సిద్దిపేట, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ప్రైవేట్ ఉద్యోగికి నెల జీతం రూ. 30 వేలు వ స్తుంది. తన భార్య నడిపే చిన్న కుటీర పరిశ్రమ ద్వారా మరో రూ.10 వేలు వస్తున్నాయి. వీరిద్దరి కుటుంబ ఆదాయం నెలకు రూ.40 వేలు. పిల్లల చదువులు, ఇంట్లో నిత్యావసర సరుకులు, ఇంటి కిరాయిలు ఇతర ఖర్చులు మూడు సంవత్సరాల కిందట నెలకు రూ.25 వేలు ఉండేవి. ఇప్పుడు పెరిగిన ఇంటి కిరాయిలు, నిత్యావసర సరుకులు ఇతర ఖర్చులు కలుపుకొంటే ఆ ఇంటి ఖర్చు దాదాపు రూ.40 వేల వరకు ఉంటున్నది. గతం కంటే ఇప్పుడు ఏకంగా సరాసరి రూ.15 వేలు పెరిగింది.
ఇది ప్రైవేట్ ఉద్యోగి కుటుంబం లెక్క తీసుకుంటేనే. అదే నిరుపేద కుటుంబం, దినసరి కూలీ చేసుకునే కుటుంబాల పరిస్థితులు ఏంటో అర్ధం చేసుకోవచ్చు.’ నిత్యావసర సరుకులు పెరుగుదలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఇష్టారీతిగా సరుకులు ధరలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ఆ కుటుంబాలు పెరిగిన ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కుటుం బ బడ్జెట్ కూడా తడిసి మోపెడవుతున్నది.
తలకిందులవుతున్న కుటుంబ బడ్జెట్
కొంతకాలంగా పెరిగిన ధరలు, ఇతర వ్యయాలతో కుటుంబ బడ్జెట్ తలకిందులుగా మారుతున్నది. ఇంటి కిరాయిలు, పాలు, చక్కెర, పప్పులు, బియ్యం, కూరగాయలు, ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. వీటికితోడు ప్రతి ఇంటిలో అనారోగ్యం ఖర్చులు, నిత్యావసర సరుకుల ధరలు తడిసి మోపెడు అవుతున్నాయి. ఇటీవల పెరిగిన ధరలతో సామాన్యుల నోట మాట రావడం లేదు. ఏ వస్తువు కొందామన్నా ధరల పెరుగుదల కనిపిస్తున్నది.
ఏకంగా లీటరు నూనె ప్యాకెట్‌పై రూ.15 నుంచి రూ. 20 పెరిగింది. బియ్యం ధరలు కూడా భారీగానే పెరిగాయి. క్వింటాల్‌కు ఏకంగా వివిధ రకాల బియాన్ని బట్టి రూ. 300 నుంచి రూ.600 వరకు పెరిగాయి. పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు ఇదే అదునుగా మరింత రేట్లు పెంచారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ప్రొటీన్లు అధికంగా లభించే పప్పులు ధర లు కూడా పెరిగాయి. కూరగాయల ధరలు పెరిగినట్లు వినియోగదారులు చెబుతున్నారు.
ప్రతి ఇంట్లో వంట నూనెల వాడకం తప్పనిసరి. నూనె లేనిది ఏ వంట కూడా చేయలేం. ప్రస్తుతం మార్కెట్లో నూనె ధరలు అమాంతం పెరిగాయని వినియోగదారులు చెబుతున్నారు. ఎంత లేదన్నా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతిరోజూ సరాసరిగా 350 టన్నుల వివిధ రకాల నూనెలు మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు వస్తున్న వేళ వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 20 శాతం మేర పెంచింది.
దీంతో నూనెల ధరలు భగ్గుమంటున్నాయి. రానురానూ ఉమ్మడి జిల్లాల్లో పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటల విస్తీర్ణం తగ్గుతుంది. బయట ప్రాంతాల నుంచి నూనెలు ఎగుమతి అవుతున్నాయి. చాలావరకు నూనెలు నాసిరకం ఉంటున్నాయి. వివిధ రకాల బ్రాండ్ల పేరుతో మార్కెట్లోకి వచ్చిన వాటిలో నాసిరకం ఎక్కువగా ఉంటుంది. దీనిని అరికట్టాల్సిన సంబంధిత శాఖ అధికారులు చూ సీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో మార్కెట్లో నాసిరకం నూనెలు రాజ్యమేలుతున్నాయి. నాసిరకం నూనె ల వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.
పెరిగిన బియ్యం ధరలు
బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. సన్నబియ్యం క్వింటాలు బ్యాగుకు ఏకంగా రూ.300పైగా పెరిగింది. ఆయా రకాల బట్టి ధరలు ఉన్నాయి. నాణ్యమైన బియ్యం ధరల పేరుతో ఇందులో కూడా మోసాలు చేస్తున్నారు. స్టీమ్ రైస్ నింపి నాణ్యమైన బియ్యం అని చెప్పి వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. స్టీమ్ బియ్యాన్ని వివిధ రకాల సంచుల్లో నింపి వివిధ రకాల పేర్లతో మోసాలు చేస్తున్నారు. నాణ్యమైన బియ్యం అని తీసుకుపోయిన వినియోగదారుడు వంట వండే సరికి ఆ బియ్యం గడ్డలు కట్టడం ముద్ద అవడం జరుగుతున్నది.
ఇది చూసి అవాక్కవుతున్న వినియోగదారుడు వ్యాపారి దగ్గరికెళ్లి ఇదేంటని అడిగితే మాకేం తెలుసు అని దబాయిస్తున్నారు. వ్యాపారస్తులపై నియంత్రణ లేకపోవడంతో మార్కెట్లోకి నాణ్యమైన బియ్యం పేరిట స్టీమ్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఆయా రేషన్ షాపుల నుంచి తీసుకువచ్చిన బియ్యాన్ని పాలిష్ చేసి నాణ్యమైన బియ్యంగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఈ దందా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో జోరుగా సాగుతున్నది. ఇంత జరుగుతున్నా అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదు. వారికి నెలనెలా మామూళ్లు ముట్టడంతో వారు గుమ్మనంగా ఉంటున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు.