జహీరాబాద్, జనవరి 13: రూ.2 లక్షలకుపైగా ఉన్న రైతులకు పంట రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం గోవింద్పూర్ గ్రామానికి చెందిన రైతులు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు మొరపెట్టుకున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ఉప్పర్‌పల్లి తండాలో మోతీమాత జాతరకు వెళ్తున్న క్రమంలో గోవింద్‌పూర్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావుతో పలువురు రైతులు మాట్లాడుతూ.. రూ. 2 లక్షలకు పైగా పంట రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. అందులో కొందరికి అసలే మాఫీ కాలేదన్నారు. రూ. 2 లక్షలకు పైన ఉన్న రుణాన్ని బ్యాంకు లో చెల్లించాలని చెప్పడంతో డబ్బులు చెల్లించామన్నారు.
ఇప్పటివరకు రూ. 2 లక్షలకు పైగా ఉన్న రైతుల రుణమాఫీ చేయకుండా నట్టేట ముంచారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ ఇట్లుంటే రైతు భరోసా కింద వానకాలం, యాసంగి సీజన్లకు ఆర్థిక సహాయాన్ని ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనలోనే రైతులకు అన్ని విధాలుగా మేలు జరిగిందన్నారు. రుణమాఫీ, రైతు భరోసాపై రైతుల పక్షాన ప్రభుత్వంతో పోరాడి న్యాయం చేసేలా చూడాలని రైతులు విజ్ఞప్తి చేశారు.