తూప్రాన్, సెప్టెంబర్ 26: తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో బుధవారం మంత్రి హరీశ్‌రావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను ప్రారంభించనున్నారు. ఉదయం పది గంటలకు మనోహరాబాద్ చేరుకోనున్న మంత్రి మొదట మనోహరాబాద్ మండల కేంద్రంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని రావెళ్లిలో నిర్మించిన యాదవ సంఘం భవనాన్ని ప్రారంభించనున్నారు.
తదనంతరం తూప్రాన్ పట్టణంలో డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ, మహా కవయిత్రి మొల్లమాంబ, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. తర్వాత తూప్రాన్ పట్టణంలో ముదిరాజ్ కమ్యూనిటీ భవనానికి, పట్టణంలోని ఈద్గా ఆధునీకరణ, అంబేద్కర్ భవనం కమ్యూనిటీహాల్, మాల జంగం ఎస్సీ కమ్యూనిటీ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. చిల్డ్రన్స్ పార్క్, ఓపెన్ జిమ్‌లను ప్రారంభించనున్నారు.
వినాయక్ నగర్లో పూర్తయిన సీసీ రోడ్లను ప్రారంభించనున్నారు. మెదక్ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ తూప్రాన్ మున్సిపాలిటీకీ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. రూ.25 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, తూప్రాన్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించనున్నారు.
మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
బుధవారం మంత్రి హరీశ్‌రావు పర్యటన నేపథ్యంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ‘గడ’ ప్రత్యేకాధికారి ముత్యం రెడ్డి, అదనపు కలెక్టర్ రమేశ్, తూప్రాన్ ఆర్డీవో జైచంద్రారెడ్డి, డీఎస్పీ యాదగిరిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్, పలు శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ రాజర్షిషా ఏర్పాట్లను పరిశీలించారు.