తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రాజకీయాంశాలతో తెరకెక్కిన బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికి ఈ ఏడాది ఆస్కార్ వేదిక పట్టం కట్టింది. విప్లవ భావజాలం, రాజకీయ వ్యంగ్యం, తరాల సంఘర్షణ ప్రధానాంశాలుగా తెరకెక్కిన ఈ చిత్రం ఆరు పురస్కారాలతో అగ్రభాగాన నిలిచింది. ప్రపంచ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం లాస్ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో వైభవంగా జరిగింది. ఈ ఏడాది ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ‘సిన్నర్స్’ చిత్రాలకు అవార్డుల పంట పండింది. ఈ 98వ ఆస్కార్ అవార్డుల వేడుకకు హలీవుడ్ కమెడియన్ కోనన్ ఓబ్రియన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ ఏడాది సందేశాత్మక, మానవీయ కథాంశాలకు అవార్డుల్లో పెద్దపీట వేశారు.

Paul Thomas Anderson
విప్లవం, సంఘర్షణ నడుమ..
థామస్ పించన్ 1990లో రాసిన ‘వినేలాండ్’ అనే నవల ఆధారంగా ఈ ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రాన్ని తెరకెక్కించారు. పాల్ థామస్ అండర్సన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో లియోనార్డో డికాప్రియో కథానాయకుడు. ఒకనాటి విప్లవ సిద్ధాంతాలతో నేటి రాజ్యం చేసే సంఘర్షణే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. కాలిఫోర్నియా నేపథ్యంలో సాగే ఈ కథ 1970లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ‘ఫ్రెంచ్ 75’ బృంద సభ్యుడైన బాబ్ ఫెర్గూసన్ (లియోనార్డో డికాప్రియో) జీవితానికి విప్లవాత్మక, హృద్యమైన దృశ్యరూపంలా సాగుతుంది. బిడ్డ కోసం తండ్రి పడే సంఘర్షణకు అద్దం పడుతూ కన్నీరు తెప్పిస్తుంది.
బాబ్, పెర్ఫిడియా బేవర్లీ హిల్స్ (టియానా టేలర్) సహజీవనం చేస్తుంటారు. విప్లవ భావజాలం మెండుగా ఉండే పెర్ఫిడియా వలసదారులను విడిపించే క్రమంలో కమాండింగ్ అధికారి స్టీవెన్‌ను అవమానిస్తుంది. దాంతో అతను ఆమెపై పగపెంచుకుంటాడు. కొన్నాళ్ల తర్వాత పెర్ఫిడియాను ఓ కేసులో ఇరికిస్తాడు స్టీవెన్. దాని నుంచి బయటపడాలంటే తనతో శారీరకంగా కలవాలని షరతు విధిస్తాడు. అతని కారణంగా పెర్ఫిడియా ఓ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తర్వాత పెర్ఫిడియా కుటుంబాన్ని వదిలేసి విప్లవమార్గంలోకి వెళుతుంది. కొన్నాళ్లకు చిన్నారి చార్లీ తన కూతురే అని తెలుసుకుంటాడు స్టీవెన్. ఈ విషయం బయటకు తెలిస్తే తన పేరుప్రతిష్టలకే భంగ అనుకొని చిన్నారిని చంపాలని ప్రయత్నిస్తుంటాడు. వీటి నుంచి చిన్నారి చార్లీన్ను బాబ్ ఎలా రక్షించాడన్నదే చిత్ర కథ.
బాక్సాఫీస్ వద్ద భారీ విజయం
‘పోరాటం కేవలం గెలుపు కోసం చేసేది కాదు. అది అంతిమంగా మనల్ని అలసిపోయేలా చేస్తుంది’ అనే సినిమా డైలాగ్ ఈ సినిమా కథ తాలూకు ఆత్మను ప్రతిబింబిస్తుంది. ఓ విప్లవకారుడు పరిస్థితుల ప్రాబల్యం వల్ల సాధారణ వ్యక్తిగా పరివర్తన చెందడం ఈ కథలో ప్రధానాంశం. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల మందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద 210 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. వివిధ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులతో సత్తాచాటింది. బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ కాస్టింగ్, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగాల్లో మొత్తంగా ఆరు ఆస్కార్లను గెలుచుకుంది.

బుల్లితెర నుంచి ఆస్కార్ వరకు..
‘సిన్నర్స్’ చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా ఆస్కార్ గెలుచుకున్న మైఖెల్ బీ జోర్డాన్ది ఓ స్ఫూర్తివంతమైన ప్రయాణం. బుల్లి తెర నటుడిగా ఆయన కెరీర్‌ను మొదలుపెట్టారు. ది వైర్, ఫ్రైడే నైట్ లైట్స్ వంటి సిరీస్‌ల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ‘ఫ్రూట్‌వేల్ స్టేషన్’ (2013) చిత్రం ఆయన కెరీర్‌ను మలుపుతిప్పింది. ‘క్రీడ్’ చిత్రంతో కమర్షియల్‌గా సక్సెస్ సాధించారు. ‘సిన్నర్స్’ చిత్రంలో జోర్డాన్ కవలలుగా ద్విపాత్రాభినయంలో మెప్పించారు. ఒక సినిమాలో కవల పాత్రల్లో నటించి ఆస్కార్ గెలుచుకున్న తొలి నటుడిగా ఆయన రికార్డు సృష్టించారు. మార్వెల్ చిత్రం ‘బ్లాక్ పాంథర్’లో ఆయన పోషించిన కింగ్మాంగర్ అనే పాత్ర హాలీవుడ్లో ది బెస్ట్ విలనీ రోల్‌గా నిలిచిపోయింది. యాక్షన్‌తో పాటు సామాజిక సందేశాత్మక చిత్రాలకు జోర్డాన్ ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటారు.
బీబీసీ షో నుంచి ఎదిగిన జెస్సీ బక్లే
‘హామ్నెట్’ చిత్రానికిగాను జెస్సీ బక్లే ఉత్తమ నటిగా అవార్డును కైవసం చేసుకుంది. ‘ఐ వుడ్ డూ ఎనీథింగ్’ (2008) అనే బీబీసీ టాలెంట్షో ద్వారా జెస్సీ బక్లే పాపులర్ అయ్యారు. యాక్టింగ్‌తో పాటు సింగర్‌గా కూడా ఆమెకు మంచి పేరుంది. టెలివిజన్ డ్రామాలతో పాటు ఇండిపెండెంట్ ఫిల్మ్స్‌లో నటన ద్వారా ఆమె పేరు తెచ్చుకున్నారు. వైల్డ్ రోజ్, చెర్నోబిల్, ది లాస్ట్ డాటర్ చిత్రాలు నటిగా ఆమె ప్రతిభను చాటాయి. ‘హామ్నెట్’ చిత్రంలో ఆగ్నెస్ షేక్స్పియర్ పాత్రలో ఆమె నటనకుగాను ఆస్కార్ అవార్డు దక్కింది.
హారర్ థ్రిల్లర్ ‘సిన్నర్స్’
సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘సిన్నర్స్’ నాలుగు పురస్కారాలను గెలుచుకుంది. ఉత్తమ నటుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగాలలో ఈ సినిమా పురస్కారాలను దక్కించుకుంది. 1930ల నాటి మిసిసిపీ డెల్టా నేపథ్యంలో సాగే హారర్ థ్రిల్లర్ ఇది. స్మోక్, స్టాక్ (మైఖెల్ బి జోర్డాన్) అనే కవల సోదరుల చుట్టూ కథ తిరుగుతుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వీరిద్దరూ అనంతరం చికాగోలోని మాఫియా బృందంలో సభ్యులుగా చేరి బాగా డబ్బు సంపాదిస్తారు. అక్కడి నుంచి సొంత ఊరికి చేరుకొని కలప వ్యాపారాన్ని మొదలుపెడతారు. అక్కడ వారు ఎదుర్కొన్న వర్ణవివక్ష, పిశాచాల (వాంపైర్స్) వల్ల ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలతో ఈ కథ నడుస్తుంది. అమెరికాలోని నల్లజాతీయుల చరిత్రను, వారి కళలను, పూర్వీకులతో వారి అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ నైతిక విలువల సంఘర్షణతో సాగుతుంది. స్టీఫెన్ కింగ్ రాసిన ‘సేలమ్స్ లాట్’ అనే నవల స్ఫూర్తితో దర్శకుడు రయాన్ కూగ్లర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మార్మిక అంశాలతో సంగీత ప్రధానంగా ప్రేక్షకుల్ని మెప్పించింది.
భారతీయ నటులకు నివాళి
98వ ఆస్కార్ వేడుకలో గత ఏడాది దివంగతులైన నటీనటులకు నివాళులర్పించారు. వారు సినీరంగానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. హాలీవుడ్ ప్రముఖులతో పాటు భారతీయ సినిమా నుంచి ధర్మేంద్ర, మనోజ్‌కుమార్, బి.సరోజాదేవి, కోట శ్రీనివాసరావు వంటి దిగ్గజ నటుల పేర్లను ఆస్కార్ అకాడమీ తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. అయితే మరణించిన ప్రముఖులను స్మరించుకుంటూ రూపొందించిన వీడియోలో ధర్మేంద్రను చూపించకపోవడంతో అభిమానులు సోషల్‌మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయాభావం వల్ల వీడియోలో కొందరినే చూపించామని, అందరి పేర్లను అధికారిక సైట్లో పొందుపరుస్తామని ఆస్కార్ కమిటీ పేర్కొన్నది.
భారతీయ సినిమాకు నిరాశ
జాన్వీకపూర్, ఇషాన్‌కట్టర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హోమ్‌బౌండ్’ చిత్రం పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి ప్రశంసలు దక్కించుకుంది. ‘ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్’ విభాగంలో ఈ సినిమా భారత్ తరపున ఆస్కార్ 2026కు అధికారిక ఎంట్రీ సాధించింది. అయితే ఆస్కార్ ఫైనల్ నామినేషన్లో ఈ సినిమా చోటు సంపాదించుకోలేకపోయింది. నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మత, కుల వివక్షను చర్చించారు.

ఆస్కార్ విజేతలు