హుస్నాబాద్, డిసెంబర్ 14: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్‌లో పెట్టడంతో విద్యాసంస్థల నుంచి విద్యార్థులకు వేధింపులు ఎదురవుతున్నాయని, వాయిదా పద్ధ్దతుల్లోనైనా వెంటనే చెల్లింపులు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి కోరారు. శనివారం హుస్నాబాద్‌లోని అనభేరి సింగిరెడ్డి స్మారక భవనంలో జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం అనంతరం మీడియాతో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్వాడీలు, ఆశవర్కర్ల బకాయిలు సైతం పెరిగి పోతున్నాయని, వీటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లులు పూర్తిస్థాయిలో చెల్లించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని సూచించారు.
ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ రూ.2లక్షల రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పంట రుణమాఫీలో జరిగిన లోటుపాట్లు, ఇతర సమస్యలు ఉంటే వెంటనే సరిచేసి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా సాయం ఇచ్చి ప్రభుత్వం పేరు నిలబెట్టుకోవాలని ఆయన పేర్కొన్నారు. రైతుభరోసా విధివిధానాల ఖరారు కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. మోదీ సర్కారు రాజ్యాంగాన్ని మార్చి, జమిలీ ఎన్నికలకు నిర్వహించాలనే కుట్రలు చేస్తున్నదని, దీనిని తిప్పికొట్టాల్సిన అవరసం ఎంతైనా ఉందన్నారు. అదానీ వ్యవహారంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని వేయాలని డిమాండ్ చేశారు.
త్వరలోనే కేంద్రం విధానాలపై ప్రత్యక్ష పోరాటాలు చేస్తామన్నారు. సీపీఐ ఆవిర్భవించి వందేండ్లు అవుతున్న సందర్భంగా శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. బెజ్జంకి మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఈనెల 19న రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతిస్తామని తెలిపారు. 26న గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలపై చర్చిస్తామన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్, సత్యనారాయణ, వనేశ్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.