సిద్దిపేట, జూలై 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సర్కా రు బడులు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ బడులపై దృష్టిసారించడం లేదు. దీంతో సర్కారు విద్య నిర్వీర్యం అవుతున్నది. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండునెలలు కావస్తున్నా జిల్లాకు చెందిన మంత్రులు, ఇన్చార్జి మంత్రి రివ్యూలు నిర్వహించడం లేదు. మధ్యాహ్నం భోజనం సరిగ్గా అమలు కావడం లేదు. ఇప్పటికీ రెండో జత యూనిఫామ్స్, అందరికీ నోట్ పుస్తకాలు అందక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రైవేట్ పాఠశాలలపై నియంత్రణ కరువైంది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారీతిన ఫీజులు గుంజుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మధ్యాహ్న భోజన కార్మికులకు నెలలు తరబడి వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులకు పెడుతున్న గుడ్ల పైసలు రావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని పూర్తిగా రద్దు చేసింది.
ఉమ్మడి జిల్లాలో మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2,75,447 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి మధ్యాహ్నం భోజనం వడ్డించడానికి కార్మికులను ప్రభుత్వం నియమించింది. 25 మందిలోపు విద్యార్థులు ఉంటే ఒక కార్మికురాలిని, 26 మందిపైన విద్యార్థుల నుంచి 100లోపు ఉంటే ఇద్దరు కుక్ కం హెల్పర్ ఉంటారు. 100 మందికి పైగా విద్యార్థులు ఉంటే అడిషనల్‌గా మరొకరు ఉంటారు. వీరికి నెలకు రూ. 3వేల చొప్పున గౌరవ వేతనం ప్రభుత్వం చెల్లిస్తున్నది. కానీ, గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించడం లేదు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, జూన్‌కు సంబంధించి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. 9,10వ తరగతి మధ్యాహ్న భోజన బిల్లులు 2024 జనవరి వరకే వచ్చాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, జూన్ నెలల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.1నుంచి 8వ తరగతి వరకు బిల్లులు 2024 ఏప్రిల్ వరకే వచ్చాయి. జూన్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఇక ప్రతి పాఠశాలలో విద్యార్థులకు గుడ్లు పెడుతారు. ప్రతి వారంలో సోమ, బుధ, శుక్రవారాల్లో విద్యార్థులకు ఒక్కో గుడ్డు పెడుతున్నారు. ఈ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఒక్కోగుడ్డుకు ప్రభుత్వం రూ.5 కట్టిస్తున్నది. దాదాపుగా కోడిగుడ్ల బిల్లులు 2024 జనవరి వరకే వచ్చాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ , జూన్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నా యి. వేల రూపాయలు అప్పులు తెచ్చి భోజనాలు వం డిపెడితే బిల్లులు రాక తమకు భారంగా మారింది మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లేమి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అల్పాహారం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో పేద విద్యార్థులకు అల్పాహారం అందక ఇబ్బందికి గురవుతున్నారు.
హుస్నాబాద్ టౌన్, జూలై 9: మాది స్వర్ణ మహిళా సంఘం. పోయిన తాప కోడిగుడ్ల పైసలు ఇప్పటికీ ఇయ్యలేదు. ఇప్పుడు టమాట 80, మిర్చి 120 రూపాయలు.. కూరగాయలు… ఉప్పు, పప్పుల ధర బాగా పెరిగినయి. ఇది హుస్నాబాద్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన మధ్యాహ్న భోజన నిర్వాహకులు సావుల పద్మ, సరిత, జ్యోతి ఆవేదన. ఈ పాఠశాల ప్రారంభంలో 135మంది విద్యార్థులు ఉండగా.. తాజాగా మరో 50మందికి పైగా విద్యార్థులు చేరారు. ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న వారి కష్టాలు వర్ణణాతీతం.. ప్రభుత్వం వీరికి చెల్లించే ధరలకు మార్కెట్లో ఉన్న ధరలకు ఎక్కడా పొంతనలేదు. పైగా ఈ సంవత్సరం కూరగాయల ధరలు సైతం విపరీతంగా మండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోయిననెల కోడిగుడ్డు ధర ఏడు రూపాయలకు ఇచ్చిండ్రు.. ఇప్పుడు ఆరు రూపాయలు అంటండ్రు. మాకు సార్లు కట్టిచ్చేది ఐదు రూపాయలు…. టమాట ధర అయితే మస్తు పెరిగింది. ఏ కాయగూర కొందామన్నా రేట్లు కొనేతట్లు లేవు. ఇవన్ని ఒక్కెత్తు. మాకు పోయిన పారి పైసలే ఇంకరాలే. నెలకు యాభైవేల రూపాయలు అప్పు మా గ్రూపులోల్లం తెచ్చుకుంట ఈ చిట్టిలు కట్టుకు ఈ వంటచేసుడు చేసుకుంటున్నం. ఇండ్ల ఏమిలాభం లేకున్న ఏండ్లనుంచి సేత్తన్నం కదా అని సేసుడు అయితంది. సర్కారు మా వంట చేసేటోల్ల బాధను సూసి పైసలు పెంచి మమ్మల్ని ఆదుకోవాలే.
హుస్నాబాద్, జూలై 9: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సర్కారు పాఠశాలల నిర్వహణ గాడి తప్పింది. విద్యార్థులకు ఉదయం పూట ఇచ్చే సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని రద్దు చేశారు. గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పటికి కొన్ని పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు అందలేదు. ఉపాధ్యాయులపై పర్యవేక్షణ కరువైంది. దీంతో తరగతుల నిర్వహణ సక్రమంగా లేదు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఆరు నెలలుగా గౌరవ వేత నం రావడం లేదు. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు. ప్రభుత్వ తీరుపై విద్యార్థులతో కలిసి ఆందోళనలు చేపడుతాం.
ప్రతిరోజూ బడిలో చదివే విద్యార్థులకు సమయానికి అన్నం వండి పెడుతున్న మాకు టైమ్‌కు పైసలు రావడం లేదు. ప్రభుత్వం మా వేతనాలు పెండింగ్‌లో పెట్టకుండా నెలనెలా ఇవ్వాలే. అప్పులు తెచ్చి వంటలు చేస్తే మాకు పైసలు టైమ్‌కు రాక చానా ఇబ్బందులు పడుతున్నాం. తెచ్చిన అప్పులకు మిత్తీలు పోనూ మాకు ఏమి మిగులుత లేవు. మమ్మల్ని ఆదుకొని సమయానికి పైసలు అయ్యాలి.
సిద్దిపేట, జూలై 9: రెకాడితేనే డొకాడని బతుకులు మావి. రెండేండ్లుగా మేము మధ్యాహ్న భోజనం కార్మికులుగా పనిచేస్తున్నాం ప్రభుత్వం నెలనెలా బిల్లులు మంజూరు చేయాలి. పెంచిన వేతనాలను నెలనెలా ఇవ్వాలి. 6 నుంచి 8వ తరగతులకు మాత్రమే ఏప్రిల్ -20 24వరకు బిల్లులు వచ్చాయి. 9 నుంచి 10వ తరగతి వారికి ఫిబ్రవరి నెల వరకు బిల్లులు ఇచ్చారు. మళ్లీ బిల్లులు మంజూరయ్యా అని చెప్తున్నారు. మా సూల్లో 200 మంది విద్యార్థులు ఉన్నారు వారికి వారంలో రెండుసార్లు కోడిగుడ్లు పెడుతున్నం. ప్రభుత్వం ఒక్కో కోడిగుడ్డుకు రూ.4 మాత్రమే ఇస్తున్నది. మేం బయట కోడిగుడ్డుకు రూ .6.50 పెట్టి కొంటున్నం. కోడిగుడ్డు రేటును పెంచాలి. ప్రభుత్వం చెప్పినట్లు మాకు జీతం నెలకు రూ.10 వేలు ఇయ్యాలే. కోడిగుడ్ల బిల్లు జనవరి వరకు మాత్రమే వచ్చాయి. వాటిని తొందరగా ఇయ్యాలి. ఇప్పుడు వస్తున్న వేతనంతో మాకు ఇల్లు గడవడం కష్టంగా ఉంది. పొద్దున్న వస్తే మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉండటంతో మేము వేరే ఏ పనిచేసుకోలేక పోతున్నాం. ప్రభుత్వం మాపై దయచూపి జీతాలు పెంచాలి.
దుబ్బాక, జూలై 9 : దుబ్బాకలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చాలాకాలంగా వంటచేసి పెడుతున్నాం. గ్యాస్‌స్టౌవ్‌పై అన్నం సరిగ్గా ఉడకడం లేదంటే, కట్టెలు తెచ్చి వంట చేస్తున్నాం. కట్టెల మీద వంట చేయడంతో పొగతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మా మహిళా సంఘంలో 12 మందికి మూడు నెలలకు నలుగురు సభ్యులం చొప్పున విద్యార్థుల వంటచేసి భోజనం అందిస్తున్నాం. పాఠశాలలో 250 మంది విద్యార్థులు ఉన్నారు. వారంలో మూడురోజులు కోడిగుడ్డు ఇస్తున్నాం. రోజుకు రెండురకాల కూరలు వండి పెడుతున్నాం. నెలకు లక్ష రూపాయలపైనే ఖర్చు అవుతున్నది. అప్పులు చేసి, పిల్లలకు భోజనం వండిపెడుతున్నాం. 6 నెలలుగా మాకు బిల్లులు రావడం లేదు. కిరాణా దుకాణాల్లో ఉద్దెర ఇవ్వడం లేదు. మిత్త్తికి డబ్బులు తెచ్చి వంటచేస్తున్నం. అన్ని లెక్కలు వేస్తే మాకు రోజుకు ఒక్కరికి రూ. 200 కూడా రావడం లేదు. కూలీ పనులకు వెళ్లినా బాగుండేది.
గజ్వేల్, జూలై 9: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులను పెండింగ్ బిల్లులు చెల్లించాలి. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన బిల్లులు వెంటనే విడుదల చేయాలి. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ప్రతినెలా బిల్లులు, గౌరవ వేతనం సకాలంలో చెల్లిస్తే బాగుంటుంది. బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో సరుకులు తేవడానికి ఇబ్బందిగా ఉంది. కిరాణా దుకాణంలో అప్పులు చేసి సరుకులు తెస్తున్నాం.
రామాయంపేట, జూలై 9: మూడు నెలలు గడుస్తున్నా మాకు గౌరవ వేతనాలు రావడం లేదు. పని చేస్తేనే మా కుటుంబాలు గడుస్తాయి. నాకొచ్చే జీతంతోనే మా కుటుంబం బతుకుతున్నది. ప్రభుత్వం సకాలంలో వేతనాలు ఇస్తే మాకు బాధలు ఉండవు. కిరాణా దుకాణంలో బకాయిలు పెరిగి పోతున్నాయి. పైసలకు ఇబ్బందిగా ఉంది. మాకు నెలనెలా పైసలు ఇవ్వాలి.