ఏపీ బడ్జెట్ సమావేశాల్లో అక్కడి గవర్నర్ ప్రసంగంలో నల్లమల సాగర్ నీళ్లు తీసుకెళ్లేందుకు పనులు ముమ్మరం చేస్తున్నామని గర్వంగా చెప్పిండ్రు. మరి తెలంగాణ గవర్నర్ ప్రసంగంలో నల్లమల-బనచకర్లను అడ్డుకుంటామని, గోదావరిలో చుక్క నీటిని కూడా వదులుకోబోమని ఎందుకు చెప్పలేక పోయారు?
-హరీశ్‌రావు
గతంలో కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోయిన ఆంధ్రప్రదేశ్ కన్ను ఇప్పుడు గోదావరి జలాలపై పడింది. ఇక్కడి చేతగాని, చేవచచ్చిన రేవంత్ సర్కార్‌ను ఆసరా చేసుకొని నీళ్లను అక్రమంగా తరలించుకు పోయేందుకు కుట్రలు చేస్తున్నది. కేంద్రంలోని బీజేపీ అండదండలతో తెలంగాణకు శాశ్వత అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నది.
-హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): దేశంలోని బీజేపీ, ఏపీలోని టీడీపీ ప్రభుత్వాలు కూడబలుక్కొని కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొద్దునిద్ర నటిస్తూ రాష్ర్టానికి తీరని ద్రోహం చేస్తున్నాడని, తన గురువు చంద్రబాబుకు దాసోహమై రాష్ట్ర నీటి హక్కులు తాకట్టుపెడుతున్నాడని విరుచుకుపడ్డారు. గతంలో తెలంగాణలో ప్రాజెక్టులు లేవని సాకుగా చూపి కృష్ణా జలాలు కొల్లగొట్టిన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు గోదావరిని చెరబట్టేందుకు సిద్ధమైందని ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా హాల్లో సోమవారం ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, వివేకానందగౌడ్, అనిల్‌జాదవ్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్ర నీటి హక్కుల సాధనకు చేసిన కృషిని వివరించారు. ప్రస్తుత రేవంత్ సర్కార్ కాలరాస్తున్న తీరును ఆధారాలతో ఎండగట్టారు.
తెలంగాణ నీటిహక్కులు కాపాడింది కేసీఆరే
సమైక్య పాలనలో నీళ్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కేసీఆర్ రాత్రింబవళ్లు శ్రమించారని హరీశ్ గుర్తుచేశారు. కృష్ణా జలాల్లో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు పదేండ్లపాటు కృషిచేశారని చెప్పారు. కృష్ణా ట్రిబ్యునల్‌ను సాధించి నీటి పునఃపంపిణీ జరిగేలా చూశారని తెలిపారు. గోదావరిలో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తెలంగాణ నీటి హక్కులను శాశ్వతంగా కాపాడారని వివరించారు. ఆయన చొరవతోనే గోదావరిలోని 1400 టీఎంసీల్లో తెలంగాణకు 968, ఏపీకి 518 టీఎంసీలు కేటాయించారని చెప్పారు. తెలంగాణ నీటి హక్కులను స్థిరపరిచేందుకు యుద్ధప్రాతిపాదికన ప్రాజెక్టులు నిర్మించి 400 టీఎంసీలకు హక్కులు సాధించారని తెలిపారు.
ఢిల్లీ మీటింగ్ మినిట్స్‌పై మౌనమెందుకు?
గతంలో కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోయిన ఆంధ్రప్రదేశ్ కన్ను ఇప్పుడు గోదావరి జలాలపై పడిందని హరీశ్ విమర్శించారు. ఇక్కడి చేతగాని, చేవచచ్చిన రేవంత్ సర్కార్‌ను ఆసరాగా చేసుకొని అక్రమంగా తరలించుకుపోయేందుకు కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. ‘గత జనవరి 30న ఢిల్లీలో ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదలశాఖ ఉన్నతాధికారుల కమిటీ సమావేశంలో తెలంగాణ నీటి హక్కులకు ఏపీ సూటిపెట్టింది. బచావత్ ట్రిబ్యునల్ గోదావరిలో ఏ రాష్ట్రానికీ నీటి కేటాయింపులు చేయలేదని వాదించింది. మినిట్స్లోని పేజీ నంబర్ 3లో ఏపీ చెప్పినట్టు స్పష్టంగా ఉన్నది. అడ్డుకోవాల్సిన తెలంగాణ అధికారులు డూడూ బసవన్నల్లా తలూపారు. సీడబ్ల్యూసీ ఇదే అదనుగా భావించి గోదావరిలో తెలంగాణకు శాశ్వతంగా నష్టంచేసేలా నిర్ణయం తీసుకున్నది. మీటింగ్‌కు సంబంధించి ఫిబ్రవరి 12న మినిట్స్ వచ్చి నెల మీద నాలుగు రోజులు దాటినా సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల మంత్రి నిద్రపోతున్నారా? చంద్రబాబుకు దాసోహమయ్యారా? తెలంగాణను ఏపీకి తాకట్టుపెట్టారా? రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? ఈ మినిట్స్‌పై ఎందుకు స్పందించరు?‘ అని ప్రశ్నలవర్షం కురిపించారు.
మోకాళ్లపై పరుగెత్తుకుంటూ మీటింగ్‌కు
‘అసలు మొదట మీటింగ్‌కు పోమని చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఎందుకో మోకాళ్ల మీద పరుగెత్తుకుంటూ పోయిండ్రు. బనకచర్ల, నల్లమల సాగర్ ఎజెండాలో లేకుంటేనే పోతమని సీడబ్ల్యూసీకి లేఖ రాశామని చెప్పిన్రు. కానీ ఏపీ ఎజెండాలో మొదటి అంశమే పోలవరం నల్లమల సాగర్‌ను చేర్చింది. మరి మీరు ఏవిధంగా మీటింగ్‌లో పాల్గొన్నరు? అసలు తెలంగాణ నీటి హక్కులమీద సోయిలేదా? బాధ్యతలేదా?’ అని హరీశ్ నిలదీశారు. ఇప్పటిదాకా రేవంత్ ప్రభు త్వం స్పందించలేందటే తెలంగాణకు వాటాలేదని అంగీకరించినట్టేకదా? అని ఎత్తిచూపారు. ‘బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయకుంటే సెంట్రల్ వాటర్ కమిషన్ వివిధ రాష్ర్టాలకు చెందిన 76 ప్రాజెక్టులకు ఎలా అనుమతించింది? ట్రిబ్యునల్ అవార్డును ప్రశ్నించే హక్కు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకెక్కడిది?’ అని ప్రశ్నించారు. అయినా దొంగచేతికి తాళాలిచ్చినట్టు చంద్రబాబు ఏజెంట్ ఆదిత్యనాథ్‌దాస్‌ను తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల సలహాదారుగా పెట్టుకుంటే ఇంతకుమించి మన రాష్ట్రానికి ఏం ఒనగూరుతుందని చురకలంటించారు.
మేం నిలదీసిన ప్రతిసారీ లేఖల డ్రామా
గోదావరి జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిలదీసిన ప్రతిసారీ కాంగ్రెస్ సర్కార్ ఉలిక్కిపడి లేచి కేంద్రానికి లేఖలు రాస్తూ చేతులు దులుపుకొంటున్నదని హరీశ్ తూర్పారబట్టారు. ‘బహుశా నిన్న నేను ప్రెస్‌మీట్ పెట్టినందున మరోసారి కేంద్రానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖరాస్తారేమో!’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్‌రెడ్డికి రాజకీయ ప్రయోజనాలు తప్ప నీటి ప్రయోజనాలు పట్టవని విమర్శించారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పాలనను గాలికొదిలి పబ్బంగడుపుతున్నారని మండిపడ్డారు.
రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్న ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను ధిక్కరించడం దుర్మార్గమని హరీశ్ ధ్వజమెత్తారు. యథేచ్ఛగా మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తున్నదని పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గోదావరిలో ఏపీకి 531 టీఎంసీల వాటాను పరిగణనలోకి తీసుకొనే సీడబ్ల్యూసీ సీతారామ ప్రాజెక్టు (67 టీఎంసీలు)కు అనుమతులిచ్చిందని గుర్తుచేశారు. జూన్ 2023లో సీడబ్ల్యూసీ రిపోర్ట్‌లో గోదావరిలో 3,396 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని, అందులో ఏపీ వాటా పోను మిగిలినవన్నీ తెలంగాణవేనని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. నాడు 531 టీఎంసీలకు ఒప్పుకొన్న ఏపీ 775 టీఎంసీల కోసం కోట్లాడుతున్నదని చెప్పారు. కానీ నిలువరించాల్సిన రేవంత్ సర్కార్‌కు చీమకుట్టినట్టయినా లేదని దెప్పిపొడిచారు. కృష్ణా జలాల్లోనూ 34 శాతం తాత్కాలిక వాటాను కూడా కాపాడుకోలేకపోతున్నదని దుయ్యబట్టారు.
నీళ్ల తరలింపుపై నోరు మెదపరు
కేసీఆర్ పాలనలో నీటి వినియోగాన్ని లెక్కించేందుకు కృష్ణా నదిపై 18 టెలిమెట్రీలు ఏర్పాటు చేశామని హరీశ్ గుర్తుచేశారు. ‘కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ టెలిమెట్రీల నిర్వహణ కోసం కేటాయించిన రూ.4.5 కోట్లను కేఆర్ఎంబీ అధికారుల వేతనాలకు వాడుకున్నరు. బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా కొత్త టెలిమెట్రీలు పెట్టేదిలేదని తేల్చిచెప్పారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నోరుమెదపడంలేదేందుకు?’ అని నిలదీశారు. ‘ఏపీ బడ్జెట్ సమావేశాల్లో అక్కడి గవర్నర్ ప్రసంగంలో నల్లమల సాగర్ నీళ్లు తీసుకెళ్లేందుకు పనులు ముమ్మరం చేస్తున్నామని గర్వంగా చెప్పారు. మరి తెలంగాణ గవర్నర్ ప్రసంగంలో నల్లమల-బనచకర్ల సాగర్‌ను అడ్డుకుంటామని, గోదావరిలో చుక్క నీటిని కూడా వదులుకోబోమని ఎందుకు చెప్పలేక పోయారు? రేవంత్ సర్కార్ ఢిల్లీ మీటింగ్ మినిట్స్‌పై స్పందించదు. ఏపీ గవర్నర్ ప్రసంగంపై మాట్లాడదు. కృష్ణాలో 80 శాతం నీళ్లు తరలించుకెళ్తుంటే నోరు మెదపదు’ అంటూ విరుచుకుపడ్డారు. కృష్ణాతో పాటు గోదావరి నీళ్లను ఏపీ దోచుకుపోకుండా మొద్దునిద్ర వీడి మిటింగ్ మినిట్స్‌పై గట్టిగా అభ్యంతరం చెప్పాలని డిమాండ్ చేశారు.