సిద్దిపేట (నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి), నవంబర్ 28: మలిదశ తెలంగాణ ఉద్యమంలో మరో ప్రస్థానం.. అత్యంత కీలకమైన రోజు.. యావత్తు తెలంగాణ జాగృతమైన దినం… నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను ఉద్యమంలో నడిచేందుకు ఊపిరిలూదిన రోజు.. తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి ఏకతాటిపై తీసుకొచ్చి ప్రత్యర్థులకు ఉద్యమ రుచి చూపిన దినం 2009 నవంబర్ 29. తెలంగాణ ఉద్యమ రథసారధి.. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన దినం. ఈ దీక్ష తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఇస్నున్నట్లుగా ప్రకటన వెలువడిన తర్వాత 11 రోజుల దీక్షను కేసీఆర్ విరమించారు.
తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపిన నాటి ఉద్యమ రథసారథి కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి హింసకు తావులేకుండా.., శాంతియుతంగా.., గాంధేయ మార్గంలో పోరాడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు జనాన్ని కదిలించి.., ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన ధీరుడు మన కేసీఆర్. ఆనాటి ఉద్యమ సమయంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు.. ఇప్పటికీ జనాల హృదయాల్లో పదిలంగా ఉన్నాయి. చరిత్రలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్ర సాధన కోసం 42 రోజుల పాటు చేపట్టిన సకల జనుల సమ్మెతో పాలన స్తంభించింది.
14ఎఫ్ రగడ.. తెలంగాణ ఉద్యమ దశను దిశను మార్చి ఉద్యమానికి నాంది పలికి ఒక ప్రభంజనంలా సృష్టించింది.. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితం. హైదరాబాద్ నగరాన్ని ఆరోజోన్ నుంచి వేరు చేస్తూ ఫ్రీజోన్ మార్చేందుకు తీసుకున్న నేపథ్యంలో కేసీఆర్ తీసుకున్న 14ఎఫ్ రగడ సంచలన నిర్ణయానికి నాంది పలికింది. ఆరవై ఎండ్లుగా తెలంగాణ ప్రజలు అణిచివేతలో గురవుతున్న పరంపరలో ఫ్రీజోన్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారి తెలంగాణ ఉద్యోగులందరినీ ఏకతాటి పైకి తెచ్చింది.
ఫ్రీజోన్.. కాదురా.. హైదరాబాద్ మాదిరా.. పేరిట 14ఎఫ్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యోగ గర్జన భారీ బహిరంగ సభ కేసీఆర్ సంచలన నిర్ణయానికి ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేట వేదికైంది. ఈ సభలో కేసీఆర్ తెలంగాణ కోసం తాను 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైనట్లు సంచలన వాఖ్యలు చేశారు. అనంతరం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు కరీంనగర్ నుంచి బయలు దేరి సిద్దిపేట దీక్షా స్థలానికి చేరుకుంటున్న క్రమంలో పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించడంతో సిద్దిపేటలోని రంగధాంపల్లి వద్ద ఆమరణ నిరాహార దీక్ష స్థలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్ అరెస్టు వార్త విన్న వెంటనే సిద్దిపేటలోని రంగధాంపల్లి దీక్షా శిబిరంలో అలజడి మొదలైంది.. కేసీఆర్ అరెస్టు వార్త తెలుసుకున్న వెంటనే ఆయన స్థానంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి, ఇతర పార్టీ నేతలతో కలిసి దీక్ష చేపట్టారు.
అప్పటికే దీక్షా స్థలి వద్ద భారీగా మోహరించిన పోలీసు బలగాలు బారికేడ్లను బద్ధలు కొట్టి దీక్షా ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఓవైపు పోలీసులు లాఠీలు.. మరోవైపు జై తెలంగాణ నినాదాలతో రంగధాంపల్లి దీక్షా శిబిరం మార్మోగించారు. కొన్ని నిమిషాల వ్యవధిలో దీక్షాప్రాంగణం ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొనసాగింది. అసలేం.. జరుగుతుందో.. తెలుసుకునే లోపే బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, తెలంగాణ వాదులను ఒక్కొక్కరిగా అరెస్టు చేశారు. పోలీసులు భారీగా శిబిరం ప్రాంగణంలోకి దూసుకొచ్చి హరీశ్‌రావు సహా ముఖ్య నాయకులను అరెస్టు చేసి వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ విద్యార్థి లోకం, ఉద్యమకారులు, అమరులు నిరంతరం తమ వాణిని వినిపించారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ముక్తకంఠంతో ఆంధ్రోళ్లతో కొట్లాడితే ఆమరణ దీక్ష అనంతరం ఐదేండ్లకు తెలంగాణ రాష్ట్ర సంకల్పం సిద్ధించింది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం యూపీఏ పరిణామాలు, ఉత్కంఠ నడుమ వాయిదాలపై ఊరిస్తూ అఖిలపక్ష తీర్మానాలు చేయించి లోక్‌సభలో 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
రాజ్యసభలో ఫిబ్రవరి 20న హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణకు ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు మార్చి 1న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజముద్ర వేశారు. తదనంతరం తెలంగాణలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉద్యమ పార్టీ బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంతో అదేరోజు తెలంగాణ ఉద్యమ రథసారథి, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు.
రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్ర సీఎంగా ఎన్నికయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపారు. ఇవ్వాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో విఫలమైంది. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండి పడుతున్నారు. మళ్లీ కేసీఆర్ చేతిలోనే తెలంగాణ రాష్ట్రం ఉండాలని ప్రజలు విశ్వసిస్తున్నారు. గ్రామాల్లో కేసీఆర్ సార్ కావాలని కోరుకుంటున్నారు.
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను సీమాంధ్ర ప్రభుత్వం కుట్రలు పన్ని పోలీసులతో భగ్నం చేయడంతో ఒక్కసారిగా తెలంగాణ యావత్తు రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నది. చరిత్రలో నిలిచిపోయే విధంగా దీక్షలు జరిగాయంటే అది ఉద్యమ పురిటిగడ్డ సిద్దిపేట దీక్షా శిబిరం. మరొకటి నంగునూరు మండలం పాలమాకుల దీక్షా శిబిరం అని చెప్పవచ్చు. నిత్యం జనసమర్థం ఉండే అంబేద్కర్ సర్కిల్లోని పాత బస్టాండ్ వెనుక భాగంలో దీక్షా శిబిరం వేదికను హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. 1531 రోజుల పాటు నిర్విరామంగా దీక్షలు కొనసాగాయి.
దీక్షా స్థలికి ఎంతోమంది మేధావులు, నాయకులు, ప్రముఖులు వచ్చి సంఘీభావం తెలిపారు. కేసీఆర్ పలుసార్లు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపి మాట్లాడారు. దీక్షలో సిద్దిపేట పట్టణంతో పాటు సిద్దిపేట, చిన్నకోడూరు మండలాలకు చెందిన మహిళా సంఘాలు, జేఏసీ నాయకులు కూర్చుని విజయవంతం చేశారు. పాలమాకుల దీక్షా శిబిరం వెయ్యి రోజులపాటు కొనసాగింది. ఈ దీక్షలో సుమారుగా 16 వేల మంది మహిళలు కూర్చుని రాష్ట్రం వచ్చేదాకా నినదించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మార్చి 13న సిద్దిపేట దీక్షలు మార్చి 9న పాలమాకుల దీక్షలను విరమింపజేశారు. సిద్దిపేటలో 1531 రోజుల పాటు దీక్షా స్మృతులకు గుర్తుగా పైలాన్ నిర్మించారు.