చేర్యాల, ఏప్రిల్ 22 : చేర్యాల ప్రాంత రైతులకు ఏటా వడగండ్లు కడగండ్లను మిగులుస్తున్నాయి. సకాలంలో రైతుబంధు కింద పెట్టుబడి, ఉచిత కరెంటు వస్తుండడంతో రైతులు తమకున్న వ్యవసాయ భూములే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూములు కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. కానీ, ప్రకృతి వైపరీత్యాలతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో శనివారం వడగండ్ల వాన కురిసింది. దీంతో 1000 ఎకరాలకు పైగా వరి తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా తెలిసింది. పంట నష్టం జరగడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మండలంలోని నాగపురి, పోతిరెడ్డిపల్లి, చుంచనకోట, శభాష్‌గూడెం, వీరన్నపేట, పెద్దరాజుపేట, కడవేర్గు గ్రామాల్లో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది.
ఉదయం నుంచి ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నం 3గంటల అనంతరం ఒక్కసారిగా మండలంలోని వివిధ గ్రామాల్లో వాతావరణం మారిపొయింది. సాయంత్రం 5 గంటల నుంచి కొద్దికొద్దిగా ప్రారంభమైన వర్షం 5.30గంటలకు ఒక్కసారిగా జోరుగా కురుసింది. ఇదే సమయంలో చిన్నకంకర సైజుకు మంచి ఉన్న వడగండ్లు అరగంట పాటు కురవడంతో పంటలకు నష్టం కలిగింది. వరి పైరులు నేలకొరిగాయి. మామిడి తోటలు, కూరగాయాలు, కొన్ని గ్రామాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. నాగపురి, చుంచనకోట గ్రామాలకు వెళ్లే రోడ్లపై చెట్లు విరిగి పడడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు వెంటనే సర్వే నిర్వహించి రైతులకు ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కోరారు.
హుస్నాబాద్‌లో తడిసి ముద్దయిన ధాన్యం
హుస్నాబాద్, ఏప్రిల్ 22: హుస్నాబాద్ పట్టణంలో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కల్లాల్లోని వరిధాన్యంతో పాటు మొక్కజొన్న పంట, మామిడి తోటలకు అపార నష్టం జరిగిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు అరగంట పాటు కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో రైతులు పోసుకున్న ధాన్యం తడిసి ముద్దయ్యింది. కొంత ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన ధాన్యాన్ని నీళ్లలోంచి తీసి రైతులు ఆరబెట్టుకుంటున్నారు. అప్పటి వరకు విపరీతమైన ఎండతో మండిపోయిన వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. పెనుగాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. వైర్లు తెగిపోయాయి.
కొమురవెల్లి మండలంలో…
కొమురవెల్లి, ఏప్రిల్ 22: కొమురవెల్లి మండలంలో శనివారం సాయంత్రం వాడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. కొమురవెల్లి మండల కేంద్రంతో పాటు ఐనాపూర్, పోసాన్పల్లి, గురువన్నపేట, రసూలాబాద్ గ్రామాల్లో కురిసిన వడగండ్లు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయ. పంట చేతికందే సమయంలో ఒక్కసారిగా కురిసిన వడగండ్ల వాన తమను నిలువునా ముంచిదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఈదురు గాలులకు గురువన్నపేటలో పలువురి ఇండ్లపై రేకులు ఎగిరిపడ్డాయి.
నారాయణరావుపేట మండలంలో…
నారాయణరావుపేట, ఏప్రిల్ 22: మండల కేంద్రమైన నారాయణరావుపేటతో పాటు గుర్రాలగొంది, మల్యాల, బంజేరుపల్లి, కోదండరావుపల్లి గ్రామాల్లో అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. శనివారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం తడిసి ముద్దయ్యింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మెదక్‌లో..
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 22: జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం ఆకస్మాతుగా అరగంట పాటు ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అక్కడక్కడ పిడుగులు పడిన భారీ శబ్ధాలు రావడంతో గంట పాటు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పట్టణంలో డ్రైనేజీలు పొంగి పొర్లాయి. ఈదురు గాలులకు నవాబుపేట వీధిలో విద్యుత్తు స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి.