పటాన్చెరు, డిసెంబర్ 31:వామ్మో సర్వే నెంబర్ 329 అని అధికారులు భయపడుతున్నారు. జాతీయ రహదారికి కూతవేటు దూరంలో, అరబిందో ఫార్మా కంపెనీకి ఆనుకుని, చిట్కు ల్ ప్రధాన రహదారిపై ఉన్న విలువైన భూమి ఇది. సర్వే నెంబర్ 329 చుట్టూ జనావాసాలు ఏర్పడ్డాయి. అందరి చూపు ఈ భూమిపైనే ఉంది. ఈ సర్వే నెంబర్ను కాపాడటం అధికారులకు తలనొప్పిగా మారింది. ఇప్పుడు ఈ సర్వే నెంబర్లోని ఖాళీ జాగలను పలువురు కబ్జా చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ప్రోత్సాహంతో ఖాళీ జాగలతోపాటు గతంలో లేఅవుట్ వేసిన భూమితో పాటు పక్కన ఖాళీగా ఉన్న భూములను కబ్జా చేసి ముగ్గులు పోస్తున్నారు. అమెరికాలో సెటిల్ అయిన వారు కూడా నిర్మాణాలు చేపట్టారనే అరోపణలు ఉన్నాయి.
కబ్జాలను అడ్డుకునేందుకు వస్తున్న అధికారులను నాయకుల అనుచరుల ఆధ్వర్యంలో వాగ్వాదం చేసి పంపిస్తున్నారు. వా రం రోజులుగా కబ్జా చేసిన ప్లాట్లలో చకచకా ఇండ్లు నిర్మిస్తున్నారు. 2008లో పంపిణీ చేసిన పట్టాల మాటున కబ్జాలు కొనసాగిస్తున్నారు. 1984లో, 2000 సంవత్సరంలోనూ ఈ సర్వేనెంబర్లో ప్లాట్లు చేశారు. వాటిలో అవకతవకలు జరిగాయని రద్దు అయ్యాయి. 2008లోనూ నాయకులు చేతివాటం ప్రదర్శించి రెండుకు మించి ప్లాట్లు కైవసం చేసుకున్నారనే ఆరోపణపై విచారణ జరిగితే అప్పటి కలెక్టర్ కట్టిన ఇండ్లను కూల్చివేయించారు. ఈ కూల్చివేతలతో అర్హులైన నిరుపేదలను కూడా ఇండ్లు కట్టకుండా అధికారులు, గ్రామ నాయకులు అడ్డుకున్నారు. సర్వేలు చేసి పట్టాలు ఇచ్చిన వారిలో అర్హుల లిస్టు తయారు చేసిన పేదలు మాత్రం ఇండ్లు కట్టుకోలేకపోయారు.
40 ఏండ్ల స్వప్నం
1984లో గ్రామంలో కొత్త కాలనీలో ఇండ్ల జాగాలు ఇచ్చారు. వారిలో కొందరికి స్థలం సరిపోకపోవడంతో సర్వే నెంబర్ 329లో కొందరికి స్థలాలు చూపించారు. వారు అక్కడ వివాదాల కారణంగా ఇండ్లు నిర్మించుకోలేకపోయారు. 1990లో 329కి పక్కన ఉన్న సర్వే నెంబర్లో వడ్డెర కాలనీని ఏర్పాటు చేసి వడ్డెరలు నివాసం ఉండేలా చేశారు. అనంతరం 2000 సంవత్సరంలో 329లో అప్పటి ఎంపీ ఆలే నరేంద్ర పేరున నరేంద్రకాలనీగా లేఅవుట్ వేశారు. 548 ప్లాట్లు చేసి వాటిలో 309 మందికి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు.
అప్పుడు కూడా అనర్హులకు ఇచ్చారనే ఆరోపణలతో ఆ పట్టాలనూ రద్దు చేశారు. అనంతరం 2008లో మంత్రిగా ఉన్న దామోదర చేతుల మీదుగా అదే లేఅవుట్లో 514మందికి వంద గజాల చొప్పున ప్లాట్లకు పట్టాలు ఇప్పించారు. 2008లో పట్టాల పంపిణీ సందర్భంగా గ్రామసభలో ఎంపిక చేసిన, పేర్లు చదివిన వారి స్థానాల్లో కొత్తగా భారీ సంఖ్యలో నాయకుల అనుచరులు, కుటుంబ సభ్యుల పేర్లు ప్రత్యక్షం కావడంతో వివాదం చెలరేగింది. గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు మొయిన్ రోడ్డపై రెండు, మూడు ప్లాట్ల చొప్పున తీసుకుని భారీగా నిర్మాణాలు ప్రారంభించారు. ఈ విషయం నాటి కలెక్టర్ వరకు వెళ్లడంతో ప్లాట్ల పంపిణీలో విచారణ చేయించి అక్రమార్కుల ఇండ్లను నాడే జేసీబీలతో కూల్చేశారు.
నాటి అక్రమార్కులే నేటి సూత్రదారులు
అప్పటి అక్రమార్కులే ఇప్పుడు సూత్రదారులై మళ్లీ ఇండ్లు నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. వారి అనుచరులతో ఖాళీ జాగలను కబ్జా చేయిస్తున్నా రు. లేఅవుట్ స్థలంతోపాటు 329లోని మిగు లు ఖాళీ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారు. అర్హులైన గ్రామస్తులు అక్కడక్కడ ఉన్నా, అధికశాతం ప్లాట్లు అక్రమార్కులే కబ్జా చేస్తున్నా రు. అమెరికాలో సెటిల్ అయిన వ్యక్తుల పేరున ఇక్క డ ప్లాట్లు ఉండటం ఇండ్లు చకచకా నిర్మిస్తున్నారు. గ్రామంలోని నిరుపేదలకు ఇప్పుడు ఏమి జరుగుతుంతో అర్థం కావడం లేదు. ప్లాట్ల వద్ద కబ్జా చేసి నిర్మిస్తున్న ఇండ్ల వద్దకు వెళ్లిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ కబ్జాలను నిరోధించే పరిస్థితి కనిపించడం లేదు. తహసీల్దార్ పనులు నిలిపివేయాలని కోరినా రాత్రివేళల్లో పనులు కొనసాగుతున్నాయి. మున్సిపల్లో చిట్కుల్ విలీనం జరుగుతుందనే ప్రచారంతో నాయకులు ఈ కబ్జా పర్వానికి తెరతీశారు. మున్సిపల్ ప్రకటనలోగా పేదల ప్లాట్లకు, సర్వేనెంబర్ 329కి రెక్కలు వచ్చి ఎగిరిపోవడం ఖాయం లా ఉంది.