గుమ్మడిదల, ఫిబ్రవరి 15: పార్యానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు ఏర్పాటును విరమించుకోవాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. బాధిత గ్రామాల్లో రోజుకో తీరుతో నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. శనివారం గుమ్మడిదలలో రైతు జేఏసీ కమిటీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వందల సంఖ్యలో ఆటోలు నడిపి జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. డంపింగ్‌యార్డును రద్దు చేయాలంటూ గుమ్మడిదల నుంచి దోమడుగు వరకు ర్యాలీ నిర్వహించారు. తిరుగు ప్రయాణంలో జేఏసీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు, రైతులు, మహిళా సంఘాలు సభ్యులు, యువజన సంఘాల సభ్యులు జాతీయ రహదారి మీదుగా ర్యాలీగా డంపింగ్ యార్డు వద్దకు వెళ్లారు. డంపింగ్‌యార్డు మాకొద్దు.. జై జవాన్.. జై కిసాన్, సేవ్ ఫార్మర్, సేవ్ ఫారెస్ట్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది.
జైజవాన్, జైకిసాన్ అంటూ మహిళల నినాదాలు చేశారు. తోపులాట జరిగినప్పుడు మహిళలను నియంత్రించడానికి మహిళా పోలీసులు లేకపోవడం గమనార్హం. అనంతరం మహిళా పోలీసులు వచ్చారు. డంపింగ్‌యార్డు నిర్మాణాలు చేపడితే ఇక ఊరుకునేది లేదు.. ఎందాకైనా పోతామని హెచ్చరించారు. గుమ్మడిదలలో శనివారం 5వ రోజు రిలే నిరాహార దీక్షలో మున్సిపల్లోని మైనార్టీలు కూర్చున్నారు. నల్లవల్లిలో 11వ రోజు రిలే నిరాహార దీక్షలో గ్రామ జేఏసీ నాయకులు అర్థనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. బొంతపల్లిలో రైతు జేఏసీ నాయకులు నాగేందర్‌గౌడ్, ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, సద్దివిజయభాస్కర్రెడ్డి, రాజు, గ్యారల మల్లేశ్, సుంకరిశంకర్, సంజీవరెడ్డి, జైపాల్‌రెడ్డి తదితరులు ఆధ్వర్యంలో ఎద్దుల బండ్లపై గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా వరకు ర్యాలీగా వెళ్లారు.
ఈ సందర్భంగా రైతుజేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఇప్పటికే పారిశ్రామిక కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, డంపింగ్ యార్డు ఏర్పాటైతే తమ బతుకులు ఇక ఆగమే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి పరిశ్రమల కాలుష్యం, డంపింగ్‌యార్డు వ్యర్థాలతో బతకలేమన్నారు. భూగర్భజలాలు కలుషితమవుతాయని, భూములున్నా పంటలు వేసుకోలేని దుస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 11 రోజులుగా నిరసనలు చేస్తున్నా సర్కారు మొద్దునిద్ర వీడక పోవడం సరికాదన్నారు. వెంటనే డంపింగ్‌యార్డు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆందోళనల్లో రైతు సంఘం అధ్యక్షుడు సదానందరెడ్డి, ఆలయకమిటీ అధ్యక్షుడు మద్దుల బాల్‌రెడ్డి, రైతు జేఏసీ కమిటీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్‌రెడ్డి, మహిళా జేఏసీ అధ్యక్షురాలు మల్లమ్మ, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, కొత్తపల్లి ప్రభాకర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, పుట్ట నర్సింగ్‌రావు, మాజీ ఎంపీపీ సద్దిప్రవీణావిజయభాస్కర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్, మైనార్టీ నాయకుడు హుస్సేన్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, కాలకంటి రవీందర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, చక్రపాణి, గోపాల్, వేణు, శంకర్‌యాదవ్, కుమార్, ఫయాజ్ షరీఫ్, కుమ్మరి ఆంజనేయులు, రామకృష్ణ, మల్లేశ్ గౌడ్, చాపల మధు, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.