నిలోఫర్‌లో గతి తప్పిన వైద్యసేవలకు నిదర్శనం ఈ దృశ్యం. మంచాలు లేక గర్భిణులను కుర్చీల్లో కూర్చోబెట్టే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఉదయం 11.40 గంటలకు దవాఖానకు వచ్చిన ఖైరతాబాద్ మహిళ.. రాత్రి 10గంటల వరకు ఇలా కుర్చీలోనే ఉండిపోయింది. పలువురు గర్భిణులదీ ఇదే పరిస్థితి. బెడ్స్ ఖాళీ అయితేనే ఇస్తామని చెప్తున్నారని, పదేసి గంటలు ఇలా కూర్చోవాల్సి రావడంతో నరకం కనబడుతున్నదని వారు వాపోతున్నారు. సోమవారం నైట్‌డ్యూటీ అధికారులు కూడా అందుబాటులో లేరు.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ): నిలోఫర్ దవాఖానలో అధికారులు, సిబ్బంది అమానవీయ ప్రవర్తన నిండు గర్భిణులను అవస్థలపాలు చేస్తున్నది. ప్రసవం కోసం వచ్చిన వారిని బెడ్స్ లేవంటూ ఉదయం నుంచి రాత్రి వరకు కుర్చీల్లోనే కూర్చోబెట్టడం అధికారుల నిర్లక్ష్యం, అమానవీయతకు అద్దం పడుతున్నది. ఖైరతాబాద్‌కు చెందిన శ్రీశైలం తన భార్యకు నెలలు నిండటంతో ప్రసవం కోసం సోమవారం ఉదయం 11.40 గంటలకు నిలోఫర్‌లో చేర్పించాడు. అక్కడి సిబ్బంది ఆమెకు గర్భిణికి అడ్మిషన్ కల్పించి, అత్యవసర విభాగంలోకి పంపారు. కానీ అక్కడి సిబ్బంది బెడ్స్ లేవంటూ సదరు గర్భిణిని కుర్చీపైన కూర్చోబెట్టారు.
అక్కడ ఆమెతోపాటు చాలామంది గర్భిణులను ఉదయం నుంచి రాత్రివరకు కుర్చీలపైనే కూర్చోబెట్టారు. రాత్రి 10 గంటలైనా బెడ్ ఇవ్వకుండా కుర్చీలోనే కూర్చోబెట్టడంతో తీవ్ర ఇబ్బందులకు గురైన గర్భిణులు, వారి కుటుంబసభ్యులు తాము వేరే దవాఖానకు వెళ్లిపోతామని చెప్పగా.. ‘ఇక్కడ అడ్మిషన్ అయ్యారు, అలా వెళ్లడానికి వీళ్లేదు’ అని తమ ను వెళ్లనివ్వలేదని, దీంతో చేసేది లేక నానా అవస్థలు పడుతూ కుర్చీలోనే కూర్చున్నామని గర్భిణులు తెలిపారు.
ఈ సమాచారం అందుకున్న ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి విషయాన్ని సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించగా ఆయన స్పందించలేదు. ఆర్ఎంవో డాక్టర్ ఆనంద్ దృష్టికి తీసుకెళ్లగా పడకలను కేటాయించారు. అప్పటివరకు లేని బెడ్స్ ఇప్పుడు ఎలా వచ్చాయని బాధితులు ప్రశ్నిస్తున్నారు.