కౌడిపల్లి, ఏప్రిల్ 21 : ఎదురెదురుగా అతివేగంగా వచ్చి రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలైన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెంకట్రావ్పేట శివారులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కౌడిపల్లి పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ సూరారం ప్రాంతానికి చెందిన మహమ్మద్ అలీ తన ఆల్టో కారులో ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరి నర్సాపూర్‌లోని పెద్దబిడ్డ పిల్లలను తన కారులో ఎక్కించుకొని కొల్చారం మండల కేంద్రంలోని దర్గావద్ద నిద్రచేయడానికి బయలుదేరారు.
వెంకట్రావ్పేట శివారులోని కల్వర్టు వద్దకు రాగానే అతివేగంగా ఎదురుగా వస్తున్న స్విప్ట్ కారు మహమ్మద్ అలీ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు కార్ల ముందు భాగాలు నుజునుజ్జ్జు అయ్యాయి. ముందు కూర్చున్న మహమ్మద్ అలీ(50)కారులో మృతిచెందగా, అతని భార్య అజీమాబేగం (45)ను దవాఖానకు తరలించగా మృతిచెం దింది.
ఏడాది వయస్సున్న చిన్నారి గౌస్ నర్సాపూర్ దవాఖానకు తరలించగా మృతి చెందాడు. క్షతగాత్రులు సమ్రీన్‌కు ఎడమ కాలు, ఎడమ చేతికు బలమైన గాయమైంది. హీరాం, నీలోఫర్ సుల్తానియా, హుస్సేన్, సనాబేగం, జునేరా సుల్తానాలకు బలమైన గాయాలు కాగా, వారిని దవాఖానకు తరలించారు. మృతుడి తమ్ముడు మహమ్మద్ అబ్బాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రంజిత్‌రెడ్డి తెలిపారు. మెదక్ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సోమవారం నర్సాపూర్ సీఐ జాన్‌రెడ్డితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు.