‘గురక బాగా పెడుతున్నాడు… అంటే గాఢంగా నిద్రపోతున్నాడేమో!’ అనే అపోహ ఇప్పటికీ చాలామందిలో ఉంది. వాస్తవానికి పెద్దగా గురక పెట్టడం చాలాసార్లు స్లీప్ ఆప్నియా (Obstructive Sleep Apnea-OSA) అనే తీవ్రమైన నిద్ర సంబంధిత వ్యాధికి సంకేతం. ఇది కేవలం గురక సమస్య మాత్రమే కాదు; చికిత్స లేకుండా వదిలేస్తే గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం, అధిక రక్తపోటు, జ్ఞాపకశక్తి తగ్గడం, డిప్రెషన్, రోడ్డు ప్రమాదాలు, ఆకస్మిక మరణం వరకు దారితీసే ప్రమాదం ఉంది. భారతదేశంలో లక్షలాది మంది ఈ సమస్యతో బాధపడున్నారు. కానీ, వారిలో చాలామందికి తమకు ఈ వ్యాధి ఉందనే విషయం కూడా తెలియదు. కుటుంబ సభ్యులే మొదట ఈ సమస్యను గుర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
గర్భధారణ సమయంలో కొత్తగా గురక మొదలైతే నిర్లక్ష్యం చేయకూడదు. స్లీప్ ఆప్నియా వల్ల గర్భిణుల్లో అధిక రక్తపోటు, గర్భకాల మధుమేహం, ప్రసవ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

నిద్రలో గొంతు వెనుక భాగంలోని కండరాలు సడలిపోవడంతో శ్వాస మార్గం ఇరుకుగా మారుతుంది. ఆ ఇరుకైన మార్గం గుండా గాలి వెళ్లేటప్పుడు కంపనాలు ఏర్పడి గురక వస్తుంది. కొన్ని సందర్భాల్లో శ్వాస పూర్తిగా 10 సెకన్ల నుంచి ఒక నిమిషం వరకు ఆగిపోవచ్చు. ఈ పరిస్థితినే స్లీప్ ఆప్నియా అంటారు. ఒక రాత్రిలో ఇలాంటి సంఘటనలు వందలసార్లు కూడా జరగవచ్చు.
స్లీప్ ఆప్నియా వల్ల శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందదు. దీని ప్రభావం ప్రతి అవయవంపై పడుతుంది.
పిల్లల్లో పెద్ద టాన్సిల్స్, అడినాయిడ్స్, ఊబకాయం వంటి కారణాల వల్ల స్లీప్ ఆప్నియా రావచ్చు. గురక, నోరు తెరిచి నిద్రపోవడం, చదువులో వెనుకబడటం, హైపర్ యాక్టివిటీ లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.
పాలీసోమ్నోగ్రఫీ (Sleep Study) ఈ వ్యాధి నిర్ధారణకు గోల్డ్ స్టాండర్డ్ పరీక్ష. ఇందులో నిద్ర సమయంలో శ్వాస, ఆక్సిజన్ స్థాయి, గుండె స్పందన, మెదడు తరంగాలు, శరీర కదలికలను పరిశీలిస్తారు.
ఎంపిక చేసిన రోగుల్లో హోమ్ స్లీప్ ఆప్నియా టెస్ట్ (HSAT) ద్వారా ఇంటి వద్దే పరీక్ష చేసే సౌకర్యం కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన చికిత్స Continuous Positive Airway Pressure (CPAP). నిద్ర సమయంలో ప్రత్యేక మాస్క్ ద్వారా గాలి అందించి శ్వాస మార్గాన్ని తెరిచి ఉంచుతుంది. దీంతో గురక తగ్గి, శ్వాస ఆగడం తగ్గుతుంది. Oral Appliance Therapy తేలికపాటి నుంచి మధ్యస్థ స్లీప్ ఆప్నియా ఉన్నవారికి ప్రత్యేక డెంటల్ పరికరాలు ఉపయోగపడతాయి.
ముక్కు, గొంతు నిర్మాణ లోపాలు ఉన్నవారిలో అవసరమైతే ఆధునిక ఎండోస్కోపిక్, లేజర్ ఆధారిత శస్త్రచికిత్సలు చేస్తారు.
ఎంపిక చేసిన కొందరు రోగుల్లో Hypoglossal Nerve Stimulation (Upper Airway Stimulation Therapy) అనే అత్యాధునిక ఇంప్లాంట్ చికిత్స మంచి ఫలితాలు ఇస్తున్నది. కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత స్లీప్ విశ్లేషణ, స్మార్ట్ CPAP పరికరాలు కూడా ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నాయి.
చాలామంది గురకను సాధారణ అలవాటుగా లేదా గాఢనిద్రకు సంకేతంగా భావిస్తారు. కానీ, వైద్యపరంగా అది చాలాసార్లు ‘స్లీప్ ఆప్నియా’ అనే తీవ్రమైన నిద్ర సంబంధిత వ్యాధికి సంకేతం. ఈ వ్యాధి వల్ల నిద్రలో శ్వాస పదేపదే ఆగిపోవడం, శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకపోవడం జరుగుతుంది. ఫలితంగా గుండె, మెదడు, ఊపిరితిత్తులు, జీవక్రియ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడటంతోపాటు అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, స్ట్రోక్, జ్ఞాపకశక్తి లోపం వంటి అనేక సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అయితే, సమయానికి గుర్తించి సరైన చికిత్సతీసుకుంటే ఈ వ్యాధిని సమర్థంగా నియంత్రించవచ్చు.
విటమిన్-డి, విటమిన్-బి12, విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-ఇ, ఫోలిక్ యాసిడ్ మెగ్నీషియం లాంటి పోషకాలు నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సాయపడతాయి. అయితే వైద్యుల సలహా మేరకే సప్లిమెంట్లు తీసుకోవాలి.
గురక గాఢనిద్రకు సంకేతం కాదు… అది శరీరం ఇస్తున్న హెచ్చరిక. సమయానికి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే స్లీప్ ఆప్నియాను పూర్తిగా నియంత్రించవచ్చు. మంచి నిద్ర అంటే మంచి ఆరోగ్యం. నాణ్యమైన నిద్రతోనే నాణ్యమైన జీవితం సాధ్యం.
– డా॥ విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్
సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్
స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్
యశోద హాస్పిటల్స్-సోమాజిగూడ
హైదరాబాద్