గుమ్మడిదల, ఫిబ్రవరి 7: డంపింగ్ యార్డు ఏర్పాటును బహిరంగంగా వ్యతిరేకించలేక, తమ ప్రభుత్వ నిర్ణయాన్ని కాదనలేక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల, జిన్నారం మండలాల కాంగ్రెస్ నాయకులు మథన పడుతున్నారు. డంపింగ్ యార్డు వద్దే వద్దంటూ ప్రజలు పెద్దఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతుండడంతో హస్తం నేతలు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై ఏమి సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ నాయకులపై దుమ్మెత్తి పోస్తున్నారు. మీ పాలనలోనే డంపింగ్ యార్డుకు బీజం పడిందని ఆరోపిస్తున్నారు.
కానీ, బాధిత గ్రామాలకు అండగా సంఘీభావం తెలుపలేని సంకట స్థితిలో కాంగ్రెస్ నాయకులు కొట్టుమిట్టాడుతున్నారు. శుక్రవారం గుమ్మడిదల మున్సిపాలిటీలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు పుట్ట నర్సింగ్‌రావు అధ్యక్షతన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దీనికి గుమ్మడిదల, జిన్నారం మండలాల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, వడ్డె కృష్ణతో పాటు పలు గ్రామాల కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము కూడా డంపింగ్ యార్డుకు వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, స్థానికులతో కలిసి డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. డంపింగ్ యార్డు పనులు నిలిపివేయడానికి తాము మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి విన్నవిస్తామని తెలిపారు. అందరూ కలిసి పోరాడితేనే పనులు నిలిపి వేయవచ్చని సూచించారు. డంపింగ్‌యార్డు పనులు నిలిపి వేయడానికి ప్రణాళికను రూపిందిస్తామని పేర్కొన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీటీసీ గోవర్ధన్‌గౌడ్, వీరారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, జంగారెడ్డి, అంజద్, గ్యారల మల్లేశ్, కుమ్మరి వెంకటేశ్, లక్ష్మారెడ్డి, నారబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.