గజ్వేల్, డిసెంబర్ 31 : అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని అమ్ముకునే సమయంలో తీవ్రంగా నష్టపోతున్నారు. అమాయక రైతులను ఆసరాగా చేసుకుని వ్యాపారులు, దళారులు తూకాల్లో మోసం చేస్తున్నారు. పండించిన పంటలో ఎంతో కొంత లాభం వస్తుందనే ఆశతో ఉన్న రైతులకు తీరని అన్యాయం జరుగుతున్నది. రైతులకు ఎక్కువ ధర వెచ్చిస్తామని చెప్పి దళారులు నట్టేట ముంచుతున్నారు.
తూకంలో రాళ్లను వినియోగిస్తున్నారు. ఎక్కడా ఎలక్ట్రానిక్ కాంటాలు కనిపించడం లేదు. మార్కెటింగ్ అధికారులు గ్రామాల్లో తనిఖీలు చేసిన సందర్భాలు లేవు. రైతులు పండించిన పత్తికి అధిక ధర చెల్లిస్తామని చెబుతూ బండరాళ్లనే బాట్లుగా వినియోగిస్తూ దళారులు తూకాల్లో మోసం చేసి పత్తి రైతుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. వీరిపై అధికారులు, పోలీసుల నిఘా కరువైంది. రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
సిద్దిపేట జిల్లాలో పత్తి పంటకు వ్యవసాయ భూములు అనుకూలం. దీంతో 1.80 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. జిల్లాలో 27 పత్తి జిన్నింగ్ మిల్లులుండగా 22 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ అధికారులు రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తున్నారు. ఏటా లక్షల క్వింటాళ్ల వరకు కొనుగోళ్లతో కోట్లలో వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. మార్కెటింగ్ శాఖ వద్ద లైసెన్స్‌లు తీసుకున్న వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేయా లి, ధర తక్కువగా ఉన్న సమయంలో గ్రామాల్లో దళారులు తిరుగుతూ తాము ఎక్కువ ధర పెట్టి పత్తిని కొంటామని చెబుతూ తూకాల్లో మోసాలకు పాల్పడుతూ రైతులను మోసం చేస్తున్నారు.
సీసీఐ ద్వారా ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.7020 ధర నిర్ణయించి, కొనుగోలు చేస్తున్నది. తక్కువగా రూ.6700గా నిర్ణయించారు. తేమ శాతాన్ని పరిశీలించిన తరువాతనే అధికారులు ధరను నిర్ణయించారు. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 27 వేల మెట్రిక్ టన్నుల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. ఇక ప్రైవేటు వ్యాపారులు 15 వేల మెట్రిక్ టన్నుల వరకు కొన్నారు. రైతుల ఇండ్లలో అమ్ముకునేందుకు పత్తి నిల్వలు ఉన్నాయి. వారం రోజుల క్రితం గజ్వేల్ మండలం బయ్యారంలో రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసిన కరీంనగర్ జిల్లా మెట్‌పల్లికి చెందిన వ్యాపారి తూకంలో మోసాలకు పాల్పడుతూ దొరికిపోయాడు. దీంతో రైతులు ఆందోళన చేయడంతో స్థానిక పోలీసులు, మార్కెట్ అధికారులు గ్రామానికి చేరుకుని దళారిపై చర్యలు తీసుకున్నారు. దౌల్తాబాద్ మండలం అహ్మద్‌నగర్ సమీపంలోని పత్తి జిన్నింగ్ మిల్లుకు రోజూ వందలాది వాహనాల్లో రైతులు పత్తిని విక్రయిస్తుండగా, శనివారం పత్తి తూకంలో వ్యత్యాసం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. గతేడాది గజ్వేల్ పట్టణంలోనే ఓ వ్యాపారి కాంటాలో తూకం వేయగా భారీగా తేడా రావడంతో అధికారులు జోక్యం చేసుకున్నారు. గతంలో గజ్వేల్ మార్కెట్ ఆవరణలో పత్తిని కొనుగోలు చేస్తున్న క్రమంలో తేడాలు రావడంతో రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. గతంలో మండలంలోని దిలాల్‌పూర్‌లో ఆంధ్రాకు చెందిన వ్యాపారి పత్తి కొనుగోలు చేస్తున్న క్రమంలో తూకాల్లో భారీ వ్యత్యాసాలు వచ్చాయి. ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా మార్కెటింగ్ అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు.