చేర్యాల, డిసెంబర్ 20: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సౌకర్యాల లేమితో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసౌకర్యాల మధ్య ఈనెల 14న స్వామివారి కల్యాణోత్సవం ముగిసింది. రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల్లో ఒక్కటైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రానికి బ్రహ్మోత్సవాల సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా లక్ష మందికి పైగా భక్తులు వస్తుంటారు. ఇంతటి ప్రాచుర్యం ఉన్న ఆలయానికి పాలకుల నిర్లక్ష్యంతో ఆశించిన అభివృద్ధి జరగడం లేదు. సౌకర్యాలు సమకూరడం లేదు. ఏడాదికి రూ.20కోట్లకు పైగా ఆదాయం సమకూరుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధిని విస్మరించింది. భక్తుల సౌకర్యార్ధం బీఆర్ఎస్ పాలనలో మంజూరైన పనులు పూర్తిచేయడంలో ప్రస్తుత సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
భక్తుల విడిదికి కాటేజీలు కరువు…
కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల సందర్భంగా తరలివచ్చే భక్తులు విడిది చేసేందుకు ఆలయానికి సంబంధించి సరిపడా కాటేజీలు లేవు. ఇటీవల స్వామి వారి కల్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చి వెళ్లిపోయారు. కానీ, సంక్రాంతి అనంతరం వచ్చే మొదటి ఆది(పట్నం)వారం రోజున లక్షకు పైగా భక్తులు వస్తుంటారు. కానీ, ఆలయం వద్ద వారికి సరిపడా వసతి గదులు లేవు. భక్తుల వసతుల కోసం బీఆర్ఎస్ సర్కారు మంజూరు చేసిన 50 గదుల కాటేజీ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. కాటేజీని స్వామి వారి కల్యాణోత్సవంలోపు అందుబాటులోకి తీసుకువస్తామని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాటను నిలబెట్టుకోలేక పోయారు. ఆలయానికి పలుమార్గాల నుంచి వచ్చిన భక్తుల వాహనాలతో విశేష రోజుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.ముఖ్యంగా చేర్యాల నుంచి కొమురవెల్లి మల్లన్న క్షేత్రం మీదుగా ఐనాపూర్ రోడ్డుకు వెళ్లే రహదారి ప్రతి ఆదివారం ట్రాఫిక్‌తో నిండిపోతుండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కారం చూపాలని భక్తులు కోరుతున్నారు.
పారిశుధ్యంపై శ్రద్ధ కరువు
మల్లన్న క్షేత్రానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తుండడంతో పారిశుధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఈనెల 7న ఆదివారం 25వేల మంది భక్తులు రావడంతో పలుచోట్ల చెత్తాచెదారంతో పాటు వారు తిని పడేసిన ప్లేట్లతో పరిసరాలు అధ్వానంగా దర్శమన మిచ్చాయి. సంక్రాంతి తర్వాత లక్ష మంది భక్తులు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.
పెండింగ్‌లో త్రిశూలం, ఢమరుకం
మల్లన్న ఆలయ పైభాగంలోని గుట్టపై త్రిశూలం, ఢమరుకం నిర్మాణ పనులు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించారు. ఇప్పటివరకు ఆ పనులు పూర్తి చేయించడంలో ప్రస్తుత సర్కారు దృష్టిపెట్టడం లేదు.
అటకెక్కిన స్వర్ణ కిరీటాల తయారీ
గతేడాది కల్యాణోత్సవం సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వచ్చే కల్యాణం రోజున అమ్మవార్లకు స్వర్ణ కిరీటాలు తయారు చేసి సమర్పించుకుంటామని హామీ ఇచ్చా రు. భక్తులు సమర్పించిన బంగారం ఉన్నప్పటికీ, కిరీటాలు తయారు చేయించే విషయంలో మంత్రులు విఫలమయ్యారని భక్తులు విమర్శిస్తున్నారు.
మూడు కిలోమీటర్లు..41 గుంతలు
చేర్యాల నుంచి కొమురవెల్లికి వెళ్లే ప్రధాన రహ దారి గుంతలమయంగా మారి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనగామ, సిద్దిపేట ప్రధాన రహదారిని అనుకుని గుర్జకుంట వద్ద ఉన్న కొమురవెల్లి స్వాగత తోరణం నుంచి కిష్టంపేట గ్రామం వరకు మూడు కిలోమీటర్ల దూరంలో 41 గుంతలు ఏర్పడ్డాయి. అధ్వానంగా మారిన రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మా రింది. కిష్టంపేట నుంచి కొమురవెల్లి, ఐనాపూర్, తిమ్మారెడ్డిపల్లి వరకు నూతనంగా బీటీ పునరుద్ధరణ పనులు చేశారు. కానీ, బీటీ రెన్యువల్ అనంతరం సైడ్‌బర్మ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
కోనేరు నీళ్లా.. వామ్మో
మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులు క్షేత్రంలో ఉన్న పుష్కరణిలో పవిత్ర స్నానం ఆచరించి దర్శనానికి వెళ్తుంటారు. కోనేరులోని అపరిశుభ్ర నీటిని చూసి భక్తులు స్నానాలు ఆచరించడానికి ముందుకు రావడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు భక్తులు ముక్కుమూసుకుని కోనేరులో మునిగి అసౌకర్యం మధ్యన దర్శనానికి వెళ్తున్నారు. కోనేరులో స్నానమాచరించిన అనంతరం బట్టలు మార్చుకునేందుకు తాత్కాలికంగా ఉన్న షెడ్లకు బదులుగా శాశ్వత వసతి కల్పించాలని భక్తులు ఎప్పటి నుంచో కోరుతున్నారు.