సిద్దిపేట, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు తప్పా చేతల్లో లేదు. రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. రైతులకు అన్ని కష్టాలే… ఎన్నికలు వచ్చాయంటే చాలు రైతు భరోసాకు నిధులు రెడీగా ఉన్నాయి… ఎన్నికల కోడ్ అవ్వగానే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమచేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదలుకొని మంత్రుల వరకు ఉపన్యాసాలతో ఊదరగొట్టారు. సంక్రాంతి పండుగకు వేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంత వరకు దిక్కు లేదు. అదిగో రైతు భరోసా.. ఇదిగో రైతు భరోసా అంటూ ఊరించుడే తప్పా రైతు భరోసా ఇవ్వలేదు. ఇప్పటికే ప్రభుత్వం రెండు విడతల రైతు భరోసా ఎగ్గొట్టింది.
ఇప్పడు మళ్లీ రైతు భరోసా ఊసే ఎత్తడం లేదు. పెట్టుబడికి డబ్బులు లేక రైతులు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు తీసుకువచ్చి సాగు పనులు చేస్తున్నారు. ఇంత చేసినా చివరకు రైతులకు ఏం మిగులుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రైతులకు భరోసా లేకుండా పోయింది. ఇంకా యూరి యా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సన్న వడ్ల బోనస్ డబ్బులు ఇప్పుడు విడుదల చేశారు. ఇలా అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు అడగకముందే 11 విడతల్లో రూ. 8,771 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసి రైతు సంక్షేమానికి దన్నుగా నిలిచింది. ప్రతి పంట సాగుకు ఏడాదిలో రెండు పంటలకు రైతుబంధు అందించి రైతుల్లో భరోసా కల్పించారు. ఇవ్వాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వరి, మొక్కజొన్న, జొన్న, సోయా. కూరగాయలు తదితర పంటలు ఎక్కువగా సాగవుతాయి.
రైతుభరోసాకు ఎదురు చూపులేనా?
రైతుభరోసా కోసం రైతులకు ఎదురు చూపులు తప్పేట్టులేవు. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల ముందు వేస్తున్నాం, ఖాతాల్లో జమ అవుతున్నాయి అని సీఎం రేవంత్రెడ్డి రైతులను మభ్యపెట్టారు. రాష్ట్రంలో 9 వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే వేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పడు ఓట్లు అయి పోయాయి. ఇక రైతుల గురించి పట్టించుకోరు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు వస్తేనే తప్పా..మళ్లీ రైతులు గుర్తుకు రారు. అప్పడు రైతు భరోసా వేస్తామంటూ ప్రచారం చేసుకుంటారు. కాంగ్రెస్ నాయకులు మాయ మాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అడగకుండానే రైతులకు అన్ని చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నింటికి ఎదురుచూపులే అవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి సాగుకు ముందే రైతుల ఖాతాల్లో నేరుగా ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు పంటలకు రూ. 10 వేల జమ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పథకాన్ని రైతు భరోసా పథకంగా మార్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తవుతున్నా కేవలం రెండు పంటలకే వేసింది.మొదటిది బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధం చేసిన డబ్బులను రైతుల ఖాతా ల్లో వేసింది.ఒక్కటి మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేసిందని చెప్పాలి.
ఎన్నికల్లో ఇచ్చిన మాట ఏది
ఎకరానికి రెండు పంటలకు రూ. 15 వేలు ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన సర్కార్ అధికారంలోకి వచ్చాక కేవలం ఎకరానికి రూ. 6 వేల చొప్పున రెండు పంటలకు రూ. 12 వేలు మాత్రమే వేస్తుంది. 2024-25 యాసంగి సీజన్లో ఆలస్యంగా రైతు భరోసాను కొర్రీలు పెట్టి వేసింది. అది కూడా పూర్తి స్థాయిలో రైతులకు పడలేదు. మొన్నటి వానకాలంలో కొంత సమయానికి వేసినా పూర్తి స్థాయిలో రైతులకు అందలేదు. కొంత మంది రైతులు మిగిలిపోయారు. ప్రస్తుతం యాసంగి సాగు కూడా పూర్తయ్యింది. మరో నెల రోజులు గడిస్తే పంటలు చేతికి వస్తాయి. రైతు భరోసా వస్తదనుకున్న రైతులకు ఎదురు చూపులే మిగిలాయి. తాజాగా ప్రభుత్వం సాగు విస్తీర్ణాన్ని లెక్కకట్టి శాటిలైట్ ద్వారా సర్వే చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాటలతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇది ఎంత మాత్రం రైతులకు ప్రయోజనకరంగా లేదు. సాగుతో సంబంధం లేకుండా సాగుకు యోగ్యమైన ప్రతి గుంటకు రైతు భరోసా వేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తగినంతగా నీళ్లు లేకపోవడంతో సాగు చేయడం లేదు. ఆ రైతులకు రైతు భరోసా వేయారా..? అని ప్రభుత్వాన్ని కర్షకులు ప్రశ్నిస్తున్నారు. ఇవేమి చూడకుండా సాగుకు యోగ్యంగా ఉన్న ప్రతి రైతుకు రైతు భరోసా వేయాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
