గజ్వేల్, సెప్టెంబర్ 7: తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర చాలా గొప్పదని, గజ్వేల్ జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లోని ఎస్ఎల్ఎన్ కన్వెన్షన్‌లో జరిగిన గజ్వేల్ ప్రెస్‌క్లబ్ రజతోత్సవా నికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గజ్వేల్ జర్నలిస్టులతో తనకు 30 ఏండ్ల అవినాభావ సంబంధం ఉందన్నారు. హైదరాబాద్‌కు గజ్వేల్ దగ్గర్లోనే ఉన్నా మొదట్లో ఉద్యమం చప్పగా ఉండేదని, అలాంటి సమయంలో జర్నలిస్టులు ధూంధాం నిర్వహించి గద్దరన్న, రసమయితో కార్యక్రమాన్ని నిర్వహించి తెలంగాణ ఉద్యమం వ్యాప్తిచెందే విధంగా ఊపిరి పోశారన్నారు. గజ్వేల్ జర్నలిస్టులు జనం కోసం, జనచైతన్యం కోసం, జనం మెచ్చేలా పని చేశారన్నారు.
బొంబాయి ప్రాంతానికి గజ్వే ల్ ప్రాంత వాసులు ఎక్కువగా వలస వెళ్లేవారని, ఏడుపులతో తల్లడిల్లేదని, అలాంటి సమయంలో ఈ ప్రాంత జర్నలిస్టులు వలసల నివారణకు చేసిన కృషి గొప్పదన్నారు. రాష్ట్రం ఏర్పడితే కొంత మార్పు వస్తదని నమ్మిన జర్నలిస్టులు రాజకీయాలకతీతంగా తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నారని గుర్తుచేశారు. రాజకీయ నాయకులపై ఒత్తిడి తీసుకొచ్చి జై తెలంగాణ అనిపించారన్నారు. ఎన్నో విజయాలు సాధించిన గజ్వేల్ ప్రెస్‌క్లబ్ సభ్యులు ఆదర్శంగా నిలవడంలో వాళ్ల సతీమణుల పాత్ర కూడా ఉండడం గొప్ప విషయమన్నారు. ఏదీ జీవితంలో శాశ్వతం కాదని, చేసిన నాలుగు మంచి పనులే శాశ్వతంగా నిలబడుతాయన్నారు.
గజ్వేల్ జర్నలిస్టులు మెతుకుసీమలో రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ప్రజలకు అవగాహక కల్పించారన్నారు కేసీఆర్ హయాంలోజర్నలిస్టుల కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లతోపాటు గ్రామీణ విలేకరులకుఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జర్నలిస్టుల కోసం రూ.100 కోట్ల సంక్షేమ నిధి ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అద్భుతమైన జర్నలిస్టు కాలనీ నిర్మాణం చేసి ఇండ్లు అందించిన ఘనత అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గజ్వేల్‌లో ఇండ్లు నిర్మించిన తర్వాతనే రాష్ట్రమంతా ప్రారంభించామని, అందులో గజ్వేల్ జర్నలిస్టులే ఆదర్శంగా నిలిచారన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్‌లో నిర్మించామన్నారు. గజ్వేల్ ప్రెస్‌క్లబ్‌తో దివంగత సోలిపేట రామలింగారెడ్డికి అవినాభావ సంబం ధం ఉందని గుర్తు చేశారు.
ఇక్కడ ఉద్యమాన్ని నడిపించడంలో సామాజిక ఉద్య మం, తెలంగాణ ఉద్యమంలో రామలింగారెడ్డి చేసిన కృషిని గుర్తుచేసుకోవాల్సి అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల భావాలు తెలిపేది విలేకరులు అని, చట్టాన్ని, రాజ్యాంగాన్ని అమ లు పరిచేది న్యాయవ్యవస్థ, పత్రిక వ్యవస్థ అన్నారు.
ప్రజాసమస్యలను వెలికితీసి జర్నలిస్టులు చైతన్యం తీసుకొచ్చారన్నారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలకు పురుడు పోశారన్నారు. అంతకు ముందు సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు దేవీప్రసాద్, ఎలక్షన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, నాయకులు శ్రీకాంత్‌రావు, లోక్‌సత్తా సమన్వయకర్త బండారు రామ్మోహన్రావు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.