మెదక్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం మెదక్ జిల్లాలో మొత్తం 17 నామినేషన్లు వేశారు. మెదక్ నియోజకవర్గంలో ఆరుగురు అభ్యర్థులు 9 నామినేషన్లు, నర్సాపూర్ నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్థులు 8 నామినేషన్లు దాఖలు చేశారు. మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి నామినేషన్ పత్రాలను మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, గంగాధర్, అంజాగౌడ్, రిటర్నింగ్ అధికారి అంబదాస్ రాజేశ్వర్‌కు అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక సెట్ నామినేషన్ పత్రాలను కౌన్సిలర్లు రాగి వనజ, శంసున్నీసాబేగం, జయశ్రీ, జడ్పీటీసీలు సుజాత, గడీల షర్మిల అందజేశారు. సీపీఎం నుంచి పుల్లయ్య నామినేషన్ వేయగా, బీజేపీ నుంచి పంజా విజయ్‌కుమార్ రెండు సెట్ల నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోహిత్‌రావు రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా జి.నాగరాజు నామినేషన్ వేశారు.
నర్సాపూర్ నియోజకవర్గంలో గురువారం 8 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రవీణ్‌రెడ్డి, బీజేపీ నుంచి మురళీధర్‌యాదవ్, కాంగ్రెస్ నుంచి ఆవుల రాజిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా సీహెచ్ లక్ష్మీరెడ్డి, సీహెచ్ నవీన్‌కుమార్ రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఇండియా ప్రజా బంధు పార్టీ నుంచి జనపాటి నర్సింలు, స్వతంత్ర అభ్యర్థిగా నారాయణరెడ్డి నామినేషన్లు వేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వారి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి క్షుణ్ణంగా పరిశీలించి, స్వీకరించారు. నామినేషన్ వేసిన అభ్యర్థులకు ఎన్నికల నియమావళి కిట్‌ను అందజేశారు. అభ్యర్థులు ఎన్నికల నియమావళి కచ్చితంగా పాటించాలని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.
జిల్లాలో నామినేషన్ల పర్వం చివరి దశకు చేరింది. ఈ నెల 10న నామినేషన్ల ఘట్టానికి తెరపడనుంది. ఈనెల 3వ తేదీతో ప్రారంభమైన నామినేషన్ల పర్వం శుక్రవారంతో పూర్తవుతుంది. గురువారం ఏకాదశి కావడంతో మంచి రోజని అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు, ఇతర పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు నామినేషన్లు వేసిన వారు కూడా మరో సెట్ సమర్పించారు. శుక్రవారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు మరిన్ని నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నది.