చండీఘడ్: హర్యానాలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో(Rajya Sabha Polls) ఉత్కంఠ పోరు సాగింది. అయితే బీజేపీ నుంచి సంజయ్ భాటియా, కాంగ్రెస్ పార్టీ నుంచి కరమ్‌వీర్ సింగ్ బోద్ విజయం సాధించారు. క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హర్యానా ఎన్నికలపై అందరి ఫోకస్ పడింది. ఆ రాష్ట్రం నుంచి రెండు సీట్లే ఖాళీ ఉండగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా సతీశ్ నందల్ పోటీ చేశారు. సతీశ్‌కు బీజేపీ మద్దతుగా నిలిచింది. సోమవారం అర్థరాత్రి వరకు ఈ రేసు ఆసక్తికరంగా సాగింది.
అర్థరాత్రి సీఎం నయాబ్ సింగ్ సైని ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజయం సాధించిన ఇద్దరు అభ్యర్థులకు ఆయన కంగ్రాట్స్ తెలిపారు. బీజేపీ మద్దతు ఇచ్చిన సతీశ్ నందల్ స్వల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడినట్లు సీఎం సైని పేర్కొన్నారు. అయిదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారని, మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లను అనర్హమైనవిగా ప్రకటించినట్లు సైని చెప్పారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ నేత బీకే హరి ప్రసాద్ తెలిపారు.తమ అభ్యర్థిని ఓడించేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నించినట్లు కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా ఆరోపించారు.కానీ ఆ అగ్నిపరీక్షలో నెగ్గినట్లు చెప్పారు.
రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్‌కు తీసుకెళ్లిందని సీఎం సైని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను నమ్మడం లేదని ఆయన అన్నారు. ఓటింగ్‌కు దూరంగా ఉన్న ఐఎన్ఎల్డీ పార్టీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు బీ టీమ్‌గా ఆ పార్టీ వ్యవహరించిందన్నారు.