Karimnagar | తిమ్మాపూర్, మార్చి17: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.10 లక్షల విలువైన ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు.
మంగళవారం తెల్లవారుజామున ఆలయాన్ని శుద్ధి చేసేందుకు వచ్చిన సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు. ఆలయ తాళాలు పగులగొట్టి ఉండటంతో అనుమానం వచ్చి పూజారులకు సమాచారం అందించారు. అర్చకులు వచ్చి పరిశీలించగా, స్వామి వారి కిరీటం, అమ్మవారి నగలు, ఇతర ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆలయ కమిటీకి, పోలీసులకు అర్చకులు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి వచ్చి పరిశీలించారు. ఫోరెన్సిక్, క్లూజ్ టీమ్‌తో కలిసి ఆధారాలు సేకరించారు. కాగా, అపహరణకు గురైన ఆభరణాల విలువ దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.