నారాయణఖేడ్/ నిజాంపేట్, మార్చి 31: యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గానికి చేసిందేమీ లేకపోగా, సమైక్య రాష్ట్రంలో పదేండ్ల పాటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా అధికారం ఉన్నా అభివృద్ధి ముసుగులో తమ జేబులు నింపుకున్న చరిత్ర ఆ పార్టీ నాయకులదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిజాంపేట్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు, చెరువుల మరమ్మతుల పేరిట నిధులు పక్కదారి పట్టించి కాజేసిన ఘనత కాంగ్రెస్ నాయకులకే దక్కిందన్నారు. కొన్ని రోజుల క్రితం కంగ్టి మండలం దామరగిద్ద చెరువు మరమ్మతు పేరిట కాంగ్రెస్ నాయకుడు రూ.2.90 కోట్ల అవినీతికి పాల్పడగా, పదకొండు వందల ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువు కింద ఒక్క ఎకరం కూడా నీరు పారకుండా చేశారన్నారు.
గతంలో దవాఖానలు, విద్యాలయాలు, రోడ్లు ఇలా ఏ విషయంలోనైనా గత ప్రభుత్వాల పనితీరుతో కేసీఆర్ ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకుని గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏ గ్రామం వెళ్లినా సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధే కండ్లకు కనబడుతుందన్నారు. సమైక్య రాష్ట్రంలో 50 ఏండ్లలో చేయని అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం గడిచిన ఎనిమిదేండ్లలో చేశామని, గ్రామాల్లో సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, మురుగు కాల్వల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. తమ ప్రభుత్వం ప్రతి పంటను కొనుగోలు చేస్తూ రైతులకు బాసటగా నిలుస్తుందని, జొన్న రైతులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుని రూ.2,660లకు కొనుగోలు చేశామని గుర్తు చేశారు.
రైతుబంధు, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, రైతుబీమా వంటి పథకాలు ప్రతి పేదవాడిని ఆదుకుంటున్నట్లు చెప్పారు. పిడుగుపాటుతో మృతి చెందితే రూ.5 లక్షలు, విద్యుత్‌షాక్‌తో మరణిస్తే రూ.6 లక్షలు, పశువులు మరణించినా ప్రభుత్వం పరిహారం అందజేస్తున్నదన్నారు. రైతుబంధు పథకం వచ్చిన తర్వాత రైతులకు అప్పులు చేసే బాధ తప్పిందని, ప్రతి గడపకూ చేరుతున్న ప్రభుత్వ పథకాలే బీఆర్ఎస్ను మూడోసారి అధికారంలోకి తెస్తాయన్నారు. తాను నిజాంపేట్ కేంద్రంగా మండలం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న క్రమంలో కాంగ్రెస్ నాయకులు మండల ఏర్పాటును అడ్డుకునేందుకు గ్రామాల మధ్య చిచ్చు పెట్టారని గుర్తు చేశారు.
తడ్కల్ మండలం ఏర్పాటు గురించి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బీజేపీ అంటే బడా జూటా పార్టీ అని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలని తమ పథకాలుగా చెప్పుకుంటూ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా నిత్యావసర ధరలు పెంచారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కార్యకర్తలు ప్రజలకు వివరించి బీఆర్ఎస్ను మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. కార్యకర్తలిచ్చిన ధైర్యంతోనే తాను ముందుకు సాగుతానని, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అహర్నిషలు కృషి చేస్తానన్నారు.
కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిక
మండల కేంద్రమైన నిజాంపేట్ పంచాయతీ 1, 2 వార్డు సభ్యులు మమత రమేశ్, సంగమ్మ నర్సింహులులు శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి, కల్హేర్ జడ్పీటీసీ నర్సింహారెడ్డి, స్థానిక సర్పంచ్ జగదీశ్వర్‌చారి, నాయకులు రవీందర్‌నాయక్, రమేశ్చౌహాన్, సంగారెడ్డి, దుర్గారెడ్డి, మాణిక్‌రెడ్డి, నవాబ్‌పటేల్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.