సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రెండున్నరేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌కు ఒరగబెట్టిందేమీ లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పూర్తిస్థాయిలో రెండుసార్లు బడ్జెట్ పెట్టినా హైదరాబాద్ అభివృద్ధి మాత్రం అంగుళం కూడా పురోగతి సాధించలేదు. గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలబెడతామని, తమకు దేశంతో పోటీ లేదని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాధించిన ప్రగతి తప్ప..ఎక్కడా ప్రస్తుత ప్రభుత్వ మార్క్ కనిపించేలా ఏ ఒక్క పనీ చేయలేదు. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరిట ప్రజల ఇండ్లను కూల్చి.. విధ్వంసం సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి.. హైదరాబాద్ ప్రగతిని మరింత దిగజార్చారు.
రియల్ ఎస్టేట్ సహా ఐటీ రంగాలను పాతాళానికి నెట్టేశారు. కానీ ఎక్కడా ప్రగతి సాధించేలా చర్యలు తీసుకోలేదు. ఎన్నికల హామీల మాదిరిగా అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని చెప్పడమే తప్ప.. ఏ పనినీ ఆచరణలో చేసి చూపించిన దాఖలాలు లేవు. హైదరాబాద్‌కు బుల్లెట్ రైలు తెస్తాం.. మూసీని అభివృద్ధి చేస్తాం.. ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం.. అంటూ ఇలా చేస్తామని చెప్పడమే కాని ‘చేశాం’.. అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. గవర్నర్ కూడా అన్నీ చేస్తామనే చెప్పారు కానీ.. చేసినట్లు ఏ ఒక్కమాటా అనలేదు. పదేండ్ల బీఆర్ఎస్ హయాలో పురోగమించిన ఐటీ పరిశ్రమను ఇప్పుడు తాము చేసినట్లు చెప్పుకొచ్చారు. అదేవిధంగా మూసీ సుందరీకరణకు నాటి కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ఎస్టీపీలను, రెండో విడద అమృత్ నుంచి నిధుల ప్రతిపాదనలను కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుని గొప్పలు చెప్పుకున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లయింది. మరో రెండున్నరేండ్లు మాత్రమే మిగిలి ఉన్నది. ఇంకా సంబంధిత ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా కొనసాగుతున్నాయి. నగరాన్ని ఇష్టానుసారంగా మూడు ముక్కలుగా విభజించి ఒక పద్ధతి లేకుండా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. అటు పోలీసు కమిషనరేట్లను కూడా అతీగతీ లేకుండా విభజించి ఫ్యూచర్ సిటీ పేరిట నగరం నెత్తిన కొత్త కుంపటి తీసుకొచ్చారు.
నగరంలోని పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతల అంటే రేవంత్‌రెడ్డి కలలు కంటున్న ఫ్యూచర్ సిటీకి మారుస్తామని.. రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపారు. పరిశ్రమల తరలింపు ద్వారా ఉద్యోగాల కల్పన అని అభూత కల్పన సృష్టిస్తున్నారు. అటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని భావిస్తున్నామని చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్ల నుంచి రీజినల్ రింగ్ రోడ్డు అంగుళం కూడా కదలలేదు. దాన్ని అక్కడే గాలికొదిలేసి.. మధ్యలో రేడియల్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారు. స్వరాష్ట్ర ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టేందుకు హైదరాబాద్-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మిస్తామని గొప్పలకు పోతున్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ చెప్తూనే ఉన్న బుల్లెట్ ట్రైన్ హబ్‌గా శంషాబాద్‌ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. గ్లోబల్ సమ్మిట్ పేరిట హైదరాబాద్‌కు పెట్టుబడుల వరద పారించామని గవర్నర్ ప్రసంగంలో చేర్చారు. అది జరిగి ఆరునెలలు కావొస్తున్నా ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాలేదు. బయో ఏసియా అంతర్జాతీయ సదస్సులోనూ రూ.1700 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామంటున్నారు. అది ఆకర్షణగానే మిగిలిపోయింది.
గవర్నర్ ప్రసంగంలో ప్రధాన అంశాలుగా మూసీ సుందరీకరణ, హైడ్రాను పేర్కొన్నారు. హైడ్రా పేరిట తెలంగాణలో రేవంత్‌రెడ్డి బుల్డోజర్ రాజ్యాన్ని ఆవిష్కరించారు. పేదల ఇండ్లపైకి ఇష్టానుసారంగా బుల్డోజర్లను పంపించి నిర్వాసితులను చేశారు. వందలాది మంది నిరుపేదలను రోడ్డు పాలు చేశారు. కానీ ఇష్టానుసారం కబ్జాలకు తెగబడ్డ కాంగ్రెస్ పెద్దలు, పెత్తందారులకు హైడ్రాను రక్షణ కవచంగా మార్చారు. కానీ గవర్నర్ ప్రసంగంలో మాత్రం రూ.60 వేల కోట్ల విలువైన భూములను కాపాడినట్లు మాట్లాడించారు. కానీ హైడ్రా వెనుక ఉన్న నిరుపేదల ఆకలి కేకలను మాత్రం అణిచిపెట్టి ఉంచారు.
మూసీ సుందరీకరణలో భాగంగా గాంధీ సరోవర్ ఏర్పాటు చేస్తున్నామని గొప్పగా ప్రకటించుకున్నారు. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుకు డీపీఆర్ కూడా సిద్ధం చేయలేదనే విషయాన్ని తొక్కి పెట్టారు. వందలాది మంది పేదల ఇండ్లను కూల్చిన సంగతి. వందలాది మంది ఇండ్ల కూల్చివేతలకు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతిని పక్కకు పెట్టారు. మొత్తంగా అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ప్రసంగం హైదరాబాద్ ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.