మెదక్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్లో అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. మెదక్ జిల్లాలోని ఆయా మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కలెక్టర్ రాజర్షి షా వ్యవసాయ, ఉధ్యానవన శాఖ అధికారులతో కలిసి పర్యటించి నష్టపోయిన పంటలకు సంబంధించి నివేదికలను ప్రభుత్వానికి అందజేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 98 మంది రైతులకు 88.25 ఎకరాలకు సంబంధించి పంట నష్టపరిహారం రూ.8 లక్షలను విడుదల చేసింది.
ఎకరాకు రూ.10వేలు..
అకాల వర్షంతో నష్టపోయిన పంటలకు సీఎం కేసీఆర్ ఎకరాకు రూ.10వేల చొప్పున రైతులకు నష్టపరిహారాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లాలో యాసంగిలో 1.98 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. ఇటీవల కురిసిన వడగండ్ల వానతో పంటలకు తీరని నష్టం జరిగింది. ముఖ్యంగా ఉద్యాన పంటలు బాగా పాడయ్యాయి. ప్రభుత్వ ఆదేశాలతో సర్వే చేపట్టిన వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు మొదట ప్రాథమిక నివేదికను అందజేశారు. అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి మొత్తం 88.25 ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయని నిర్ధారించి, నివేదికను కలెక్టర్కు సమర్పించారు. దీంతో ప్రభుత్వానికి నివేదిక పంపగా జిల్లాలో 98 మంది రైతులకు 88.25 ఎకరాలకు సంబంధించిన ఎకరాకు రూ.10వేల చొప్పున రూ.8 లక్షలు విడుదలయ్యాయి. ఈ నష్టపరిహారాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నది.
ప్రభుత్వం నుంచి జీవో వచ్చింది..
మెదక్ జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 98 మంది రైతులకు గాను 88.25 ఎకరాలకు సంబంధించి రూ. 8లక్షల 86వేల మంజూరయ్యాయి. వచ్చే నెల 5 వరకు రైతు ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటాం. 30 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించాం.
– రాజర్షి షా, మెదక్ జిల్లా కలెక్టర్