రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు ఉచిత కరెంట్ సరఫరా, పుష్కలంగా సాగునీరు లభిస్తుండడంతో రైతులు సంబురంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఎరువుల వినియోగం, పంట దిగుబడి, కొనుగోలు కేంద్రాల ఏర్పాటును అంచనా వేసేందుకు ప్రభుత్వం ప్రతీ సీజన్లో పంటల సర్వే నిర్వహిస్తున్నది. ఏ సర్వే నంబర్లో ఏ పంట వేస్తున్నారు.. ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు, అంతర్ పంట ఏమిటి, నీటి వసతి తదితర వివరాలు సేకరిస్తున్నది. ప్రస్తుతం వానకాలం వ్యవసాయ పనులు జోరందుకోవడంతో వ్యవసాయ విస్తరణ అధికారులు క్లస్టర్ల వారీగా పంటల లెక్క తీస్తున్నారు. క్షేత్రస్థాయిలో పొలాల వద్దకు వెళ్లి రైతుల నుంచి పూర్తి సమాచారం తెలుసుకుని రైతుబంధు పోర్టల్‌తో పాటు కడస్ట్రాల్ యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో వానకాలం సాగుకు సంబంధించి వ్యవసాయశాఖ ప్రణాళికలు రూపొందించగా, 3.76 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసింది. అత్యధికంగా 3.10 లక్షల ఎకరాల్లో వరి, 45వేల ఎకరాల్లో పత్తి, ఆ తర్వాత మొక్కజొన్న, కంది, మినుములు, పెసర్లులాంటి పంటలు పండించే అవకాశం ఉందని భావిస్తున్నది. వచ్చే నెల 15లోగా నమోదు ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
– మెదక్ (నమస్తే తెలంగాణ)/ అందోల్, జూలై 23
మెదక్, జూలై 23 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ శాఖ ఏటా సీజన్ల వారీగా పంటల నమోదు ప్రక్రియ (క్రాప్ బుకింగ్) నిర్వహిస్తున్నది. వ్యవసాయ విస్తరణ అధికారుల ఆధ్వర్యంలో క్లస్టర్ల వారీగా సాగు చేసిన పంటల వివరాలు నమోదు చేస్తున్నారు. రైతులు సాగు చేసిన పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు పకాగా రైతు బంధు పోర్టల్‌లో పొందుపరుస్తున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పంటల వివరాలు సేకరిస్తున్నారు.
జిల్లాలో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరగడంతో సాగు విస్తీర్ణాన్ని పెంచుకున్నారు. వానకాలం పంట సాగు గతంలో కంటే పెంచారు. దీనికి అనుగుణంగా వ్యవసాయ అధికారులు వాస్తవ పంట ప్రణాళిక రూపొందించారు. రైతుల వారీగా సర్వే నంబర్లు సాగు విస్తీర్ణంలో వేసిన పంటలు, ప్రధాన పంటలు, అంతర పంట, నీటి వసతి వివరాలతో పాటు యజమాని సెల్‌నంబర్‌తో పాటు సంతకాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో 76 క్లస్టర్లలో 76 మంది ఏఈవోలు విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఏ సర్వే నంబరులో ఎంత విస్తీర్ణం ఉంది? ఏ రైతు ఏ పంట వేశాడు? అనే వివరాలు సేకరించారు. ఈసారి దానికి అదనంగా మరికొన్ని అంశాలు జోడించారు. వాటితో పాటు పంట ఏ దశలో ఉంది? చీడ పీడలు ఏమైనా ఆశించాయా? పంట దిగుబడి ఎంత వచ్చే అవకాశం ఉంది? అనే వివరాలను వివిధ దశల్లో నమోదు చేసేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఏఈవోలు ఎకడో కార్యాలయంలో కూర్చొని వివరాలు నమోదు చేయకాకుండా, తప్పనిసరిగా వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లి నమోదు చేస్తేనే వివరాలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు.
జిల్లాలోని మెదక్, తూప్రాన్, నర్సాపూర్ డివిజన్ల పరిధిలో వానకాలం పంటల సాగుకు సంబంధించిన ప్రణాళికలను వ్యవసాయశాఖ రూపొందించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి కాస్తా సాగు విస్తీర్ణం పెరిగింది. గడిచిన యాసంగి సీజన్లో 3.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా ఈ వానకాలం సీజన్లో 3.76 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. దీంట్లో 3.10 లక్షల ఎకరాల్లో వరి, 45 వేల ఎకరాల్లో పత్తి, 7వేల ఎకరాల్లో మొక్కజొన్న, 4 వేల ఎకరాల్లో కంది, 11 వేల ఎకరాల్లో మినుములు, 1500 ఎకరాల్లో పెసర్లు, 120 ఎకరాల్లో సోయాబీన్, 200 ఎకరాల్లో జొన్న, 5500 ఎకరాల్లో ఇతర పంటలు సాగవుతాయని అంచనా వేశారు. రైతులు సాగు చేసిన పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు క్లస్టర్ల వారీగా ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
వానకాలం పంటల సర్వే పకడ్బందీగా చేపడుతున్నాం. గ్రామాల్లో పొలాల వద్దకు సిబ్బంది వెళ్లి వివరాలు తెలుసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ వానకాలంలో 3.76 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉన్నదని అంచనా వేశాం. ఇప్పటి వరకు జిల్లాలో 1.12 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఈ నెలాఖరులోగా వరి పంటలు వేయనున్నారు. పంటలను పక్కాగా లెక్కించి దానికి అనుగుణంగా రాబోయే కాలంలో ప్రణాళికలు రూపొందిస్తున్నాం. – ఆశాకుమారి,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, మెదక్