సిద్దిపేట, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రోహిణి కార్తె పోయి… మృగశిర కార్తె వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. అదును దాటితే పంట దిగుబడి కష్టం. ఈ పరిస్థితుల్లో అన్నదాత పంట పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. విత్తనాలు, ఎరువులు కొందామంటే చేతిలో రూపాయి లేక రైతులు వడ్డీ వ్యాపారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న వ్యాపారులు అధిక ధరలకు విత్తనాలు అమ్మడమే గాక, కొన్నిచోట్ల అమాయక రైతులకు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సాగుకు ముందే పంట పెట్టుబడి సాయం అందింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంత వరకు ‘రైతు భరోసా’పై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇంతకు రైతు భరోసా ఇస్తారా…? లేదా..? అని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మొన్నటి యాసంగి పంటకు సంబంధించిన సాయం కూడా పూర్తి స్థాయిలో వేయలేదని రైతులు చెబుతున్నారు.
నాలుగైదు రోజులుగా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. రైతులకు అవసరమైన విత్తనాలు దొరకక ఇబ్బంది పడుతున్నారు. సరైన విత్తనం దొరికితేనే పంట అధిక దిగుబడి వస్తుంది. అది కాకుండా కొన్ని కంపెనీలకు చెందిన విత్తనాలను మాత్రమే అందుబాటులో ఉంచడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తమకు కావాల్సిన విత్తనాల కోసం బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేద్దామంటే రైతుల వద్ద చేతిలో రూపాయి లేక వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. వారు ఇచ్చిన విత్తనాలు, ఎరువులు తీసుకుంటున్నారు తప్పా… రైతులకు నచ్చిన విత్తనాలు లభ్యం కావడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతు భరోసా ఇస్తే రైతులకు అనుకూలంగా ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎకరాకు రెండు పంటలకు రూ. 10 వేలు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు రెండు పంటలకు రూ. 15 వేలు ఇస్తానని హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ఈ వానకాలం సాగుకు ఎకరాలకు రూ. 7,500 ఇవ్వాలి కదా ..! ఎప్పుడు ఇస్తారు అని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అని చెప్పి గత యాసంగి రైతు బంధును నిలిపివేయడంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. రైతులు అధిక వడ్డీలకు అప్పులు తీసుకువచ్చి తమ పంటలను కాపాడుకున్నారు. చవరికి పంట చేతికి రాకపోవడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
కనీసం ఆ రైతుల కుటుంబాలను కాంగ్రెస్ ప్రభుత్వం పలకరించిన పాపాన పోలేదు. పంటలను కాపాడుకోవడానికి తమ వద్ద ఉన్న పాస్‌బుక్కులు, బంగారం, ఇతర వస్తువులను వడ్డీ వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టారు. ఇవన్నీ గత ఏప్రిల్‌లో పోలీసుల తనిఖీల్లో వడ్డీ వ్యాపారులు తాకట్టు పెట్టుకున్న విషయం బయట పడ్డాయి. రైతుల వద్ద నుంచి ముక్కు పిండి వడ్డీ వసూలు చేసినట్లు స్పష్టంగా కనిపించింది. సిద్దిపేట జిల్లాలో వడ్డీ వ్యాపారులపై 42 కేసులు నమోదు చేసి రూ.1,39,79,580 రూపాయల 286 ప్రామిసరీ నోట్లను స్వాధీ నం చేసుకున్నారు. ఆ సమయంలో చాలా మంది వడ్డీ వ్యాపారులు పరారీలో ఉన్నారు. లెక్క తేలనివి చాలా ఉన్నాయి. ఇది కొద్ది మంది వడ్డీ వ్యాపారుల వద్ద దొరికనవి మాత్రమే అని చెప్పాలి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పుట్టుగొడుగుల్లా ఫైనాన్స్‌లు వెలిశాయి. నూటికి నెలకు మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయల పైన వసూలు చేస్తున్నారు. ప్రతి నెలా వడ్డీ వసూలు చేస్తున్నారు. జిల్లాలో ప్రైవేట్ ఫైనాన్స్ యజమానులు సాగు సమయంలో రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. సాగు సమయంలో రైతులు పంట పెట్టుబడి సాయం కోసం తప్పని పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులకు రైతు భరోసా అందిస్తే వడ్డీ వ్యాపారుల నుంచి రైతులకు ఉపశమనం కలుగుతుంది.
రైతుబంధు ప్రారంభించి నాటి నుంచి గత వానకాలం వరకు (11వ విడతల్లో) సిద్దిపేట జిల్లాలో 29,33,494 మంది రైతులకు రూ. 3,124.82 కోట్లు, మెదక్ జిల్లాలో 24,69,637 రైతులకు రూ.2,027.37 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 31,95,960 మంది రైతులకు రూ.3,619.54 కోట్లు, మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో 85,99,091 మంది రైతులకు రూ. 8,771.73 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో కేసీఆర్ ప్రభుత్వం జమ చేసింది.