసం పీఎం కేర్స్ పోర్టల్..
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనేది పిల్లల నమోదు, ధ్రువీకరణ, నిధుల బదిలీ, పథకంలోని వివిధ భాగాల కింద పిల్లలకు అందుబాటులో ఉన్న ప్రయోజనాలు, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన సమీకృత పోర్టల్. ఈ పోర్టల్‌ను మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ రూపొందించింది.
పథకం ముఖ్య లక్షణాలు..
పథకం ముఖ్య లక్షణాల్లో భాగంగా ఆర్థిక మద్దతు, బోర్డింగ్, లాడ్జింగ్, పాఠశాల విద్య, ఉన్నత విద్య, ఆరోగ్య బీమా వంటి అంశాలున్నాయి. ఆర్థిక మద్దతు కింద ప్రతి చిన్నారి ఖాతాలో ప్రో-రేటా మొత్తం జమ చేయబడింది. ఆ సమయంలో ప్రతి బిడ్డకు కార్పస్ రూ.10 లక్షలు అవుతుంది. 18 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు, పోస్టాఫీసు నెలవారి ఆదాయ పథకంలో రూ.10 లక్షలు జమ చేసింది. 18 ఏండ్లు నిండిన తరువాత నెలవారీ ైస్టెఫండ్ను అందుకుంటారు. 23 ఏండ్లు వచ్చే వరకు ైస్టెఫండ్ అందుతుంది. 23 ఏండ్ల తర్వాత రూ.10 లక్షలు అందజేస్తారు. ఎంహెచ్ఏ సూచనల మేరకు పిల్లలకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందుకుంటారు. ఆరోగ్యబీమా కింద పిల్లలందరూ ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఒక బిడ్డకు సంవత్సరానికి రూ.5లక్షల ఆరోగ్య బీమా కవరేజీ నమోదు చేయబడింది. ఈ పిల్లలకు 23 ఏండ్ల వరకు ప్రీమియం మొత్తాన్ని పీఎం కేర్స్ చెల్లిస్తుంది. పిల్లల కోసం ఆరోగ్య కార్డులు అన్నీ జిల్లా మేజిస్ట్రేట్ పంపిణీ చేశారు.
పిల్లల ఫిర్యాదుల పరిష్కారం..
ఏవైనా ఫిర్యాదులుంటే వాటిని పరిష్కరించేందుకు జిల్లా అదనపు కలెక్టర్ స్థాయి అధికారిని కలెక్టర్ నియమించారు. చిల్డ్రన్ పోర్టల్ కోసం పీఎం కేర్స్‌లో ఫిర్యాదుల పరిష్కార విధానం ఏర్పాటుచేశారు. పీఎం కేర్స్ ఆఫ్ చిల్డ్రన్ పోర్టల్ కూడా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు, చర్యల కోసం హెచ్చరికలు చేస్తుంది. పెండింగ్ ఫిర్యాదులను జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి, తరువాత జాతీయ స్థాయి వరకు పెంచుతారు. పక్షం రోజుల్లో తగిన చర్యలు తీసుకుంటారు. పోర్టల్ ద్వారా ఫిర్యాదుదారుకు ఈ విషయాన్ని తెలియజేస్తారు. 30 రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులకు సంబంధించి మహిళలు, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ సంబంధిత రాష్ట్ర నోడల్ అధికారి వ్యక్తులను సంప్రదిస్తుంది. కలెక్టర్ గాని, నోడల్ మంత్రిత్వ శాఖ కాని తగిన చర్యలు తీసుకుంటుంది.
నేడు పీఎం కేర్స్ వర్చువల్ ప్రోగ్రాం..
పీఎం కేర్స్ వర్చువల్ ప్రోగ్రాం 30, 31న ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ఉదయం 10.30 గంటలకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతీఇరానీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 10.35 గంటలకు పీఎం కేర్స్ పథకానికి సంబంధించి షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్, 10.40 గంటలకు చిన్నారులకు ప్రధాని లేఖను వర్చువల్‌గా అందించనున్నారు. స్నేహ పాత్ర సర్టిఫికెట్, పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పాస్ బుక్కుల పంపిణీ, ఆరోగ్య కార్డుల పంపిణీ 10.44 గంటలకు పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులకు ఉపకార వేతనాలను రిమోట్ బటన్‌తో ట్రాన్స్ఫర్ చేస్తారు. 10.45 గంటలకు ప్రధాని ప్రసంగం ఉంటుంది.
బాలల సంరక్షణే ధ్యేయం
జిల్లాలో బాలల హక్కులను ఎల్లవేళలా కాపాడుతూ వారి సంరక్షణకు కృషి చేస్తున్నాం. బాలల సంరక్షణే మాధ్యేయం. ముఖ్యంగా కరోనా కారణంగా అనాథలైన పిల్లలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సహాయకారిగా పనిచేస్తున్నాం. పిల్లలకు వచ్చే ఆర్థిక, సంరక్షణ చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాం. జిల్లాలో మరింత మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తాం.
– రత్నం, బాలల సంరక్షణ అధికారి, సంగారెడ్డి