జహీరాబాద్, ఏప్రిల్ 23: జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చెల్లదని, దాని ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్‌రెడ్డి సర్కార్‌కు చెంపపెట్టు అని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ప్రాణాధారమని, ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించడంతో లక్షలాది ఎకరాల్లో రైతులు పంటలు పండించారన్నారు.
ఇది ఓర్వలేకనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ దుష్ర్పచారం చేస్తున్నదన్నారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి సర్కార్ చిల్లర రాజకీయాలు మానుకొని, మేడిగడ్డకు మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. హామీల గురించి ప్రశిస్తే, బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు, విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు డిమాండ్ చేశారు. జహీరాబాద్ ఆర్టీసీ డిపో ఆవరణలో ధర్నా నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులకు గురువారం ఆయన మద్దతు తెలిపి ప్రసంగించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీని సీఎం రేవంత్‌రెడ్డి, ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ నిలబెట్టుకోవాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
సమావేశంలో బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు నారాయణ, సంజీవ్‌రెడ్డి, వెంకటేశం, నర్సింహులు, కౌన్సిలర్ గౌస్గోరి, నాయకులు గుండప్ప, బండి మోహన్, యాకూబ్, విశ్వేశ్వర్, దీపక్, మచ్చేందర్, మోహన్ రాథోడ్, బాల్‌రాజ్, భీంరావు రాథోడ్, దేశెట్టి పాటిల్ పాల్గొన్నారు.