సిద్దిపేట/కొండపాక/హుస్నాబాద్ టౌన్, ఏప్రిల్ 2 : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన 99 రోజుల కార్యక్రమంపై గురువారం నిర్వహించిన గ్రామసభలు, వార్డు సభల్లో అధికారులకు ప్రజల నుం చి నిలదీతలు తప్పలేదు. ఆరుగ్యారెంటీలు, హామీల అమలు ఏమయ్యాయని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిద్దిపేట పట్టణంలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. సభల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మె ల్యే హరీశ్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్, స్థానిక కౌన్సిలర్ల ఫొటోలు లేకపోవడంతో వార్డు సభలను బహిషరించారు.
పలుచోట్ల సభలకు జనం రాలేదు. కొన్ని వార్డుల్లో కుర్చీలు తప్ప ప్రజలు లేకపోవడంతో మహిళా సంఘాల సభ్యులు, క్షేత్రస్థాయి సిబ్బందితో అధికారులు ప్రభుత్వ సందేశాన్ని, రాష్ట్ర గీతాన్ని వినిపించి తూతూమంత్రంగా ముగించారు. సిద్దిపేటలోని 3వ వార్డు రంగధాంపల్లిలో ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫొటో ఫ్లెక్సీలో లేకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు వార్డుసభను బహిషరించారు. 4వ వార్డులో సైతం ఇదే జరిగింది. 37, 24వ వార్డుల్లో ప్రొటోకాల్ పాటించక పోవడం, స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు, మున్సిపల్ చైర్మన్ ఫొటో లేకపోవడంతో అధికారులను బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. ఉచిత కరెంటు రావడం లేదని, ఇందిరమ్మ ఇండ్లు రాలేదని ప్రజ లు అధికారుల నిలదీశారు. 2,34 వ వార్డుల్లో ఖాళీ కుర్చీలు తప్ప ప్రజ లు కనిపించలేదు. 28వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున్ నిరసన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖను రాశారు.
గ్యాస్ పైసలు వత్తలేవు… ఫించన్లు రాలేదు..
అభయ హస్తంరాలేదు ఐదెండ్లు కట్టినం ఒక్క రూపాయి రాలేదు… గ్యాస్ పైసలు సైతం ఒక్కరూపాయి రాలేదు. మూడేండ్ల నుంచి రూపాయి వత్తలే దు. మాకు కరువుసెయ్య బట్టి పనులు కూడా లేవు… మాకు పనులు చూపించాలి. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటమని చెబితే మాకు రాలేదు. కట్టుకోని వాళ్లకు ఇచ్చిండ్రు.. మా భర్తచనిపోయి ఏండ్లు గడుస్తున్నవి నాకు ఫించన్కూడా ఇత్తలేరు.. ఇదీ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆరుగ్యారెంటీలపై హు స్నాబాద్ పట్టణంలోని పలువార్డుల్లో అధికారులకు ఎదురైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
హుస్నాబాద్ పట్టణంలోని 20వార్డుల్లో గురువారం వార్డుసభలు నిర్వహించగా, ప్రజల నుంచి స్పందన కరువైంది. కొన్నిచోట్ల పథకాలు ఇయ్యలేదంటూ ప్రజలు అధికారులను ప్రశ్నించారు. మూడేండ్ల నుంచి తిరుగుతున్నా పింఛన్ రావడం లేదని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులను నిలదీశారు. ప్రజలు రాకపోవడంతో తూతూమంత్రంగా వార్డు సభలు నిర్వహించి అధికారులు మమ అనిపించారు.
ఇందిరమ్మ ఇండ్లపై జప్తి నాచారంలో రభస
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి గురువారం కొండపాక, కుకునూరుపల్లి మండలాల్లోని పలు గ్రామసభలకు హాజరయ్యారు. దుద్దెడలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. గ్యాస్ సిలిండర్ ఎలాంటి సబ్సిడీ రావ డం లేదని మహిళలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. జప్తినాచారం గ్రామ సభలో ఇందిరమ్మ ఇండ్ల విషయం లో గ్రామస్తులు సర్పంచ్ లకిరెడ్డి పావని, పంచాయతీ కార్యదర్శి దోమకొండ రాణిని నిలదీశారు. వారు నిర్లక్ష్య సమాధానం చెబుతూ మా ఇష్టం ఉన్నవారికి ఇచ్చుకుంటామని, ఎవరికి చెబుతారో చెప్పుకోండని సమాధానం ఇవ్వడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి మంత్రి కోటాలో వచ్చిన 27 ఇండ్లు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వారికి కేటాయిస్తున్నారని మండిపడ్డారు.