అందోల్, సెప్టెంబర్ 28: సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట ఆర్టీసీ బస్టాండ్ దొంగతనాలకు అడ్డాగా మారింది. ఈ బస్టాండ్‌లో చోరీలు నిత్యకృత్యంగా మారాయి. ప్రయాణికులు బస్సు ఎక్కాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. బస్డాండ్‌లో ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. జోగిపేట బస్టాండ్‌కు సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్, హైదరాబాద్, నారాయణఖేడ్ తదితర డిపోల బస్సులతో పాటు పక్క జిల్లాలు, ఇతర రాష్ర్టాల బస్సు సర్వీసులు వస్తుంటాయి. ప్రయాణికులు పెద్దసంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారు. కానీ, ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల భద్రతకు సరైన చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసింది.
ఇప్పుడున్న సీసీ కెమెరాలు కంట్రోలర్ ఆఫీస్ ఏర్పాటు చేసిన దుకాణం వద్దే ఉన్నాయి తప్పా… ప్రయాణికులు బస్సులు ఎక్కేచోట ఒక్కటి కూడా లేవు. ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోతున్నారు. దొంగతనం జరిగి విలువైన వస్తువులు పోగొట్టుకున్న బాధితులు సీసీ కెమెరాల్లో నిందితుల ఆచూకీ దొరుకుతుందేమో అని ఆశపడితే, వారి ఆశలు అడియాశలు అవుతున్నాయి. సీసీ కెమెరాలు పనిచేసినప్పుడు కంట్రోలర్ వద్దకు వచ్చినవారి రాకపోకలు, కొన్ని ప్రాంతాలకు వెళ్లే బస్సులను మాత్రమే రికార్డు చేస్తున్నాయి. కానీ, ప్రయాణికులు బస్సులు ఎక్కేచోట కదలికలు రికార్డు అవ్వడం లేదు. దీంతో ఇక్కడ జరిగిన చోరీల్లో నిందితులు సులభంగా తప్పించుకుంటున్నారు.
జోగిపేట బస్టాండ్‌లో కొద్దికాలంగా జరిగిన చోరీలన్నీ గమనిస్తే దాదాపు ప్రయాణికులు బస్సులు ఎక్కేటప్పుడు జరిగినవే ఉన్నాయి. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మెడలో పుస్తెలతాడు, కండక్టర్ నుంచి నగదు, పలువురి మహిళల వద్ద నగదు, బంగారు ఆభరణాలు చోరీ జరిగాయి. రెండు నెలల క్రితం వట్పల్లి బస్సెక్కే సమయంలో గొర్రెకల్‌కు చెందిన మహిళ నుంచి బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురయ్యాయి.
ఇటీవల మళ్లీ అదే బస్సు ఎక్కుతున్న ఉసిరికపల్లి మహిళ బ్యాగు నుంచి 7తులాల బంగారు ఆభరణాలు ఉన్న పర్సు మాయమైంది. జనం రద్దీగా ఉండి బస్సెక్కే సమయంలో ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయి. కూతవేటు దూ రంలో పోలీస్‌స్టేషన్ ఉన్నా దొంగలు భయపడకుండా తమ పనికానిచ్చేస్తున్నారు. బస్టాండ్ రోడ్డుకు అవతలి వైపే పీఎస్ ఉన్నప్పటికీ పోలీసులు ఉన్నారనే భయం దొంగల్లో కనిపించడంలేదు. ప్రతి ఆదివారం జోగిపేటలో జరిగే అంగడికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజ లు పెద్దసంఖ్యలో వస్తుంటారు. దీంతో బస్టాండ్‌లో విపరీతమైన రద్దీ నెలకొంటున్నది.
సందట్లో సడేమియాలాగా దొంగలు చెలిరేగిపోతున్నారు. ఈ ఒక్క ఆదివారం రోజే సెల్ఫోన్లు, పర్సులు, విలువైన వస్తువులు ఎక్కువగా పోగొట్టుకుంటున్నారు. కొందరు పీఎస్‌లో ఫిర్యాదు చేస్తుండగా, కొందరు గమ్మునుంటున్నారు. పోలీసులు సైతం బస్డాండ్‌లో సరైన నిఘా ఏర్పాటు చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. బస్టాండ్‌తో పాటు పరిసరాల్లో నిఘా పెంచితే దొంగతనాలు జరిగే అవకాశం ఉండదంటున్నారు. అధికారులు స్పందించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.