బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. సోమవారం (నేడు) ఊరూరా పార్టీ జెండాలను ఆవిష్కరించనున్నా రు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ పోరాడి తెలంగాణను సాధించింది. ఉద్యమాన్ని కొనసాగించిన ఉద్యమ నేతకే పాలన పగ్గాలను తెలంగాణ ప్రజలు అప్పగించారు.
మనబిడ్డ కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను రెండుసార్లు చేపట్టి దేశంలోని అన్ని రాష్ర్టాలకు భిన్నంగా పాలన కొనసాగించారు.బీఆర్ఎస్ ఆవిర్భవించిన సమయంలో నానా రకాలుగా మాట్లాడిన వారి నోళ్లను మూయించి పార్టీని తిరుగులేని శక్తిగా మార్చారు. 2001 ఏప్రిల్ 27 బీఆర్ఎస్ ఆవిర్భవించింది. పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఎన్నో ఉద్యమాలు చేసిం ది. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. సీమాంధ్ర పాలకుల చేతిలో దగా పడుతున్న తెలంగాణ సమాజాన్ని తట్టి లేపింది.
సిద్దిపేట, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి): 2001 ఏప్రిల్ 14న సిద్దిపేటలో జరిగిన అంబేద్కర్ జయంతి సభలో పాల్గొన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) తెలంగాణ కోసం పోరాటం తప్పదని ప్రకటించారు.ఉద్యమ పార్టీ ఆవిర్భవాన్ని కూడా ఆ రోజే వెల్లడించారు. 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) ఉద్యమ పార్టీని స్థాపించారు. బీఆర్ఎస్కు పుట్టినిల్లుగా ఉమ్మడి మెదక్ జిల్లా చరిత్రలో నిలిచిపోయింది. పార్టీ ఆవిర్భవించి 26 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గ సభ్యు లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ ఇన్చార్జ్జిలు, వివిధ విభాగాల అధ్యక్షులు, ఇతర మఖ్య నాయకులు హాజరు కానున్నారు.
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొంది. ఉద్యమం ఉధృతిని ఏ మాత్రం తగ్గకుండా ముందుకు తీసుకెళ్లి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడం బీఆర్ఎస్ చరిత్రలో ఒక మైలురాయి. ఉద్యమం చేపట్టిన నాయకుడికి రెండుసార్లు రాష్ట్ర ప్రజలు పట్టంకట్టి సీఎంను చేశారు. 2001లో పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్లలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు బీఆర్ఎస్పై అవాకులు, చెవాకులు పేలారు. మూడొద్దులకే పార్టీ మూసుకుపోతుందని ఎన్నో రకాలుగా హేళన చేసే మాటలు మాట్లాడారు.అయినా ఎక్కడా కూడా కేసీఆర్ వెనుకడుగు వేయకుండా ఉద్యమ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కృతకృత్యులయ్యారు.2005లో వరంగల్‌లో నిర్వహించిన జైత్రయాత్ర సభకు కేసీఆర్ సైకిల్‌పై బయలుదేరి వెళ్లారు.సిద్దిపేట నుంచి వరంగల్ బహిరంగ సభ వరకు ఆయన వెంట సైకిళ్లపై వందల మంది కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు.
2006లో తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పడంతో ఆ పార్టీపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. సిద్దిపేటలో శంఖారావం పేరిట బహిరంగ సభ నిర్వహించగా, వివిధ ప్రాంతాల నుంచి లక్షల్లో ప్రజలు హాజరై సభకు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు.అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం,అప్పటి మంత్రి ఎమ్మెస్సార్ చేసిన వ్యాఖ్యలకు సవాలుగా కేసీఆర్ కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సభలో ప్రకటించారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కనీవిని ఎరుగని రీతిలో భారీ మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ కోసం మహాధర్నా పేరిట రాజీవ్ రహదారిని దిగ్బంధం చేశారు. సిద్దిపేట శివారులోని రాజీవ్ రహదారిపై జరిగిన కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. 2008లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించిన తర్వాత కాంగ్రెస్ నాయకులకు సవాల్ చేస్తూ సిద్దిపేటలో హరీశ్‌రావు నాయకత్వంలో నిర్వహించిన ఉద్యోగ గర్జనకు భారీ స్పందన లభించింది.
2009 నవంబర్‌లో సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ ‘తెలంగాణ వాలె జాగో.. ఆంధ్రా వాలె బాగో’ అనే నినాదం ఇచ్చారు. హరీశ్‌రావు, కేటీఆర్, ఇతర నేతలు పాల్గొని ఆందోళన ఉధృతం చేశారు. హైదరాబాద్ ఫ్రీజోన్ అంటూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఫ్రీజోన్ రద్దుకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో కేసీఆర్ ఆమరణ దీక్షకు నిర్ణయించారు. సిద్దిపేట రంగధాంపల్లి వేదికగా కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగుతానని ప్రకటించడంతో మరోసారి సిద్దిపేట జిల్లా వార్తల్లోకెక్కింది. ఆమరణ దీక్షకు బయలుదేరిన కేసీఆర్‌ను నవంబర్ 29న కరీంనగర్ శివారులో పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం తరలించగా, సిద్దిపేట దీక్షా స్థలి వద్ద హరీశ్‌రావు, పద్మాదేవేందర్‌రెడ్డి, దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి తదితర నాయకులు దీక్షకు సిద్ధమయ్యారు. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఆ దీక్షాస్థలిని అణచివేయడంతో ఉద్యమం మరింత ఉధృతమైంది.
ఒక వైపు కేసీఆర్‌ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించడంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యమం బాట పట్టడంతో జిల్లా విద్యార్థి లోకం లేచింది.జిల్లా విద్యార్థి విభాగం నాయకులు చైతన్య పరిచేందుకు విస్తృతంగా విద్యార్థి గర్జన పేరిట సదస్సులు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉద్యమంలో భాగంగా జాతీయ రహదారిపై భారీ ధర్నా నిర్వహించారు. రైలురోకోలు, తెలంగాణ కోసం రోడ్ల పై వంటావార్పు, రోడ్ల దిగ్బంధం తదితర కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమాన్ని రోజురోజుకు ఉధృతపరుస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ముందుకెళ్లిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్, ప్రజా సమస్యలపై కూడా పోరాటం చేసింది. ప్రతి పౌరుడిని ఉద్యమంలో భాగస్వామ్యం చేసింది. 42 రోజుల పాటు జరిగిన సకల జనుల సమ్మెలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. హరీశ్‌రావు నేతృత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 132 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు.
గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. కానీ, ఉమ్మడి ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం 10
శాసనసభ స్థానాలకు 7 చోట్ల విజయం సాధించి బీఆర్ఎస్కు తిరుగులేదని మారోసారి చాటిచెప్పింది. ఎన్నికలు ఏవైనా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కడుతున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదు. దీంతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు నిరసనలు చేపడతూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ప్రజలతో కలిసి నిరసనలు చేపడుతున్నారు. రైతుబంధు, రుణమాఫీ, ఆరుగ్యారంటీలు తదితర వాటిపై ప్రజల్లో చర్చపెట్టారు. జిల్లాలోని బీఆర్ఎస్ శ్రేణులు రైతుల సమస్యలు, ఇతర సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తుండడంతో కొన్ని పరిష్కారమయ్యాయి. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ విజయదుందుబీ మోగించింది. మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుని అధికార పార్టీకి సవాల్ విసిరింది. బీఆర్ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా కంచుకోట అని మరోసారి నిరూపించింది.